iDreamPost

ఆత్మాభిమానం నుంచి పుట్టి.. ఆత్మనే మట్టుబెట్టి..

ఆత్మాభిమానం నుంచి పుట్టి.. ఆత్మనే మట్టుబెట్టి..

కుర్చీని కాపాడుకునే యావలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడితే.. అదే ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ పిక్కటిల్లేలా గర్జించి తెలుగు జాతి గురించి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్టీ రామారావు ఎలుగెత్తి చాటితే.. ఆయన్నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబు ఆత్మవంచక విధానాలతో పార్టీకి ఆత్మ లేకుండా చేశారు. జీవచ్చవంలా మార్చేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా, పేదల ప్రతినిధిగా ఉండాలన్న పార్టీ మూల సిద్ధాంతాలను మూలన పెట్టేశారు. సామాన్యులకు రాజకీయాధికారం అందించాలన్న ఎన్టీఆర్ ఆశయాలకు నీళ్లొదిలేశారు. మొత్తంగా టీడీపీ ఆత్మనే చంపేసి 40 ఏళ్ల పార్టీని నామమాత్రవశిష్టంగా మిగిల్చారు.

నాడు జాతీయ స్థాయిలో రెపరెపలు

1982 మార్చి 29న టీడీపీ ని స్థాపించిన ఎన్టీ రామారావు తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించి దేశంలో ఎదురులేదని విర్రవీగుతున్న కాంగ్రెస్ కు షాకిచ్చారు. టీడీపీ ప్రాంతీయ పార్టీయే అయినప్పటికీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వమైనా జనతా పార్టీ ప్రయోగం విఫలమైన తర్వాత పార్టీలన్నీ ముక్కచెక్కలుగా విడిపోయి అస్తిత్వం కోసం అవస్థలు పడుతున్న తరుణంలో కాంగ్రెస్ విముక్త భారత్ ప్రస్తుత అవసరం అన్న నినాదంతో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. నాదెండ్ల వెన్నుపోటు అనంతరం నిర్వహించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఆయనకు బాగా కలిసి వచ్చింది. జాతీయ పార్టీలన్నీ ఆయనకు దగ్గరయ్యాయి. ఎన్టీఆర్ తెగువ, పోరాటపటిమ ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ను ఢీ కొట్టగలమన్న విశ్వాసం కల్పించాయి. దాంతో ఎన్టీఆర్ చైర్మన్ గా నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించింది. వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ కూడా భాగస్వామి అయ్యింది. పి.ఉపేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ తో బాబు మిలాఖత్

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జాతీయ స్థాయి ఎగురవేసిన టీడీపీ జెండాను అనంతర కాలంలో చంద్రబాబు ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి అదే కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారు. 2010 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కారణమైన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస గండం నుంచి గట్టెక్కించేందుకు పరోక్షంగా సాయపడ్డారు. కాంగ్రెస్ తో కలిసి కుట్రపన్ని జగన్ పై అక్రమ కేసులు బనాయించారు. చివరికి మనకంటే ఆరు నెలల ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో బద్ద వ్యతిరేమి అయిన కాంగ్రెస్ పంచన చేరిపోయారు. తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని రాహుల్ తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అయితే ఆ ప్రయత్నం వికటించి ఘోర పరాజయం ఎదురుకావడంతో ఏపీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కాడి దించేశారు.

మద్యనిషేధానికి మంగళం

పేదల ఆదాయాన్ని, ఆస్తులను హారతి కర్పూరం చేసి, వారి ఆరోగ్యాలను నాశనం చేస్తున్న మద్యం, సారా పై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీఆర్.. తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి 1994లో అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్య నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ 1995 వైస్రాయ్ కుట్రతో ఎన్టీఆర్ నించి అధికారాన్ని గుంజుకున్న చంద్రబాబు కొద్దికాలానికే లిక్కర్ లాబీ ఒత్తిడికి తలొగ్గి మధ్య నిషేధం ఎత్తేశారు.

టీడీపీలో ధనస్వామ్యం

పేదల సంక్షేమం, సామాన్యులు విద్యార్థినులకు రాజ్యాధికారం లక్ష్యంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ వందలమంది సామాన్యులకు రాజకీయ భిక్ష పెట్టారు. బీసీ వర్గాలకు చెందినవారిని పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పోటీ చేయించి పదవుల అందలం ఎక్కించారు. ప్రస్తుతం రాజకీయ ప్రముఖులుగా పలు పార్టీల్లో ఉన్న అనేకమంది ఎన్టీఆర్ చలవతో ఎదిగినవారే. అయితే ఆనాటి విలువలు ఈనాడు ఆ పార్టీలో మచ్చుకైనా కనిపించవు. పార్టీలో ధనస్వామ్యం వర్ధిల్లుతోంది. వందల కోట్లు పార్టీకి పెట్టుబడిగా పెట్టగలిగిన బడాబాబులకే ప్రాధాన్యం లభిస్తోంది. అటువంటివారికే ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు లభిస్తున్నాయి. కుట్రపూరితంగా ఎన్టీఆర్ ను పార్టీకి దూరం చేసిన చంద్రబాబు మనోవేదనతో ఆయన కాలం చేయడానికి కారణమైనట్లే.. పార్జీకి ఆత్మలాంటి ఆయన సిద్ధాంతాలనూ చంపేసి 40 ఏళ్ల టీడీపీని నగుబాటుకు గురిచేశారు.

Also Read : ఎగిసి ‘పడిన’ కెరటం.. తెలుగుదేశం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి