ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 2,602 మందికి కరోనా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. కాగా సామాన్య ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులకు కూడా కరోనా సోకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు సహా అనేకమంది నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.
వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో ఆయనకు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. ఆయనతో పాటు మధుసూదన్ రెడ్డి భార్యకు కూడా కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధి కావడంతో ఆయన ఎవరెవరిని కలిసారో వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.
రాష్ట్రంలో శుక్రవారంనాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 42 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఏపీలో 19,814 యాక్టివ్ కేసులు ఉండగా 20,298 మంది కరోనా నుంచి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.