అది క్రీస్తు పూర్వం 2017 . సకల లోకాలకు నవ నాగరికత బాబు గారు నేర్పుతున్న రోజులు . ప్రపంచంలోనే అత్యంత నాగరికత విలసిల్లుతున్న అమరావతి నుండి అత్యద్భుతమైన ఆకాశ హార్మ్యాలు ఎలా నిర్మించారో తెలుసుకొందామని మయుడు లాంటి నిపుణులు , క్రీపూ 4447 లో నిర్మించిన ఎవరికీ అంతుబట్టని మాహిష్మతీ నిర్మాణ శైలిని తెలుసుకోటానికి బోయపాటి , సామ్రాజ్యమౌళి లాంటి కళాకారులు బారులు తీరి అమరావతిని పరిశీలిస్తున్న రోజులు .
ఇహ రోజువారీ కార్యకలాపాల కోసం మహరాజ్ శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు గారు సపుత్ర సమేతంగా కొలువు దీరే సభా భవనం యొక్క అందాలు , వర్షాకాలంలో ఎటు నుండి పడుతున్నాయో తెలియకుండా కురిసే సుగంధ భరిత చిరుజల్లులు రహస్యం చెప్పమని బాబు గారిని కోరుతూ దర్శనార్థం వస్తున్న ఇతర రాజ ప్రముఖులతో కళలకలలాడుతున్న వేళ .
ప్రపంచంలో ఏ దేశంలో లేని చతురచక్ర యంత్ర వాహనాలు కూడా బాబు గారి రాష్ట్రం నందు మనము దర్శించగలము . అంతియే కాదు వారి రాజ్యం నట్టనడుమ ఓ విచిత్ర యంత్ర స్థంభం కలదు . దానికి అనుసంధానించిన నిట్టనిలువుగా పయనించే యంత్ర వాహనమునధిష్టించి యంత్ర స్థంభం శిఖరాగ్రాన్నధిష్టించి దూరదృశ్య యంత్ర సహాయమున వీక్షించిన ఖగోళములో 2000 సంవత్సరాల తదుపరి మాత్రమే సాధ్యమయ్యే లండన్నేత్రం , రావణ శైలి కొలంబో కోటలు , ఈజిప్ట్ తరహా త్రిభుజాకర ఫిర్యమిడ్లు , శాంఘాయి విధపు మిరుమిట్లు గొలుపు వెలుగు నీడల విద్యుత్ జిలుగులు , భావి టోకియో వస్త్రధారణ కిమినోలు ధరించిన అతివా సేవకులు , భావితరాలు కూడా దర్శించలేని తూటా వేగపు బహుచక్ర వాహనాలు , శబ్ద వేగాన్ని మించిన తూముప్రయాణ వాహనాలు ఇవన్నీ ఆకాశాన్నంటేట్టు పెరిగిన పైత్య తుమ్మ , రక్కసి కంప చెట్ల మధ్య రక్షణకై ప్రజాలేర్పాటు చేసిన సారాయి సీసాలు మధ్యలో , చిన్ని చిన్ని కమలాధారిత సువాసన వెదజల్లు వరాహ నివాస నీటి కొలనుల ప్రక్క నుండి కనువిందుగా దర్శనం కాగలవు .
అట్టి అపూర్వ రాజధాని ప్రాంతానికి కొండ కింద మహా నగరి అయిన ఇజ్జీవాడకి సుదూర ప్రాంతమైన ఒంగవోలు నుండి వచ్చిన ఓ కర్షకుడు అమరావతి విశేషాలు చూద్దామని కనపడిన యంత్ర వాహనం ఎక్కి ఓయీ చతుర్చక్ర శకట నిర్వాహకుడా అమరావతి నగరమ్మునకు తోడ్కొని వెడలుటకు రుసుమెంత అనియె .అంతట ఆతడు ముప్పది ఐదు రూప్యములు అనగా ఔరా నన్ను నీవెచ్చటికి తోడ్కొని పొదలిచితివిరా నరాధమా , ధర్మము ద్వాదశ పాదమ్ముల పై నడయాడు మా బాబోరి రాజ్యమున వారి ఆస్థాన నర్తకి నిర్వహించు అంధజ్యోతి కర పత్రిక నందు ఇరువది నాలుగు రూప్యములు అని అచ్చోసిన విషయం మాకు తెలుసును . కనుక నీవు పౌర మర్యాద పాటించి ధర్మ బద్ధమైన రుసుముతో నన్ను అమరపురి తోడ్కొని పొమ్మనే.
అంతట మతి చలించిన యంత్ర నిర్వాహకుడు ఆర్యా తమరు ఎచ్చటికి పొదలిచితిరి పరమ శివుడు కొలువైన అమరావతి కే కదా అనె .
నాయనా ఆచటికి కాదు మా పయనం
శ్రీమాన్ ప్రపంచ స్థాయి నేత నారా చంద్ర ప్రభువులు కొలువైన అమరపురికి తోడ్కొనిపో అని కోరే .
అంతట యధాస్థానమునకు వచ్చిన శిరస్సుతో వేగిరం జ్ఞప్తికి తెచ్చుకొని ముసిముసినగవులతో యా కర్షకుని వద్ద ఇరువది నాలుగు రూపాయలు పుచ్చుకొని తగు రసీదునిచ్చి భద్రముగా తోడ్కొని పోయి అమరావతిలో విడచివచ్చే .
ఇతిః వృత్తాంతమంతయు తదుపరి దినమున బాబోరి ఆస్థాన పత్రిక నందు చూసి ఔరా అని నాసికన మధ్య వేలు ఆనించి సంభ్రమాచ్చర్యాలకు గురయ్యి . శివుడు కొలువైన అమరావతిని మించినది . నారా చంద్రులు కొలువైన అమరావతి అనినెంచి జయము జయము చంద్రన్న అని జేజేలు పలికితిరి .
అయితే ఆ కర్షకుడు మాత్రం యంత్ర వాహనంలో తిరిగి రాలేదు . పలు రకాల భ్రమలు కల్పిస్తున్న అమరావతిలో పర్యటిస్తూ ఓ వరాహ నివాస కొలను ఒడ్డున నిలిపి ఉన్న ఓ అతి విచిత్ర వాహణమును చూసి అబ్బురపడి అందు ప్రవేశించే . అతనికి తెలియని విషయం అది చంద్రలోక 2019 అనబడు సమయప్రయాణ యంత్రం .
అందు ప్రవేశించిన వారి ఉద్దేశ్యములతో నిమిత్తం లేకుండా కాలమందు పయనింపజేసి క్రీ శ 2019 లో వదిలే బహు విచిత్ర యంత్రం అది . ఈ కర్షకుడు అధిష్టించిన వెంటనే గిర్రుగిర్రుగిర్రున తిరిగి అదే అమరావతిలో క్రీశ 2019 కాలంలో వదిలినది .పాపం ఆ కర్షకుడు అదుపు తప్పి వలయంగా తిరుగుతున్న తలని పట్టుకొని కిందకి దిగి అగమ్యగోచరంగా తుప్పలేంబడి నడవసాగాడు .
ఇంతలో ఎవరో పిలిచినట్టు అనిపించి తల తిప్పి చూడగా నారాచ్ఛంద్ర ప్రభువుల వారు కిరీటం , శంఖు , చక్ర , గదలు లేకుండా సామాన్య మానవుల వలే దర్శనమిచ్చే .
అయ్యో మహాప్రభూ ఏమి జరిగినది అని అడుగగా ,
తమ్ముడూ కాలమ్ బహు కఠినమైనది నన్ను అధికారమునకు దూరం చేసితిరి ఈ విశ్వాసం లేని జనులు . పోతే పోనీ కానీ నా పై పగతో ప్రస్తుత ప్రభువు నేను నిర్మించిన ప్రపంచ స్థాయి కట్టడాలన్నీ పలు దేశాలకు అమ్ముకొని నా కలల అమరావతిని కల్లోల ప్రాంతం చేసాడు . సుందర వనాన్ని కీకారణ్యం చేసాడు . కమలములతో విరాజిల్లు సరస్సులు నీవు చూశావు కదా వాటిని మురిగ్గుంతలు చేసాడు .
ఏమి చేద్దాం తమ్ముడూ వీటన్నిటికీ తిరిగిప్రాణ ప్రతిష్ట చేయటానికి మళ్లీ నన్ను పీఠం పై కూర్చోబెట్టిందాక మీరు పోరాడాలి . నా చుట్టూ వలయంలా నిలబడాలి .
ఊరుకోండి మహా ప్రభూ ఆ క్రీపూ2019 లో మీ ఆస్థాన నర్తకి అంధజోతి ఇచ్చిన పసుపు కళ్ళజోడు పెట్టగానే మీరు చెప్పిన భవనాలు నిర్మాణాలు కనపడ్డాయి కానీ కళ్ళజోడు తీసి లోపలికి అడుగు పెట్టబోతే ఆ మాయభవనాలు మాయమయ్యి మయసభలో దుర్యోధనుడిలా మురిగ్గుంతలో పడి నడుములు విరగ్గొట్టుకొని పందుల చేత కరిపించుకొని పారిపోయి ఆ పాడు విమానం ఎక్కా . నువ్వూ వద్దు నీ భ్రమరావతి రాజ్యం వద్దూ .మా ఊరికి దారి చెపితే తిరిగి చూడకుండా పారిపోతా సామీ .