iDreamPost

Netflix నెట్ ఫ్లిక్స్ కు గట్టి షాక్

Netflix నెట్ ఫ్లిక్స్ కు గట్టి షాక్

ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చందారులు షాక్ ఇచ్చారు. మొదటి క్వార్టర్ లో 2 లక్షల సబ్ స్క్రైబర్స్ తగ్గిపోయినట్టుగా సంస్థ ప్రకటించింది. password sharing ద్వారా ఇలా జరిగిందని ప్రతినిధులు చెప్పుకుంటున్నారు కానీ నిజానికి దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇండియా మినహాయించి చాలా దేశాల్లో ఈ ఓటిటి రేట్లను పెంచేసింది. 4K రెజల్యూషన్ చందాకు నెలకు 20 డాలర్ల దాకా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బెంబేలెత్తిన పబ్లిక్ అందులో నుంచి బయటికి వచ్చేస్తున్నారు. దానికి తోడు బ్లాక్ బస్టర్ అనిపించే గ్లోబల్ కంటెంట్ ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ లో తగ్గిపోయింది. ఈ మాత్రం దానికి ఇంత ధర ఎందుకనే అభిప్రాయం నెలకొంది.

ఇది నేరుగా సభ్యుల నెంబర్ మీద ప్రభావం చూపించింది. ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయనే కామెంట్ వస్తున్నప్పటికీ నెట్ ఫ్లిక్స్ అదేమీ పట్టించుకోవడం లేదు. వందల కోట్ల బడ్జెట్ తో తాము నిర్మించే సినిమాలు వెబ్ సిరీస్ లకు ఇది చాలా సబబైన మొత్తమని సమర్ధించుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఉన్నవాళ్లను కాపాడుకునేందుకు నెట్ ఫ్లిక్స్ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఉక్రెయిన్ మీద యుద్ధానికి నిరసనగా రష్యా నుంచి తమ సర్వీస్ ని ఎత్తేశాక వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ సుమారుగా 7 లక్షల దాకా సభ్యులను పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు రెండో క్వార్టర్ అయ్యేలోగా ఇది 20 లక్షల దాకా చేరొచ్చని ఒక అంచనా. ఇది జరిగితే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు కాంపిటీషన్ తో పాటు పైరసీ బెడద ఓటిటిలకు చాలా ఎక్కువగా ఉంది. టొరెంట్ సైట్లతో పాటు టెలిగ్రామ్ యాప్ ద్వారా గూగుల్ డ్రైవ్ లింక్స్ ని షేర్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. దీన్ని కట్టడి చేయలేక సదరు సంస్థల సాంకేతిక నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త కంటెంట్ విడుదల చేయడం ఆలస్యం నిమిషాల్లో దాని పైరసీ వెర్షన్స్ ఆన్ లైన్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటప్పుడు ధరల విషయంలో కొంత వెనుకడుగు ఉండటం అవసరం. చూడాలి మరి నెట్ ఫ్లిక్స్ నిర్ణయాలు ఎలా ఉంటాయో!

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి