iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ అంటే అన్నపూర్ణ ప్రదేశ్‌గా ఉండేదని.. నేడు అంధకార ప్రదేశ్‌గా జగన్ తయారు చేశారని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.3.5 లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ప్రస్తుతం ఏపీ దాదాపు రూ.6.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని విమర్శించారు.
ఏపీ పోలీసు యంత్రాంగం ఐపీసీ సెక్షన్ల స్థానంలో వైసీపీ సెక్షన్లను అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసే పోలీసులకు మంత్రి కొడాలి నాని ఆగడాలు కనిపించలేదా అని విమర్శించారు. నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం కోటరీ, ఆయన శిష్యులు మినహా ఎవరూ సంతోషంగా లేరని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని.. చివరకు పంచాయతీ నిధులను సొంత ఖాతాలో వేసుకుంటున్నారంటూ భానుప్రకాశ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అవగాహన లేకుండా విమర్శలు..
భానుప్రకాశ్‌రెడ్డి చేసిన విమర్శలు పరిశీలిస్తే ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న పరిపాలనా తీరుపై కనీస అవగాహన లేదని అర్థమవుతోంది. నవరత్నాలే కాకుండా తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటిని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాటిలో 96 శాతం హామీలను ఇప్పటికే అమలు చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే మెచ్చుకున్నాయి. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో వచ్చిన మార్పులను గమనించకుండా ఏవేవో విమర్శలు చేస్తే ఎవరు నమ్ముతారు? ఏపీ అంధకార ప్రదేశ్‌గా మారిపోయిందని, ఐపీసీ సెక్షన్ల స్థానంలో వైసీపీ సెక్షన్లను అమలు చేేస్తున్నారు అంటూ నిరాధార ఆరోపణలు చేయడమే తప్ప అందుకు ఒక్క ఉదాహరణను అయినా చూపలేదు.
నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయనకు క్యాసినో వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిన సంగతి తెలియదా? ఆందోళన చేస్తున్న రైతులపైకి కారును నడిపించి 11 మంది మృతికి కేంద్రమంత్రి తనయుడు కారణమైనా ఇప్పటి వరకు ఆ మంత్రిని బీజేపీ ప్రభుత్వం ఎందుకు బర్తరఫ్ చేయలేదని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తరచు డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు…అసలు ఇప్పటివరకు రాష్ట్రానికి ఎంత మేర నిధులు ఇవ్వాల్సి ఉంటే కేంద్రం ఎంత ఇచ్చింది అన్న వివరాలు బయట పెడితే బావుంటుందని అంటున్నారు. రూ.6.5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని గగ్గోలు పెడుతున్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేసే అర్థం పర్థం లేని విమర్శలనే బీజేపీ నేతలు కూడా వల్లె వేస్తుంటారని, అంతుకుమించి బీజేపీ నేతలు ఆ పార్టీని జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : “చింతామణి” కొనసాగాలంటున్న నారాయణ