iDreamPost
android-app
ios-app

ఫలితం ఇవ్వని విఫలయత్నం – Nostalgia

  • Published Sep 07, 2020 | 1:37 PM Updated Updated Sep 07, 2020 | 1:37 PM
ఫలితం ఇవ్వని విఫలయత్నం – Nostalgia

సినిమాకు కాంబినేషన్ ఎంత ముఖ్యమో కథాకథనాలు అంతకన్నా ముఖ్యమని దశాబ్దాల చరిత్ర ఋజువు చేస్తూనే ఉంది. కాకపోతే కొన్నిసార్లు కాంబోలు తెచ్చిన క్రేజ్ కు తగ్గట్టు ఫలితాలు రాక ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందుతుంటారు. అలాంటిదే ఈ ఎగ్జాంఫుల్. 2001లో సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారితో రామోజీరావు గారి ఉషాకిరణ్ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసింది. నాగార్జున హీరోగా బాలీవుడ్ లో మంచి ఫామ్ మీదున్న రవీనాటాండన్ హీరోయిన్ గా కోట్ల రూపాయల బడ్జెట్ తో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో మొదలయ్యాయి. ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.

పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, ఎంఎం కీరవాణి సంగీతం, ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం ఇంతకన్నా బెస్ట్ టీమ్ ఏం కావాలి. వీటితో పాటు ఆకాశవీధిలో అనే అందమైన పొయెటిక్ టైటిల్. క్యాస్టింగ్ భారీగా సెట్ చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, కస్తూరి, కోట శ్రీనివాసరావు, సుధాకర్, గిరిబాబు,మల్లికార్జున్ రావు, చలపతిరావు తదితరులు సీన్లోకి వచ్చారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా డిమాండ్ ఉన్న తేజ సర్జ ఇందులో మొదటిసారి డ్యూయల్ రోల్ చేయడం విశేషం. కాకపోతే కథే తేడాగా ఉంటుంది. ఇద్దరు ప్రాణస్నేహితుల్లో ఒకరికి సంతాన భాగ్యం ఉండదు. దీంతో హీరో ఫ్రెండ్ కి కవలలు పుడితే ఒకరిని అవతలికి ఇచ్చేస్తారు. రెండోవాడికి ఓసారి ప్రాణం మీదకు వస్తే అప్పుడు జరిగే డ్రామానే సినిమాలో అసలు పాయింట్. నాగార్జున ఇమేజ్ కి ఏ మాత్రం సూట్ కాని సబ్జెక్టు ఇది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ ఎక్కువై కథనం ఎటుబడితే అటు వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ లో మొదలయ్యే ఫ్లైట్ ఎపిసోడ్ తో ఇది పరాకాష్టకు చేరుకుంటుంది. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా విమానాన్ని హైజాక్ చేసిన తీవ్రవాదుల్లో ఒకడిగా కనిపిస్తారు. రిచ్ ప్రొడక్షన్. వెస్ట్రన్ స్టైల్ లో ట్రై చేసిన కీరవాణి సంగీతం ఇవేవి డిజాస్టర్ కాకుండా కాపాడలేకపోయాయి. పిల్లల్ని, పెద్దల్ని ఒకేసారి టార్గెట్ చేద్దామనుకున్న సింగీతం వారి ఫార్ములా వర్క్ అవుట్ కాలేదు. నాగ్ తో చేసిన ఒకే ఒక్క సినిమా ఇలా మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన సింగీతం శ్రీనివాసరావు గారికి ఎందుకో నాగ్ తో మాత్రం వర్క్ అవుట్ కాలేదు. భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న ఆకాశవీధిలో వాటిని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యింది.