iDreamPost

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే, విపక్షాలు ఈ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా TMC సభ్యుడైన యశ్వంత్ సిన్హాని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్న ద్రౌపది ముర్ముని ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

దాదాపు 20 పేర్లను వడపోసిన అనంతరం ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో ఒడిశాకు చెందిన ఎస్టీ, గిరిజన మహిళగా ఎన్నో సేవలు చేసిన ద్రౌపది ముర్ముని ఎన్నుకున్నారు ఎన్డీయే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, వెంకయ్యనాయుడు.. ఇలా పెద్దలంతా కలిసి చర్చించి చివరకి ఆమెని ఫైనల్ చేశారు.

1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో సంతాల్‌ గిరిజనకు చెందిన కుటుంబంలో ముర్మూ జన్మించింది. ఆమె భర్త శ్యామ్‌చరణ్‌ ముర్మూ మరణించారు. బీఏ చదివిన ఈమె 1979 నుండి 1983 వరకు నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా, 1994 నుండి 1997 వరకు గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌, శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో పనిచేసింది.

1997లో భాజపాలో చేరి రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయింది. ఆ తర్వాత 2000లో రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2000 నుండి 2002 వరకు నవీన్ పట్నాయక్, బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా, 2002 నుండి 2004 వరకు ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ద్రౌపది ముర్ము. 2004లో మళ్ళీ రాయ్‌రంగ్‌పుర్‌ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2002 నుండి మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలుగా ఉన్నారు. అదే సమయంలో ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. 2015లో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకం అయి అప్పట్నుంచి గవర్నర్ గా జార్ఖండ్ కి తన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయే సూచనలతో రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి