iDreamPost
android-app
ios-app

పాదాభివందనాలకు సీఎం జగన్ దూరం

  • Published Jun 30, 2021 | 10:48 AM Updated Updated Jun 30, 2021 | 10:48 AM
పాదాభివందనాలకు సీఎం జగన్ దూరం

ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. తన కంటే ఉన్నత స్థానంలో ఉన్నారన్న భావనతోనో.. పదవికి గౌరవం ఇవ్వాలన్న ఆలోచనతోనో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి పాదాభివందనం చేయబోతే సీఎం వెంటనే వారించారు. రాజకీయాల్లో పాదాభివందనాలు చేయడం సర్వ సాధారణం. కానీ జగన్ ఆ సంస్కృతికి చాలావరకు బ్రేక్ వేస్తున్నారు.

గతం నుంచి వస్తున్న ఈ సంప్రదాయం రాను రాను ఎబ్బెట్టుగా మారిపోతోంది. చాలామంది ఎదుటివారిపై గౌరవభావంతో కాకుండా అవసరార్థం.. తప్పదన్నట్లు పాదాభివందనాలు, వంగి వంగి దండాలు పెడుతుంటారు. దీనివల్ల ఒక ఉన్నత సంప్రదాయం విలువ మంటగలిసి పోతోంది. వాటిని స్వీకరించినవారి గౌరవాన్ని పెంచకపోగా తగ్గిస్తుంది. అదీ కాకుండా వయసులో తమకంటే చిన్నవారిని.. వారు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే.. పాదాభివందనం చేయకూడదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలా చేస్తే ఎదుటివారికి ఆయుక్షీణమని కూడా అంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సీఎం జగన్ పాదాభివందానాలకు దూరంగా ఉంటారు. అదీ కాకుండా వయసులో పెద్దవారిని, తనతో కలిసి పనిచేసేవారిని సమాన భావంతోనే చూస్తున్నారు తప్ప.. వారి నుంచి పాదాభివందనాలు అందుకొని తాను ఉన్నతుడనని అనిపించుకోవడం అతని తత్వం కాదు. అందుకనే అందరినీ అన్నా అని లేదా పేరుతో గానీ ఆప్యాయంగా పిలుస్తుంటారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని పాదాభివందనం చేయకుండా జగన్ వారించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రెండుసార్లు ఇలాగే చేయబోగా వారించారు. డిప్యూటీ సీఎంతో పాటు సందర్శకులు..ఇంకా తన వద్దకు వచ్చే ఇతరులు ఎవరి నుంచి కూడా పాదాభివందనం అందుకోవడానికి జగన్ ఇష్టపడరు. సాధారణ నమస్కారం, ఆత్మీయ పలకరింపులే చాలనుకునే జగన్ వ్యక్తిత్వం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే గతంలో ఉన్న పాలకుల్లో చాలామంది పాదాభివందనాలు, వంగి దండాలు పెట్టడాన్ని కోరుకునేవారు.

Also Read : చంద్రబాబు చేయలేనిది జగన్ చేసి చూపించారు !

శృతి తప్పిన సంప్రదాయం

వయసులో పెద్దవారిని, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని గౌరవించడం మన సంప్రదాయం. దాన్ని చాటుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయి. పాదాభివందనం వాటిలో ఒకటి. కాలక్రమంలో రాజకీయాల్లోకి ఈ సంస్కృతి ప్రవేశించింది. గౌరవాన్ని కాకుండా నాయకుల పట్ల విధేయత ప్రకటనకు కొలమానంగా మారింది. వ్యక్తిపూజకు, వీర విధేయతకు పెద్దపీట వేసే తమిళనాడు రాజకీయాల్లో మొదట ఈ సంస్కృతి ప్రబలింది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలితల హయాంలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులు మొదలుకొని మంత్రుల వరకు అధినేతల మెప్పు పొందేందుకు, వారి దృష్టిలో పడేందుకు తాపాత్రయపడుతూ పాదాభివందనాలు చేయడానికి పోటీ పడేవారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పాదాభివందనాల సంస్కృతి మొదలైంది. సరే.. వందలాది సినిమాల్లో దేవుడి పాత్రలు చేసి.. ప్రత్యక్ష దైవంగా ముద్రపడ్డారు కనుక ఆయనకు పాదాభివందనాలు చేయడం పెద్ద విశేషం కాదు.

కానీ ఆయనకు వెన్నుపోటు పొడిచి.. టీడీపీని, ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్న చంద్రబాబు ఎన్టీఆర్ కు ఇచ్చినట్లే అందరూ తనకు కూడా గౌరవం ఇవ్వాలని కోరుకునేవారు. పాదాభివందనాలతో తనపట్ల భక్తిప్రపత్తులు ప్రకటించాలని ఆశించేవారు. అందువల్లే తనకంటే పెద్దవారు పాదాభివందనం చేయడానికి వస్తే.. ఏమాత్రం వారించడానికి ప్రయత్నించకపోగా.. దర్జాగా చేయించుకునేవారు. ఆయనకు అదో ఫాషన్ గా మారిపోయింది. 2019 ఎన్నికల సమయంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి, మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి వారు చంద్రబాబుకు పాదాభివందనాలు చేసే దృశ్యాలు అప్పట్లో నిత్యం టీవీల్లో కనిపోయించేవి. నిజమైన గౌరవంతో కాకుండా అవసరార్థ కృత్యంగా, వ్యక్తి పూజకు దారితీసే ఈ విధానాన్ని ప్రోత్సహించక పోవడమే మంచిది. సరిగ్గా అదే ఉద్దేశంతోనే సీఎం జగన్ పాదాభివందానాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read : ప్రకాశం వాసుల చిరకాల స్వప్నం సాకారం చేసిన జగన్‌ సర్కార్‌