iDreamPost

సచిన్ పైలట్ పదవి ఊడినట్లేనా..? రాజస్థాన్ పిసిసి చీఫ్‌గా రఘువీర్ మీనా.!

సచిన్ పైలట్ పదవి ఊడినట్లేనా..? రాజస్థాన్ పిసిసి చీఫ్‌గా రఘువీర్ మీనా.!

రాజస్థాన్ డిప్యూటీ సిఎం, రాజస్థాన్ పిసిసి చీఫ్ సచిన్ పైలట్ నిష్క్రమణ దాదాపు ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదవుల పంపకంపై దృష్టి‌ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఒకపక్క సచిన్ పైలట్ తో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు చర్చలు జరిపి…బుజ్జగించే ప్రయత్నం జరుగుతునే…మరోవైపు ఆయన వద్ద ఉన్న పదవులను కట్టబెట్టేందుకు కీలక నేతలను పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ వద్ద ఉన్న కీలక పదవి పిసిసి అధ్యక్ష పదవి ఊడినట్లే..? అంటే పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. పిసిసి పదవి సీనియర్ నేతకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

రాజస్థాన్ పిసిసి నూతన అధ్యక్షుడిగా రఘువీర్ మీనాను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ డిప్యూటీ సిఎం పదవితో పాటు పిసిసి అధ్యక్ష పీఠం కూడా పైలెట్ దగ్గరే ఉండేది. రఘువీర్ మీనా కాంగ్రెస్‌కు అత్యంత నమ్మకస్థుడన్న పేరుంది.

సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన… అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపి స్థాయి దాకా వచ్చారు. 2008లో గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో పార్టీ నిర్మాణంలో మీనాకు అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా గెహ్లాట్‌తో కూడా ఈయనకు సత్సంబంధాలున్నాయి. సచిన్ పైలెట్‌కు, గెహ్లాట్‌కు మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతోనే వ్యవహారం ఇక్కడి వరకూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా రఘువీర్ మీనాకు ఎంపిక చేసిందని రాజస్థాన్ వర్గాల టాక్. 2005 నుంచి 2011 వరకూ రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

సచిన్ పైలట్ తో కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చలు జరుపుతునే మరోవైపు‌ కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన డిప్యూటీ సిఎం సచిన్ పైలెట్‌పై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. పైలెట్ ప్రస్తుతం బిజెపితో ఉన్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్ పూనియా ఆరోపించారు. కాంగ్రెస్ విషయంలో బిజెపి వైఖరి ఎలా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. బిజెపి నుంచి తమకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని, కాంగ్రెస్‌లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను, నేతను కాంగ్రెస్ గౌరవిస్తుందని పూనియా ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి