iDreamPost

న్యూ ఇయ‌ర్ నిర్ణ‌యాలు

న్యూ ఇయ‌ర్ నిర్ణ‌యాలు

న్యూ ఇయిర్ వ‌స్తే కొంత మంది చాణ‌క్య శ‌ప‌థాలు చేస్తుంటారు. ఫ‌స్ట్ నుంచి సిగ‌రెట్లు బంద్ అంటారు. రెండురోజులు పొగ చూస్తేనే పారిపోతారు. “త‌న రెండు గాజులు అమ్మ‌కోవాల్సి వ‌చ్చింది. ఇక‌పైన ఏదీ మునుప‌టిలా ఉండ‌ద‌”ని పిచ్చిపిచ్చి యాడ్స్ డైలాగ్స్ వేస్తారు. ఆ త‌ర్వాత స్టీమ్ ఇంజ‌న్‌లా, ఫ్రెష‌ర్ కుక్క‌ర్లా విజిల్ వేస్తూ క‌నిపిస్తారు.

కొంత మంది మందు మానేస్తామ‌ని డిసైడ్ అవుతారు. 31వ తేదీ రాత్రి పెగ్గుల‌కి బ‌దులు మ‌గ్గులు తాగుతారు. 12 దాట‌గానే హ్యాపీ న్యూయ‌ర్ అని అరుస్తూ , ఇళ్ల‌కి పాకుతూ వెళుతారు. అదృష్టం బాగ‌లేక‌పోతే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జైలుకి వెళుతారు. ఫ‌స్ట్ మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ హ్యాంగోవ‌ర్. అది పోవాలంటే ఇంకో పెగ్గు మందు వేస్తారు.

న్యూ ఇయ‌ర్ వ‌స్తుందంటే ఏదో ఆశ‌. అంతా మారిపోతుంద‌ని న‌మ్మ‌కం. రెండురోజులు గ‌డిచాకా, క్యాలెండర్ త‌ప్ప ఇంకేదీ మార‌ద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు త‌గ్గింది కానీ, మా చిన్న‌ప్పుడు ఆడ‌వాళ్లు రాత్రంతా రంగుల ముగ్గులు వేసేవాళ్లు, మందుబాబులు ఆ ముగ్గుల్ని తొక్కుతూ వెళ్తే, వీళ్లు బూతులు తిట్టేవాళ్లు.

ఒక‌ప్పుడు న్యూ ఇయ‌ర్ టెలీఫోన్ బూతుల ద‌గ్గ‌ర ప్రారంభ‌మ‌య్యేది. గ్రీటింగ్స్ చెప్ప‌డానికి జ‌నం క్యూలో నిల‌బ‌డి మాట్లాడేవాళ్లు. మాట‌లు క‌రువైన ఆ రోజుల్లో గ్రీటింగ్స్ కార్డులే శుభాకాంక్ష‌ల‌య్యేవి. ప్ర‌త్యేకంగా దుకాణాలు వెలిసేవి. అంద‌మైన కార్డులు సెల‌క్ట్ చేసుకోవ‌డం అదో ఆర్ట్‌. కొంద‌రితో త‌మ పేరుతో కార్డులు ప్రింట్ చేసుకునేవాళ్లు.

మా ఫ్రెండ్ ఒక‌డికి క్యాలెండ‌ర్లు, డైరీల పిచ్చి. క‌న‌ప‌డినా ప్ర‌తిదాన్నీ పీక్కు తినేవాడు. క్యాలెండ‌ర్లు పోగుచేసుకుని ఏమ్ చేసుకోవాలో తెలియ‌క అట‌క మీద దాచేవాడు. డైరీ నాలుగు రోజులు రాసేవాడు. రొటీన్ జీవితంలో కొత్త విష‌యాలు ఏముంటాయి రాయ‌డానికి? త‌ర్వాత బోర్ కొట్టి ఎక్క‌డో ప‌డేసేవాడు. సేక‌రించిన డైరీల‌ను ఏం చేయాలో తెలియ‌క పిల్ల‌ల‌కి నోట్ పుస్త‌కాల కింద ఇచ్చేవాడు.

కొత్త సంవ‌త్స‌రం కొంత మంది మార్నింగ్ వాక్ స్టార్ట్ చేస్తారు. నాలుగు రోజుల త‌ర్వాత చ‌లికి బ‌ద్ద‌గిస్తారు. మ‌ళ్లీ Next Year వాకింగ్‌. న్యూఇయ‌ర్‌లో మ‌న‌లో రావాల్సిన మార్పులేమిటో మ‌న‌కే తెలియ‌దు. తెలియ‌కుండానే అద్భుతాలు జ‌రుగుతాయ‌ని ఆశిస్తాం. అద్భుతాలు ఎప్పుడూ జ‌ర‌గ‌వు. జ‌రిగే వర‌కూ పోరాడాలి.

కొత్త బ‌ట్ట‌లు వేసుకుని , దేవుడికి దండం పెడితే వ‌రాలు ల‌భించ‌వు. జీవిత‌మే ఒక వ‌ర‌మ‌ని గ్ర‌హిస్తే ప్ర‌తిరోజూ న్యూ ఇయ‌రే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి