iDreamPost

రేషన్‌కార్డుల మంజూరుకు ముహూర్తం ఖరారు

రేషన్‌కార్డుల మంజూరుకు ముహూర్తం ఖరారు

ఏడాది కాలంగా కొత్త రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 6వ తేదీ నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మినహా.. కొత్త వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో అర్హతలు పరిశీలించి కార్డు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో ఏడాదికి ఒక సారి మాత్రమే రేషన్‌కార్డు ఇచ్చేవారు. ప్రతి ఏడాది జనవరిలో నిర్వహించిన జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మందికి తూ తూ మంత్రంగా కార్డులు ఇచ్చి చేతులు దులిపేసుకునేవారు. దరఖాస్తుదారులు ఆ తర్వాత తమకు కార్డు రాలేదంటూ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. పాత కార్డులో ఉన్నారని, పల్స్‌ సర్వే కాలేదని ఇలా అధికారులు రకరకాల కారణాలు చెప్పేవారు. తహసీల్దార్‌ కార్యాలయాలు, మీ సేవా సెంటర్లు, స్థానిక టీడీపీ నాయకులకు పలుమార్లు దరఖాస్తులు ఇచ్చిన సందర్భాలు గత ప్రభుత్వ హాయంలో జరిగాయి. ఒకటికి పదిసార్లు దరఖాస్తు చేసినా కార్డు మంజూరు కాలేదు.

చంద్రబాబు ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో అర్హత ఉన్న వారు, కొత్తగా వివాహం అయిన వారు నూతన కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త కార్డు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో వైఎస్సార్‌ నవ శకం సర్వే ద్వారా వాలంటీర్లు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరిలో కొత్త కార్డులు మంజూరవుతాయని భావించారు.

ఇటీవల కరోనా వైరస్‌ నేపథ్యంలో వారం రోజుల్లో కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే వేలిముద్రలు వేయడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఉండడంతో ఆ పని మళ్లీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మరో తేదీని నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేయనున్నారు. దరఖాస్తులను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి