Idream media
Idream media
ఏపీలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలనాపరంగానే కాదు.. రాజకీయాల పరంగా కూడా విభిన్నత కనిపిస్తోంది. అందుకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికే నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్నికలంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీయే ధన ప్రవాహం కురిపిస్తుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, పరువు కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ, తిరుపతి ఎన్నికల్లో కొత్త చరిత్ర కనిపించింది. ఒక్క రూపాయి పంచకుండా, మద్యం ఇవ్వకుండా.. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర లేపారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి కూడా దూరంగా ఉండి.. కేవలం తాను చేసిన పనులను చూసి మీరే నిర్ణయం తీసుకోండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్.
తిరుపతి ఎన్నికల్లో ప్రతిపక్ష, అధికార పార్టీ మధ్య విరుద్ధమైన సారుప్యతలు కనిపించాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా అగ్రనేతే రంగంలోకి దిగి సుమారు వారం రోజుల పాటు ప్రచారం చేశారు. ఓ ఉప ఎన్నికను ఇంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు అరుదు. అంతేకాకుండా ప్రచార శైలి కూడా ఆ సీటుతోనే అధికారంలో వస్తామనో, లేదా అధికారం కోల్పోతామో అన్న రీతిలో సాగింది. నాటకీయ పరిణామాలు కూడా అలాగే చోటుచేసుకున్నాయి. ఇక అధికార పార్టీకి చెందిన అధ్యక్షుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏ విషయంలోనూ ఆవేశపడడం లేదు.
ప్రతిపక్షాల జిమ్మిక్కులను ఏ కోశానా పట్టించుకోలేదు. కేవలం ఒకే ఒక లేఖ ద్వారా ప్రజల మన్ననలను పొందే ప్రయత్నం చేశారు. అలాగే, ఈ ఎన్నికల్లో మన పార్టీ నుంచి ఎవరూ డబ్బు, మద్యం పంచవద్దని, చేసిన పనులను మాత్రమే తెలిపి ఓట్లను అడగాలని నేతలను ఆదేశించారు. ఇటువంటి ప్రకటన బహుశా ఏ పార్టీ నాయకుడూ అభ్యర్థులకు చెప్పి ఉండరనడం అతిశయోక్తి కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.
జగన్ పాలన, సంక్షేమ పథకాలతో ఓటర్ల మనసు గెలిస్తే, బీజేపీ, టీడీపీ గగ్గోలు పెట్టే తీరు చూస్తే వారు ఓడిపోతున్నారనే భావన కనిపిస్తున్నట్లుగా ఉంది. గతంలో 2019లో వైసీపీ ఈవీఎంల వల్ల గెలిచిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపుల వల్ల గెలిచారని అన్నారు. తిరుపతిలో వైసీపీ దొంగ ఓట్ల వల్ల గెలవబోతోందని అంటున్నారు. ప్రతీ సారి ఏదో సాకులు వెదుక్కోవడం విపక్షాల వంతు అవుతోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. దొంగ ఓట్లు వేస్తున్నారని వీధులకెక్కి గగ్గోలు చేస్తు న్నారని, పోలింగ్ బూతుల్లో మీకు ఏజెంట్లు లేరా అని రోజా నిలదీశారు. ఏజెంట్లు ఉంటే అక్కడ దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వాళ్లను ఎందుకు పట్టుకోలేదని ఆమె ప్రశ్నించారు.రోడ్డు మీద ఆల్రెడీ డ్రామాను క్రియేట్ చేసుకుని, మీ అనుకూల మీడియాతో వైసీపీ మీద బురద చల్లి, జగన్‌మోహన్‌రెడ్డి పేరు ప్రతిష్టలు తగ్గించాలని, అలాగే పార్టీకి చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఖర్మ వైసీపీకి, జగన్‌మోహన్‌రెడ్డికి లేదని ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడికి కూడా తెలుసన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రోజున ట్విటర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్‌లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టే నీచ సంస్కృతిని గిన్నిస్ బుక్ రికార్డులకు తీసుకెళ్లిన ఘనత ప్రతిపక్షనేత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నంద్యాల బై ఎలక్షన్‌లో ఓటర్లకు డబ్బును పంచడం పరాకాష్టకు చేరిందని తెలిపారు. తిరుపతిలో జరిగిన ఉపఎన్నికలో కేవలం అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు వేయండని అడిగిన ఘనత సీఎం జగన్‌కే చెల్లుతుందని అన్నారు. డబ్బు ప్రబావం లేని ఎన్నికలకు సీఎం జగన్ నాంది పలికారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.