iDreamPost

విపత్తు చర్యలకు బాలయ్య భారీ విరాళం

విపత్తు చర్యలకు బాలయ్య భారీ విరాళం

కరోనా మహమ్మారి దేశాన్ని కబళిస్తున్న వేళ సినిమా పరిశ్రమ నుంచి సహాయం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ప్రధాని పిఎం కేర్స్ కి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధులకు విరాళాలు ఇస్తూనే మరోవైపు సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటికి సైతం విరివిగా డొనేషన్లు అందజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన పెద్ద మనసు చాటుకున్నారు. హీరోగా, హిందూపూర్ ఎమెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా తన తరఫున మొత్తం 1 కోటి 25 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు.

ఇందులో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్స్ కు చెరీ 50 లక్షలు, సినిమా పరిశ్రమ కోసం సిసిసికి 25 లక్షలు ఇచ్చారు. ఇలా కోటికి పైబడి మొత్తాన్ని అందజేసిన హీరోల్లో బాలయ్య కూడా నిలిచారు. నిర్మాత సి కళ్యాణ్ ద్వారా ఈ సహాయం చెక్కుల రూపంలో సదరు ఎకౌంటులకు అందేలా చర్యలు తీసుకున్నారు. కరోనా తాలుకు ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని వేళ ప్రభుత్వాలు నిరంతరం చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయివిపరీతమైన వ్యయం వల్ల నిధుల కొరత కారణంగా ఇప్పుడు అందుతున్న విరాళాలు చాలా ఉపశమనం కలిగిస్తున్నాయి.

ఒక్క సిసిసికే ఇండస్ట్రీ నుంచి 7 కోట్ల దాకా మొత్తం వచ్చిందంటే మనవాళ్ళు ఎంత వేగంగా స్పందిస్తున్నారో అర్థం అవుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి లాక్ డౌన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విపత్తు చుట్టుముట్టిన వేళ సరైన సమయంలో స్పందించారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంపత్ నంది, సందీప్ కిషన్ లాంటి వాళ్ళు సైతం ఇతోధికంగా మొత్తాన్ని అందజేస్తున్నారు. ఇప్పటిదాకా స్టార్ హీరోలతో మొదలుకుని చిన్న ఆర్టిస్టుల దాకా అందరూ ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. మరోవైపు ఒకరిద్దరు తప్ప హీరొయిన్ల నుంచి అంతగా స్పందన లేకపోవడం పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి