iDreamPost
iDreamPost
ఏపీలో పెన్షన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 17లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారంటేనే ఆశ్చర్యపడాల్సి వస్తోది. గతానికి భిన్నంగా ప్రతీ నెలా అర్హులైన లబ్దిదారులను జాబితాలో చేరుస్తున్నారు. చంద్రబాబు హయంలో ఆ ప్రాంత పరిధిలో ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కొత్త వారికి పెన్షన్ కేటాయించిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఎదుటి వారు ఎప్పుడు చనిపోతారా అని కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు కోరుకోవాల్సిన దుస్థితిపై వైఎస్సార్ వంటి వారు తీవ్రంగా మండిపడిన రోజులు కూడా ఉన్నాయి. వాటన్నంటినీ సరిదిద్ది అర్హులు ఉంటే వారికి వెంటనే పెన్షన్ కేటాయించేలా, వాలంటీర్ సహాయంతో నిర్ణయం తీసుకునే వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
గతంలో పెన్షన్ కావాలంటే ఆరు నెలలకు ఒకసారి జరిగే గ్రామ సభ లేదా మండల కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. పైగా అది ఆమోదం పొంది చేతికి పెన్షన్ రావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. కానీ ప్రస్తుతం అర్హులు ఉంటే వాలంటీర్ ద్వారా సచివాలయాన్ని సంప్రదిస్తే తక్షణమే పెన్షన్ మంజూరు చేసే పరిస్థితి వచ్చింది మరుసటి నెల నుంచే పెన్షన్ అందుకునే అవకాశం వచ్చింది. పైగా పెన్షన్ల పంపిణీలో కూడా ప్రభుత్వం తీసుకొచ్చి విప్లవాత్మక మార్పు ద్వారా పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పండుటాకులు ఎదురు చూసే రోజులు పోయాయి. తెల్లవారు జామున 5గం.లకే నిద్ర లేపి పెన్షన్ అందించే వ్యవస్థ రంగంలోకి వచ్చింది. ఆరోగ్య బాగోలేక ఆస్పత్రిలో ఉంటే మంచం వద్దకే తెచ్చి పెన్షన్ ఇచ్చి వెళుతున్న వాలంటీర్లున్నారు.
అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంపుదల చేస్తామని ప్రకటించిన దానికి అనుగుణంగా ప్రమాణ స్వీకారం నాడే రూ 250 చొప్పున పెంపుదల చేశారు. ఏటా అదే మొత్తంలో పెంచుతామని చేసిన ప్రకటనకు కరోనా అడ్డంకి వేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో చివరకు ఉద్యోగుల వేతనాలు కూడా కోత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఆంధ్రాలోనే కాకుండా దేశంలోని కేంద్ర ప్రభుత్వం సహా అందరికీ అనివార్యమయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రెగ్యులర్ గా ఇచ్చే పెన్షన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చూసిన ఘతన జగన్ కే దక్కుతుందనడంలో సందేహం లేదు. పైగా ఉద్యోగుల వేతనాల కన్నా ముందే పెన్షన్ల దారుల చేతికి పైసలు చేరుతుండడం విశేషంగా చెప్పాలి.
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో పెన్షన్ పెంపుదల లేనప్పటికీ వచ్చే జూలై 1 నుంచి మాత్రం మరోసారి పెన్షన్ల కోసం ఇస్తున్న మొత్తం మరో రూ. 250 చొప్పున పెంపుదల చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. దాంతో వృధ్యాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ ఇకపై రూ. 2500కి చేరుతోంది. అదే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీ, బోధకాలు సహా పలు సమస్యలున్న వారికి పెన్షన్లు అందిస్తున్నారు. నెలకు రూ.1800 కోట్లు కేవలం పెన్షన్లకే వినియోగిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీలో జగన్ దే కావడం విశేషం. సుమారుగా 58లక్షల మందికి వివిధ పెన్షన్లు అందిస్తున్నారు. అంటే సగటున ఏపీలో 5కోట్ల మంది జనాభాలో ప్రతీ కుటుంబానికి ఏదో ఒక పెన్షన్ అందిస్తున్న అనుభవం ఏపీది. ఇంతటి విస్తృతంగా పెన్షన్లు అందిస్తున్న జగన్ ప్రభుత్వం వాటిని మరింతగా పెంచుతూ చెప్పాడంటే చేస్తాడంతే అనే మాటను ఆచరణలోకి తీసుకురావడం విశేషంగానే చెప్పాలి.