Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలకు, పరిపాలనకు సముచితమైన గౌరవం దక్కుతోంది. ఆయన అందిస్తున్న సంక్షేమ పాలనకు ర్యాంకులన్నీ ఫిదా అవుతున్నాయి. రాష్ట్రాన్ని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ.. దేశంలోనే ఉత్తమ సీఎంగా గుర్తింపు పొందుతున్నారు జగన్. పాలనా విధానాల్లో సరికొత్త సంస్కరణలతో దూసుకెళ్తున్నారు. ఆయన పని తీరుకు ఈ ర్యాంకులే కొలమానం. ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లోనే ఆయన దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ప్రజల మన్నన పొందగలిగారు. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన దేశ్ కా మూడ్ సర్వేలో ఆయనకు 3వ ర్యాంకు లభిస్తే, ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 4వ ర్యాంకు దక్కింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం.1గా నిలిచింది. ఇప్పుడు తాజాగా దేశంలో ఉత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది. వైఎస్ జగన్ పాలనా దక్షతకు ఇంత కన్నా నిదర్శనాలు చాలవా..!
నాటి నుంచి నేటి వరకూ…
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 నెలలకే వీడీపీ అసోసియేట్స్ వారు దేశ్ కా మూడ్ పేరుతో ఒక సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రుల పనితీరుపై నిర్వహించిన ఈ సర్వేలో జగన్ 3వ స్థానంలో నిలిచారు. ఒదిశా సీఎం నవీన్ పట్నాయక్ 81 శాతం ఓట్లతో ప్రథమస్థానంలో ఉండగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ (అజయ్ బిస్త్) కు 72 శాతం ఓట్లతో రెండో స్థానం దక్కింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. 71 శాతం ఓట్లు సాధించి.. మూడోస్థానంలో నిలిచారు. జగన్మోహన రెడ్డి కేవలం రెండునెలల పదవీకాలంలోనే మూడోస్థానంలో నిలవడం అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో ర్యాంకుల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డికి 4వ ర్యాంకు లభించింది. గత నాలుగు పర్యాయాలుగా ఈ సర్వేల్లో ప్రథమ స్థానంలోనే ఉంటూ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంటే జగన్ దూసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ ర్యాంకుల్లో మమత 6వ స్థానంలో నిలిచారు. జగన్మోహన్ రెడ్డి పరిపానలోకి వచ్చిన నాటినుంచి అవినీతి నిర్మూలన మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. నవరత్నాల పథకాలను ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి శ్రద్ధ పెడుతున్నారు. ఏ సంస్థ సర్వేలను నిర్వహిస్తున్నా వాటిలో జగన్ అగ్రస్థానంలోనే కొనసాగుతుండడం విశేషం.
ఉత్తమ పాలనలో ఏపీ భేష్
బెంగళూరుకు చెందిన మేధో మథన సంస్థ ‘ప్రజా వ్యవహారాల కేంద్రం(పీఏసీ)’ ఏటా ‘ప్రజా వ్యవహారాల సూచీ (పీఏఐ)’ పేరిట నివేదికను రూపొందిస్తోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ కె.కస్తూరి రంగన్ నేతృత్వంలో పనిచేసే ఈ సంస్థ 2020వ సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలను పరిశీలించి స్థిరమైన అభివృద్ధి , పాలన తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను తాజాగా ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాలు మొదటి నాలుగు ర్యాంకులను దక్కించుకున్నాయి. కాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అట్టడుగున నిలిచింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం కేరళ (1.388 పీఏఐ పాయింట్స్ ), తమిళనాడు (0.912), ఆంధ్రప్రదేశ్ (0.531), కర్ణాటక (0.468) పాలన పరంగా పెద్ద రాష్ట్రాల విభాగంలో పాయింట్ల చొప్పున దక్కించుకుని మొదటి నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి. ప్రముఖ ఆర్థికవేత్త, దివంగత శామ్యూల్ పాల్ 1994లో స్థాపించిన పీఏసీ దేశంలో ఉత్తమ పరిపాలన అందించాలన్న ఆశయంతో పనిచేస్తోంది.
బాబు పాలనలో 9.. జగన్ పాలనలో 3..
తాజా సర్వేలో సుపరిపాలన అందిస్తున్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ వరసగా మూడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ నిలిచాయి. ఇదిలా ఉండగా.. నాడు చంద్రబాబు పాలనలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. ప్రస్తుతం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన కారణంగా ప్రస్తుత సర్వేలో 9 నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రజలకు మంచి చేయాలంటే సుదీర్ఘ అనుభవం అవసరం లేదని, మంచి చేయాలన్న కోరిక బలంగా ఉంటే చాలని, అందుకు ఆ ర్యాంకుల్లో మెరుగుదలే నిదర్శనమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజా నివేదిక జగన్ పాలన పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పొచ్చు. మరో వైపు తమ అధినేత పాలనలో ఏపీకి మూడో స్థానం దక్కడంపై వైసీపీ శ్రేణులు, సానుభూతిపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు