iDreamPost

బ్రాహ్మణుల కోసం మరో కొత్త పథకం

బ్రాహ్మణుల కోసం మరో కొత్త పథకం

పేద బ్రాహ్మణులకు మేలు చేసే విషయంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బ్రాహ్మణుల కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా సంఖ్యను బట్టి ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ. 234 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా పేద బ్రాహ్మణుల కుటుంబాల్లో ఉపనయనం చేసుకోవడానికి వీలుగా ఏప్రిల్‌ 1 నుంచి రూ. 15 వేలు అందించే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా ఈ పథకాన్ని అమలు  చేస్తారు. 7 నుంచి 16 సంవత్సరాల లోపు పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకుంటే ఈ  ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

బ్రాహ్మణ వ్యవస్థలో ఉపనయనానికి అత్యధిక ప్రాముఖ్యత ఉంది. దీన్నే ఒడుగు అని అంటారు. బాల్యావస్థ నుంచి బ్రహ్మచర్యావస్థకు మారే సమయంలో ఉపనయనం చేయడం ఆనవాయితీ. ఉపనయనం రోజున తండ్రి బాలుని చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి బాలుడు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ఉపనయనం తంతు కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల పేద బ్రాహ్మణలు ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. రూ. 15వేలు ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

అలాగే పేద బ్రాహ్మణుల విదేశాల్లో ఉన్నత విద్య చదవడానికి వీలుగా భారతి అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఫిబ్రవరి 29 వరకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఈ పథకంలో భాగంగా రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా దాదాపు 15 వేల మంది బ్రాహ్మణులకు పింఛన్‌ అందిస్తున్నారు. వేద వ్యాస, గాయత్రి, కల్యానమస్తు, గరుడ, భారతి పథకాల కోసం దాదాపు 22 వేల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరందరికీ త్వరలోనే సాయం అందించనున్నారు.

వంశపారపర్యంగా అర్చకత్వం చేసుకునే పూజారులను గత తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా తొలగించిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వంశపారపర్య అర్చకత్వానికి సంబంధించి గతేడాది అక్టోబర్‌ 21న జీవో విడుదల చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా బల్లిపాడు గ్రామంలోని శ్రీ మదనగోపాలస్వామి వారి దేవస్థానానికి చెందిన అర్చకులు పురుషోత్తమాచార్యులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ గతవారం దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే గతంలో తొలగించిన అర్చకులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.ఇలా ప్రతి అంశంలోనూ బ్రాహ్మణులు మేలు కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి