iDreamPost
android-app
ios-app

సితార సినిమాలో జమీందారు..

  • Published Oct 04, 2020 | 1:24 PM Updated Updated Oct 04, 2020 | 1:24 PM
సితార సినిమాలో జమీందారు..

అప్పట్లో సూపర్‌ హిట్‌ అయిన సితార సినిమాలో ఓ జమీందారు ఉంటాడు. ఆస్తి మొత్తం కోర్టు వివాదాల్లో ఉండిపోవడంతో ఉండడానికి పెద్ద బంగ్లా తప్ప ఏమీ ఉండదు. చిరిగిపోయిన చొక్కాను కోటుతో కవర్‌ చేసి బైట హుందాగా తిరిగేస్తుంటాడు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహారశైలి కూడా అదే విధంగా ఉందుంటున్నారు విమర్శలకు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ తరపున వాణిని విన్పించేందుకు కనీసం ఒక్కోనేత కూడా లేని పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోందంటున్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడే నాయకుడు పక్కపార్టీవైపునకు చేరుకుంటాడోనని నిత్యం ఆందోళన మధ్యలోనే ఆ పార్టీ అధినాయకత్వం నుంచి కేడర్‌వరకు కొట్టుమిట్టాడుతున్నారు. దీనిని సరిదిద్దుకునేందుకు ఎటువంటి చర్యలు పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు చేపట్టిన దాఖలాల్లేవని సొంత పార్టీ కార్యకర్తలే చెప్పుకొస్తున్నారు. దీనిని పక్కనబెట్టి వెబ్‌సైట్‌లో సమస్య చెప్పుకోండి, పరిష్కరించేందుకు కృషి చేస్తాను అంటూ ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సొంత పార్టీలో ఉన్న సమస్యలను గురించి ఓ వెబ్‌సైటు పెడితే ఇప్పుడు పెట్టిన సైటుకంటే పదుల రెట్లు ఎక్కువగా సమస్యలు చెప్పుకుంటారంటూ అధికార పార్టీ నేతలు ఎద్దేవాకు కూడా దిగుతున్నారు. అయినాగానీ చంద్రబాబు తనదైన ధోరణిలోనే ముందుకుపోతున్నారు.

ఎవరైనా గానీ ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా అభినందించాల్సిందే. కానీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా అందరి అభినందనలు పొందుతున్న ‘కరోనా నియంత్రణ’ అంశాన్ని చంద్రబాబు ఎత్తుకోవడమే ఇక్కడ ఆక్షేపించేందుకు అవకాశం ఇస్తోంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఘాటుగానే విమర్శిస్తున్నట్టు తానింకా అధికారంలోనే ఉన్నాన్న భ్రమలోగానీ చంద్రబాబు ఉండిపోలేదుకదా అన్న సందేహాన్ని కూడా పెంచుతోంది. కరోన నియంత్రణపై దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని, కానీ చంద్రబాబు మాత్రం కరోనాపై ఫైట్‌ చేస్తానంటూ వెబ్‌సైట్‌ పెడతారని ఎద్దేవా చేసారాయన.

గత ఏడు నెలలుగా ఆన్‌లైన్‌లో పెదబాబు, చినబాబులు చేస్తున్న రాజకీయానికి కొనసాగింపుగానే వెబ్‌సైటు ఏర్పాటును భావించాల్సి ఉంటుంది. అందులో ఎవరైనా సమస్యలు నమోదు చేసుకుంటే, వాటిని అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకు వెళతానని ఆయన ప్రకటించుకున్నారు.

అసలు ఇంటికే వచ్చి మీకేం కావాలని వాలంటీర్లు అడుగుతూ ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ఎందుకంట? అన్న అనుమానం మీకొస్తే మాకు సంబంధం లేదు. చంద్రబాబు ‘ఐటీ’ స్వభావం ఇంకా విడనాడలేదనడానికి ఈ వెబ్‌సైటే ప్రభల తార్కారణమని అధికార పార్టీ నేతలు మైకందుకుంటున్నారు.

ఇంటికే వస్తున్న వాలంటీరుకు తమ సమస్యను చెబితే, నిర్ణీత కాలవ్యవధిలో దానిని పరిష్కరిస్తున్నారు. దాదాపు అయిదారేళ్ళుగా రేషన్‌ కార్డులు లేనివారిని సైతం గంటల వ్యవధిలోనే వాటిని జారీ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు. ఇది పక్కన పెట్టేసి చంద్రబాబు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లోకి వెళ్ళి తమ సమస్యను రాసుకుంటే.. దానిని చంద్రబాబు ఆయన బృందం ప్రభుత్వ అధికారుల దగ్గరు తీసుకువెళ్ళి, ఆ తరువాత వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం.. ఇదంతా నీ ముక్కెక్కడ అంటే ఈ పక్క నుంచి తిప్పి ఆ పక్కన చూపెట్టినట్టుగా ఉన్నట్టు లేదూ అన్న సందేహం రాకమానదు.