iDreamPost
android-app
ios-app

ప‌ది నెల‌ల త‌ర్వాత వెండితెర ద‌ర్శ‌నం

ప‌ది నెల‌ల త‌ర్వాత వెండితెర ద‌ర్శ‌నం

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా పిచ్చి. ఆ రోజుల్లో థియేట‌ర్ లేకుండా సినిమా లేదు కాబ‌ట్టి , థియేట‌ర్లంటే ఆక‌ర్ష‌ణ‌, వ్యామోహం. సినిమా దేవుడైతే, థియేట‌ర్ దేవాల‌యం. రాయదుర్గంలో నాకు ఊహ వ‌చ్చేస‌రికి ఒకే థియేట‌ర్ ప్యాల‌స్ వుండేది. త‌ర్వాత అజీజియా క‌ట్టారు. ఇంకొంచెం పెద్దాడ‌య్యే స‌రికి నూర్‌టూరింగ్ టాకీస్ అని టెంట్ వ‌చ్చింది.

ప్యాల‌స్ నాకు బాగా ఇష్టం. సిగ‌రెట్ పొగ‌ల మ‌ధ్య నేల‌లో , న‌ల్లుల దాడికి గురై బెంచీలో సినిమాలు చూశాను. బాల్క‌నీ అందుబాటులో వుండేది కాదు. అజీజియాలో కూడా చాలా చూశాను కానీ, ఇంటికి దూరంగా వుండ‌డంతో అనుబంధం త‌క్కువే. నూర్ టూరింగ్ టాకీస్ చాలా ద‌గ్గ‌ర‌. దాని ఎదురుగా మా ఫ్రెండ్ శ్రీ‌ధ‌ర్ ఇల్లు ఉండేది. సాయంకాలం వాడి ద‌గ్గ‌రికి వెళ్లి సినిమా స్టార్ట్ అయ్యే వేళ‌కి టెంట్ ద‌గ్గ‌ర త‌చ్చాడేవాన్ని. తిక్క శంక‌ర‌య్య‌, ద‌స‌రాబుల్లోడు, భామా విజ‌యం ఈ సినిమాల‌న్నీ తొలి అర‌గంట ఆడియో విని ఇంటికి వచ్చేవాన్ని. థియేట‌ర్ల ముందు న‌డుస్తున్న‌ప్పుడు ఆ శ‌బ్దాలు విని ఆనందించేవాన్ని.

బ‌స్సులో వెళ్తున్న‌ప్పుడు ఆయా వూళ్ల‌లోని థియేట‌ర్లు, టెంట్‌లు త‌గిలితే ఆస‌క్తిగా చూసేవాన్ని. బ‌ళ్లారిలో రాయ‌ల్‌, మోతీ టాకీస్‌లు ఇష్టం. కేవ‌లం థియేట‌ర్లు ఎలా వుంటాయో చూడ్డానికే సినిమాలు చూసేవాన్ని.

అనంత‌పురం వ‌చ్చిన వారం రోజుల్లో అన్ని థియేటర్లు చూసేశాను. నేను ఎగిరి గంతులేసి, విజిల్స్ వేసిన థియేట‌ర్లు ఇప్పుడు లేవు. సినిమా చూస్తూ క‌ళ్ల నీళ్లు పెట్టుకున్న శ్రీ‌కంఠం, సంఘ‌మేశ్‌, ర‌ఘువీరా టాకీస్‌లో మాయ‌మైపోయాయి. జ్ఞాప‌కాల‌ను ఎవ‌రూ కూల్చేయ‌లేరు క‌దా!

తిరుప‌తికి వ‌చ్చిన త‌ర్వాత ప‌ళ‌ని టాకీస్ ప‌క్క‌న కాపురం పెట్టాను. సెకెండ్ షోకి త‌మిళ సినిమా డైలాగ్‌లు వినిపించేవి. ద‌ళ‌ప‌తి ఆడియో ఎన్నోసార్లు విన్నాను. త‌ర్వాత మ‌హావీర్ , దేవేంద్ర టాకీస్‌, ఎప్పుడూ యాక్సిడెంట‌ల్‌గా ఇల్లు థియేట‌ర్ ద‌గ్గ‌రే వుండేది.

హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత స‌త్యం, గోకుల్‌, సంతోష్‌, రామ‌కృష్ణ‌లో ఎన్ని సినిమాలు చూశానో గుర్తే లేదు. సంగీత్‌, ఆనంద్‌లో ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఆ మ‌జానే వేరు. మాల్స్ వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్ల‌తో అనుబంధం పోయింది. మాల్‌లో సినిమా వుంటుంది కానీ, థియేట‌ర్‌కి రూపం వుండ‌దు.

రివ్యూలు రాయ‌డం Start చేశాక ఉద‌యం 8.45 ప్ర‌సాద్ Imaxలో చూడ‌డం ఓ థ్రిల్‌, జ‌నం , హ‌డావుడి, పాప్‌కార్న్ క‌ర‌క‌ర, ప్ర‌తి శుక్ర‌వారం గొప్ప సంతోషం. థియేట‌ర్‌ని మ‌న నుంచి దూరం చేసి, అడుగు పెట్ట‌కుండా చేసే కాలం ఒక‌టి వ‌స్తుంద‌ని ప్ర‌పంచంలో ఎవ‌రూ ఊహించ‌లేదు.

క‌రోనా భ‌యం స్టార్ట్ అయ్యేస‌రికి ఫిబ్ర‌వ‌రి నుంచి సినిమాలు చూడ‌డం మానేశాను. త‌ర్వాత థియేట‌ర్లు మూసేశారు. ఇప్ప‌టికీ తెర‌వ‌లేదు. లాక్‌డౌన్‌లో అనంత‌పురంలో నీలిమా టాకీస్ ప‌క్క‌న మా ఇల్లు. మూసేసిన గేట్ల‌తో , దుమ్ము ధూళితో అనాథ‌లా వున్న దాన్ని చూస్తే ఏదో బాధ‌.

ప‌ది రోజుల క్రితం అమెరికాలోని జాక్స‌న్ విల్లీ సిటీకి మా అబ్బాయి ద‌గ్గ‌రికి వ‌చ్చాను. ఇక్క‌డ థియేట‌ర్లు Openలో వున్నాయ‌ని తెలిసింది. వీలు చూసుకుని వెళ్లాం.

థియేట‌ర్‌లోకి అడుగు పెడుతుంటే, పోగొట్టుకున్న‌ది ఏదో దొరికిన ఫీలింగ్‌. కానీ మ‌నుషులు లేరు. టికెట్ కౌంట‌ర్‌లో ఒక‌రు, టికెట్ చెక్ చేసే వాళ్లు ఒక‌రు. మొత్తం ఇద్ద‌రే ఉద్యోగులు. టికెట్ ధ‌ర 12 డాల‌ర్లు. పెద్ద స్క్రీన్ పైన Ads వ‌స్తున్నాయి. ప‌ది నెల‌లు స్క్రీన్ చూడ‌కుండా నా జీవితంలో ఎపుడూ లేను. టీవీలో , ఫోన్‌లో చూసిన థియేట‌ర్ Effect వేరు.

AMC థియేట‌ర్‌లో అన్నీ రిక్లైయిన‌ర్ సీట్లే. కాళ్లు చాపుకుని చూశాను. టెనెట్‌, క్రిస్ట‌ఫ‌ర్ నోల‌న్ సినిమా. అద్భుత‌మైన Sound System, కానీ నోల‌న్ సంక్లిష్ట‌మైన స్క్రీన్ ప్లే వ‌ల్ల , స‌బ్ టైటిల్స్‌కి అల‌వాటు ప‌డిన ప్రాణం క‌దా ఇంగ్లీష్ స‌రిగా Follow కాలేక సినిమా అంత బాగా అర్థం కాలేదు. ఇక్క‌డ ఇంట‌ర్వెల్ వుండ‌ద‌ట‌. కంటిన్యూగా అర్థం కాకపోయినా రెండు గంట‌ల‌కి పైగా థియేట‌ర్‌లో.

మ‌న‌ది కానీ దేశం, మ‌న‌ది కానీ వూరు. కానీ సినిమా అంద‌రిదీ. అది విశ్వ‌జ‌నీనం. నేల క్లాస్‌, న‌ల్లుల థియేట‌ర్ అయినా , సోపా సీట్లు అత్యంత ఆధునిక థియేట‌ర్ అయినా సినిమా ఒక‌టే. దాన్ని ప్రేమిస్తూనే వుంటాం.

విషాదం ఏమంటే క‌రోనా ఇప్పుడిప్పుడే వ‌ద‌ల‌దు. థియేట‌ర్ మొత్తం మీద ఆరుగురే వున్నాం. అదే విషాదం.