iDreamPost
iDreamPost
(17 ఏళ్ళ క్రితం శంకర్ దాదా ఎంబిబిఎస్ విడుదలైన రోజు ఆ సమయంలో ఎంబిఎ విద్యార్ధిగా ఉన్న ఓ అభిమాని అక్షర మనోగతం)
2004 …..
అవి నా ఎంబిఎ చదువుతున్న రోజులు. హాస్టల్ లో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక టౌన్లో రూమ్ కి షిఫ్ట్ అయిపోయి చాలా సరదాగా గడుపుతున్న సమయం. ఐసెట్ లో నాకొచ్చిన ర్యాంక్ కి ఆళ్లగడ్డలో భూమా వాళ్ళు నడుపుతున్న కాలేజీలో సీట్ వచ్చింది. అప్పటికి దానికి మంచి పేరుంది. నంద్యాల నుంచి 70 కిలోమీటర్ల దూరం. పేరు ఆల్ఫా ఇంజనీరింగ్. మా బ్రాంచ్ కి సెపరేట్ గా ఎయిమ్స్ అనే బోర్డు ఉండేది.
ఆళ్లగడ్డ సిటీ కాదు. కాకపోతే డీసెంట్ గా డెవలప్ అయిన ఊరు. ఏదోలా తిప్పలు పడితే మంచి రూమే దొరికింది. అక్కడికి సరిగ్గా ఓ పదడుగుల దూరంలో శ్రీరామ థియేటర్. ఇది తెలియగానే మనసు ఎంత ఆనందంతో ఉరకలు వేసిందో. ఏదో ఫ్లాప్ సినిమా ఆడుతోంది. చూసే ఆసక్తి రాలేదు. అప్పుడు తెలిసిన వార్త. శంకర్ దాదా MBBS అందులోనే రిలీజ్. ఇంకేం జజ్జినకర జనారే అనుకున్నాం. ఆ రోజు కాలేజీకి డుమ్మా కొట్టేసి మార్నింగ్ షో చెక్కేసి వీలైతే మధ్యాన్నం ఇంకో ఆట కూడా కొట్టేసి సాయంత్రం పడుకుందామని డిసైడ్ అయ్యాం.
అక్టోబర్ 15వ తేదీ.
చండశాసనుడైన మా హెచ్ఓడి ఏమంటాడన్న భయం లేకుండా మొత్తం 15 మంది మూకుమ్మడిగా థియేటర్ మీద దాడి చేశాం. అప్పటికే ఫస్ట్ షో మొదలైపోయింది. 11.00 గంటల ఆటకు టికెట్లు ముందే ఇచ్చేస్తున్నాడు. రద్దీ విపరీతంగా ఉంది కానీ కాలేజీ ఐడిని అస్త్రంలా ఉపయోగించి ఈజీగానే దొరికించుకున్నాం. ధర కేవలం 10 రూపాయలే. నిజంగా అంతే. ఏ హీరో అయినా సరే ఆళ్లగడ్డలో రిలీజ్ రోజు కూడా అదే రేట్. నో చేంజ్. అప్పటికే ఆదోని, కర్నూలులో మంచి థియేటర్లలో సినిమాలు చూసి అలవాటు కావడంతో ఇక్కడ హాళ్లు ఎలా ఉంటాయోనన్న అనుమానంతో బిక్కుబిక్కుమంటూ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాం.
కింద అంగళ్లు. పైన ఫస్ట్ ఫ్లోర్ లో స్క్రీన్. వీడెవడో మల్టీ ప్లెక్స్ తెలివితేటలు చూపించాడనుకుని లోపలికి అడుగు పెట్టాం. గేటు కీపర్ ఫస్ట్ క్లాస్ లేదు రెండో తరగతి లేదు అందరి చేతుల్లో కాగితాలు లాక్కుని చించి పారేస్తూ సగం ముక్కలిచ్చి లోపలికి పంపుతున్నాడు. విచిత్రంగా అందులో బాల్కనీ ఉంది. అప్పటికే అది ఫుల్ కావడంతో కిందికి వెళ్లాం. దాదాపు సీట్లు ఫుల్లు. ఇండియా పాకిస్తాన్ విభజన టైంలో జరిగిన యుద్ధం రేంజ్ లో మూడు వరసల్లో ఏదోలా సీట్లు దొరికించుకున్నాం. ఓ రెండు నిముషాలు కూర్చున్నాక కాని అర్థం కాలేదు అసలు విషయం. అందులో డిటిఎస్ సౌండ్ సిస్టం లేదు. చెరో వైపు గోడలకు నాలుగేసి స్పీకర్లు పెట్టాడు. వాటి కెపాసిటీని మించి సౌండ్ చేస్తూ అప్పటికే పాటలతో హోరెత్తిస్తున్నాయి
నేను ఆసీనుడైన కుర్చీ కుడి వైపు హ్యాండిల్ లేదు. ఇనుప ముక్కేదో చేయికి తగిలితే ఆ ఆలోచన మానుకుని చుట్టూ చూశా. గుట్కా, సిగరెట్లు, నానా రకాల చెదారాలతో కూడిన ఒకరకమైన వాసన హాలు మొత్తం లైట్ గా గుప్పుమంటోంది. స్క్రీన్ గురించి ఏం చెప్పను.మా తాతయ్య తెల్లని మాసిపోయిన పంచె దండెం మీద ఆరేసుంటే వీడు దాన్నే ఎత్తుకొచ్చి స్క్రీన్ గా కట్టినట్టు ఉన్నాడు. అంత దివ్యంగా ఉంది. పైగా ఇప్పటి 70 ఇంచుల టీవీ కన్నా కొంచెం పెద్దగా ఉంది అంతే. ఆరోజు నేను మహా అదృష్టవంతుడిని. సర్వ ప్రకృతి ధర్మాలను రూంలోనే పూర్తి చేసుకుని రావడం వల్ల ఇక్కడ వెళ్ళాల్సిన అగత్యం తప్పింది. లేదంటే నేరుగా ధర్మాసుపత్రికి వెళ్ళాల్సి వచ్చేది.
మాకంటే డబ్బులు పెట్టడం తప్పదు కాని దోమలు, పందికొక్కులకు అంత ఖర్మేం పట్టింది. దర్జాగా మాకన్నా ముందే తిష్ట వేసుకున్నాయి కాబోలు ఇష్టం వచ్చినట్టు చేతుల మీద కాళ్ళ సందుల మధ్య యదేచ్చగా తిరుగుతున్నాయి. బయట బోర్డు ఏసి అని పెట్టారు కాని కేవలం ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఒళ్లంతా చెమట పోస్తోంది. గాలి ఎక్కడికి పోతోందో అర్థం కాలేదు. పోనీ లేచి మేనేజర్ ని అడుగుదామా అంటే తిరిగి వచ్చాక సీట్ల వరసల మధ్య నేల మీద కూర్చోవాల్సిందే. తప్పుతుందాని కూలబడ్డాం.
అప్పుడు గుర్తొచ్చింది. లోకల్ ఫ్రెండుగాడు సెకండ్ థియేటర్ కు వెళ్ళమని ఎందుకు హెచ్చరించాడో. రూంకి దగ్గరగా ఉందని కక్కుర్తి పడటం వల్ల తగిన ఫలితాన్నే అనుభవిస్తున్నాం. ఇంతలో షో మొదలైంది. టైటిల్స్ పడుతున్నాయి. ఈలలు కేకలు ఒకటే గోల. నాకు కొత్తేమి కాదు కానీ హాలు వాతావరణమే పూర్తిగా ఆస్వాదించకుండా అడ్డం పడుతోంది. ఏదోలా మనసు దిటవు చేసుకుని సినిమాలో లీనమవ్వడం మొదలుపెట్టాం. అప్పటికే మున్నాభాయ్ ఎంబిబిఎస్ విసిడిలో చూసినా దాని తలపే రాకుండా చిరు, సోనాలి, పరేష్ రావల్, జయంత్, దేవి శ్రీ ప్రసాద్ లు మాయ చేస్తున్నారు.
“మీ పేరు సనైటా కదా, మరి సునీతా అని రాసుందేంటి”
“హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్”
“లింగం మాయ్యా”
“ఫార్మ్ ఫిలప్ చేయడం అంత అవసరమా అధ్యక్షా”
“మన బాడీలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా, బొక్కల మాస్టర్ చెప్పారు”
“ఎంకీస్ మ్యారేజ్ సుబ్బిస్ డెత్ యానివర్సరీ”
ఒకటా రెండా చిరంజీవి కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ పరుచూరి సోదరులు రాసిన సంబాషణలు, ఎప్పుడో చంటబ్బాయి తర్వాత ఆ స్థాయిలో పదే పదే నవ్విస్తున్న మెగాస్టార్ డైలాగ్ డెలివరీ అబ్బో మాములుగా ఎంజాయ్ చేయలేదు. పైన చెప్పిన ఫిర్యాదులన్ని ఇంటర్వెల్ వచ్చేదాకా గుర్తుకు వస్తే ఒట్టు. టికెట్ కి పది రెట్లు ఎక్కువ న్యాయం చేకూరుస్తూ రేకుల షెడ్డులో చెమటలు కార్చుకుంటూ తిన్న షడ్రసోపేత భోజనంలా సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. కాలేజీకి మొదటిసారి వెళ్తున్నప్పుడు స్టైల్ మార్చి చిరంజీవి వయ్యారంగా నడిచే సీన్ కి హాలు దద్దరిల్లిపోయింది. స్పీకర్లు సైతం మూగబోయాయి. అలా శంకర్ దాదా నా పిజి చదువులో ఓ అందమైన అరుదైన జ్ఞాపకంగా మిగిలిపోయాడు.
శ్రీరామ థియేటర్ ని ఎంత తిట్టుకున్నా వేరే ఆప్షన్ లేక రూమ్ కి చాలా దగ్గరగా ఉన్న కారణంగా శంకర్ దాదాని పది సార్లు చూసినట్టు గుర్తు. అయిన ఖర్చు మొత్తం కలిపి వంద రూపాయలే. స్నాక్స్ కూడా మహా చీపు. చిప్స్ ఐదు, కూల్ డ్రింక్ ఏడు, రుపాయకో సమోసా ఇంకేవేవో ఉండేవి. అవి కొంటున్నప్పుడంతా క్యాంటీన్ వాడు ధర్మప్రభువులా కనిపించాడు. ఆ తర్వాత అదే శ్రీరామలో రెండేళ్ళ కాలంలో చాలా సినిమాలు చూశాం. భూమా వాళ్ళ భవాని థియేటర్ మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా బాగుండేది. అతడు, చత్రపతి, సంక్రాంతి, జై చిరంజీవా ఇలా అందులో బాగానే కవర్ చేశాం. ఆళ్లగడ్డ మీదుగా ఎప్పుడు వెళ్ళినా ఇలా మెమరీ లైన్ కళ్ళ ముందు మెదిలి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి లాక్కువెళ్తుంది.
ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. ఇక ఉంటా సెలవు….