iDreamPost
iDreamPost
ఇన్నాళ్ళూ ప్రముఖుల మధ్య జరిగిన అంతరంగిక సంభాషణలను పూసగుచ్చినట్టు రాసిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్తపలుకులో మరో వింత పోకడ పోయారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతోందో.. సీజేఐ రమణ, సీఎం జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నప్పుడు ఏమి మాట్లాడుకున్నారో కళ్ళకు కట్టినట్టు వివరించారు. అంతటితో ఆగకుండా కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొత్త కాక మొదలైందని, 2019లో ఆయనకు అనుకూలంగా స్క్రిప్ట్ రాసిన దేవుడు 2022లో దాన్ని తారుమారు చేయనున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయంటూ పచ్చ పంచాంగాన్ని కూడా బరికేశారు.
విశ్వసనీయంగా అంటూ కట్టు కథలు..
కొత్త సంవత్సరంలో జగన్ చక్ర వ్యూహంలో ఇరుక్కుంటారని జోస్యం చెప్పిన రాధాకృష్ణ దానికి సమర్థనగా కొన్ని కట్టు కథలు అల్లారు. వివేకానందరెడ్డి హత్యకేసులో చార్జిషీట్లు ఫైల్ అయినందున ప్రస్తుతం సీబీఐ విచారణ మోటివ్ ను ఎస్టాబ్లిష్ చేసే దిశగా సాగుతోందని రాశారు. ఈ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని విస్త్రతంగా ప్రచారం జరుగుతోందట! ఎందుకంటే జగన్ సోదరి షర్మిల ఈ కేసులో ఇచ్చే సాక్ష్యం సీబీఐ అధికారులకు బలం చేకూరుస్తుందట. ఆస్తుల విషయంలోనూ, రాజకీయంగానూ తనకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిపై షర్మిల ఆగ్రహంతో రగిలిపోతున్నందున సీబీఐకి సాక్ష్యం చెప్పి తన ప్రతీకారం తీర్చుకుంటారని రాధాకృష్ణ కు విశ్వసనీయంగా తెలిసిందట!
ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ!
కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందని రాధాకృష్ణ నిర్ధారించేశారు. కడప నుంచి నువ్వో.. నేనో పోటీచేయాలి కాని అవినాష్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదని
వివేకానందరెడ్డి షర్మిలతో అప్పటిలో తరచుగా అనేవారట. అయితే జగన్ మాత్రం అవినాష్ రెడ్డి వైపే మొగ్గు చూపారట. కడప సీటు కోసం జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో వివేకా హత్య జరిగింది కనుక షర్మిల చెప్పే సాక్ష్యం వల్ల హత్యకు మోటివ్ రుజువవుతుందని సూత్రీకరించారు. అంతేకాకుండా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోనులు చేశారో సీబీఐ ఆరా తీసిందని, వైఎస్ భారతిరెడ్డికి కూడా ఫోన్ చేశారని తెలిసిందని రాసేశారు. అయితే ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారో లేదో చూడాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు. ఇలా ఒక హత్యకేసులో అటు సీబీఐ ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నది, ఇటు సాక్షి ఏమి వాంగ్మూలం ఇవ్వాలనుకుంటున్నది తన కుశాగ్రబుద్దితో రాధాకృష్ణ కనిపెట్టేశారు.
క్రియేటివిటీకి పరాకాష్ట..
ఇడుపులపాయలో సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల గొడవ పడ్డారని గత వారం కొత్త పలుకులో రాసిన రాధాకృష్ణ అప్పుడు జగన్ ఎలా ఆగ్రహం వ్యక్తం చేశారో రాశారు. దానికి షర్మిల ఎలా స్పందించారో ఈ వారం రాసుకొచ్చారు. నాకు అన్యాయం చేస్తే.. దేవుడు నీకు అన్యాయం చేస్తాడు. నువ్వు పోగేసిన సంపదను దేవుడు నీకు లేకుండా చేస్తాడు. ఆంధ్రాలో నిన్ను బలపడకుండా చేస్తాను అని జగన్ కు షర్మిల వార్నింగ్ ఇచ్చారట! ఇంత డిటైల్డ్ గా ఆ గొడవను ఫాలో అయిన వేమూరి వారు ఈ సంగతులను గత వారం ఎందుకు రాయలేదో.. వచ్చే వారం ఇంకేమి రాస్తారో అంతా సస్పెన్స్! ఆ విధంగా అన్నతో విభేదించిన చెల్లి షర్మిలను విశాఖలో వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ సభకు రమ్మని కొందరు వైఎస్సార్ సీపీ నాయకులు ఆహ్వానించారట. వెళితే ఎలా ఉంటుందని షర్మిల సన్నిహితులతో చర్చిస్తున్నారట. ఈలోపు ఒకరిద్దరు మంత్రులు విజయమ్మతో టచ్ లో ఉన్నారని రాశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సంక్షోభం దిశగా సాగుతోందని మనం అర్థం చేసుకోవాలన్న మాట! ఇంతటి రైటింగ్ స్కిల్స్ ఉన్న రాధాకృష్ణ సినిమా రంగంలో ఎందుకు ట్రై చేయలేదో? అన్న సందేహం ఈ రాతలు చదివినవారికి కలగడం సహజం.
సీజేఐకు సీఎం జగన్ సారీ చెప్పారట..
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం జగన్ సారీ చెప్పారని రాయడమే కాక ఏ విధంగా చెప్పారో కూడా వేమూరి వారు వివరించారు.. నిజానికి సారీ అనే చిన్నపదం సరిపోదు. నన్ను కొందరు తప్పుదోవ పట్టించారు. అందుకే మీకు వ్యతిరేకంగా అప్పటి సీజేఐ బాబ్డేకు లేఖ రాశాను. నన్ను క్షమించండి అని జగన్ వేడుకున్నారట. దీంతో ఇన్నాళ్లూ పులివెందుల పులి బిడ్డ అని పిలిపించుకున్న జగన్ పిల్లి అని తేలిందని రాసేశారు. సీజేఐ రమణను ప్రసన్నం చేసుకోవడానికే ఆయనకు అసాధారణ రీతిలో రాష్ట్ర ప్రభుత్వం స్వాగత, సత్కారాలు ఏర్పాటు చేసిందని అభివర్ణించారు. సీజేఐకు గవర్నర్ హై టీ ఇచ్చిన తరువాత ముఖ్యమంత్రి హై టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆయనను ప్రసన్నం చేసుకొనేందుకే ఇచ్చారు అని సూత్రీకరించారు.
అయితే ఇటువంటి సత్కారాలకు, సారీలకు న్యాయ వ్యవస్థ పొంగిపోదు.. లొంగిపోదు అని ఒక కొటేషన్ వదిలారు. ఎన్ని కేసులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కనుక కలవడానికి జస్టిస్ రమణ అంగీకరించారని, అంతమాత్రం చేత తీర్పులు తారుమారు అవుతాయనుకుంటే పప్పులో కాలేసినట్టే అని వేమూరి వారు జ్ఞానబోధ కూడా చేశారు. కేసుల కారణంగా కేంద్ర పెద్దల వద్ద ఇన్నాళ్ళూ అణిగి మణిగి ఉన్నా జగన్ కు ఎటువంటి ఉపశమనం లభించలేదని తెలిసింది అని రాశారు. ఒక పక్క ఈడీ కేసులు, సీబీఐ కేసులు.. మరోపక్క వివేకా హత్య కేసు నేపథ్యంలో 2022లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం అంటూ ఆశావహ దృక్పథంతో రాధాకృష్ణ ముగించారు. ఇలా ఏ మాత్రం బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా తన బుద్దికి ఏది తోస్తే అది రాసి రాధాకృష్ణ తన పాత్రికేయ పైశాచికాన్ని బయట పెట్టుకున్నారు.