iDreamPost
android-app
ios-app

Rajesh Khanna : తెరపై రాబోతున్న అమ్మాయిల ఆరాధ్య హీరో కథ

  • Published Dec 28, 2021 | 8:45 AM Updated Updated Dec 28, 2021 | 8:45 AM
Rajesh Khanna : తెరపై రాబోతున్న అమ్మాయిల ఆరాధ్య హీరో కథ

ఇప్పటి ప్రేక్షకులకు అవగాహన తక్కువ కానీ హిందీ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్ళకు పరిచయమే అక్కర్లేని పేరు రాజేష్ ఖన్నా. అందాల నటుడుగా అమ్మాయిల గుండెల్లో నిద్రపోయిన రాజకుమారుడిగా ఈయన ఫాలోయింగ్ మాములుగా ఉండేది కాదు. బయట ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఈయన నడిచి వెళ్లిన చోట ఉన్న మట్టిని తీసుకుని మహిళలు నుదుటన రాసుకుని ఆనందపడే వారంటే వినడానికి వింతగా అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజం. ఈయన కాల్ షీట్స్ కోసం నిర్మాతలు నెలలు సంవత్సరాల తరబడి వేచి చూసిన దాఖలాలు ఉన్నాయి. డేట్స్ ఉంటే చాలు పెట్టుబడి అవసరం లేకుండా డిస్ట్రిబ్యూటర్ల అడ్వాన్సులు వచ్చేవి.

అంతటి గొప్ప స్టార్ డం అనుభవించిన రాజేష్ ఖన్నా వ్యక్తిగత వృత్తిపర జీవితంలో చాలా మలుపులు బాధలు ఉన్నాయి. ఇప్పుడివన్నీ తెరకెక్కబోతున్నాయి. ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ ని దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఎవరు నటిస్తారనే లీక్ బయటికి రాలేదు కానీ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజేష్ ఖన్నా జీవితం ఆధారంగా గౌతమ్ చింతామణి రాసిన రాజేష్ ఖన్నా డార్క్ స్టార్ పుస్తకాన్ని ఈ సినిమా మూలకథగా వాడుకోబోతున్నారు. 2012లో కన్నుమూసిన ఈ దిగ్గజ నటుడి కథను ఇప్పుడు వెండితెరపై చూపించడం అంటే ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. కానీ సినిమాను మించిన డ్రామా ఈయన లైఫ్ లో ఉందట.

ఇటీవలి కాలంలో బయోపిక్స్ కి ఆశించినంత స్పందన రావడం లేదు. అన్నీ ఒకేతీరులో తెరకెక్కడం, ఒకటి హిట్ అయితే చాలు అందరూ అదే ఫార్మట్ లో స్క్రీన్ ప్లే రాసుకోవడం ఫలితాలను ఇవ్వడం లేదు. జయలలిత తలైవి, కపిల్ దేవ్ 83 దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. మనదగ్గర కూడా మహానటిని చూసి ఎన్టీఆర్ కథానాయకుడు తీస్తే జనం నో అన్నారు. అంతటి మహానటుడి సబ్జెక్టు కూడా సిల్వర్ స్క్రీన్ మీద తిరస్కారానికి గురయ్యింది. మరి రాజేష్ ఖన్నాని ఎలా చూపిస్తారో వేచి చూడాలి. 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత ఫరా ఖాన్ మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడీ లెజెండరీ బయోపిక్ తో కెప్టెన్ గా మారబోతున్నారు

Also Read : RRR : సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్న “RRR”