iDreamPost

నందమూరి నటసింహం కెరీర్ గ్రాఫ్ – Nostalgia

నందమూరి నటసింహం కెరీర్ గ్రాఫ్ – Nostalgia

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలయ్య ప్రస్థానం చాలా ప్రత్యేకమైనది. తెలుగు సినీ చరిత్రలో తన అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులకు ఒక ఆరాధ్య దైవం. తండ్రి దగ్గర ప్రత్యక్షంగా నటనలో ఓనమాలు దిద్దడం బాలకృష్ణకు మాత్రమే దక్కిన అదృష్టంగా చెప్పవచ్చు. తాతమ్మ కల సినిమాతో మొదలైన ఈ సినీ అక్షరాభ్యాసం కొన్ని విజయవంతమైన చిత్రాల వరకు కొనసాగి బాలయ్య కు నటన పై పూర్తి ఆధిపత్యం వచ్చేలా చేసింది. తన తొలి రోజుల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించినప్పటికీ బాలయ్య తనదైన ముద్రను ప్రేక్షకుల మదిలో వేసేవారు.

ఎదురుగా తండ్రి అంతకు మించి వెండితెర వేల్పు ఉన్నా ఎ మాత్రం తొణక్కుండా ప్రతిభను ప్రదర్శించడం యుక్త వయసులోనే పరిణితికి నిదర్శనం.అలా ఇద్దరు కలిసి నటించిన సింహం నవ్వింది, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర, అనురాగ దేవత, అక్బర్ సలీమ్ అనార్కలి, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు లాంటి చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఆ సమయంలో బాలయ్య ను సోలో హీరోగా చూపించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకు ఎన్టీఆర్ సైతం సుముఖంగా ఉండటం తో ఆయనే స్వయంగా కథలు వినటం ప్రారంభించారు.

సోలో హీరోగా మొదటి అడుగు పడిన చిత్రం సాహసమే జీవితం. నటుడిగా 12వ చిత్రం. భారతిదాసు దర్శకుడు. ఫలితం ప్లాప్. తర్వాత చేసిన 2 సినిమాలు కూడా అదే దారి. అందులో కళాతపస్వి విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి కూడా ఉంది. 1984. బాలయ్య ఎలా చూపిస్తే అభిమానులు గంగవెర్రులు ఎత్తుతారో తెలిసిన దర్శకుడు తగిలాడు. కోడి రామకృష్ణ. వాళ్ళ కలయికలో వచ్చిన మంగమ్మ గారి మనవడు ఒక చరిత్ర. ఏకధాటిగా 565 రోజులు రెగ్యులర్ షోస్ తో ఆడటం బాలయ్య ను టాప్ స్టార్ ను చేసేసింది. పల్లెటూరి నేపధ్యం కలిగిన సినిమాలకు బాలయ్య ను తప్ప ఇంకెవరిని చూడలేం అన్నట్టుగా ఒప్పించాడు. మ్యూజికల్ గా ఒక సెన్సేషన్.

తర్వాత సోలో హీరో గ చేసిన వాటిలో కొన్ని ప్లాపులు యావరేజ్ ఫలితాలు వచ్చాయి. 1986 లో కోడి కాంబినేషన్ లో చేసిన ముద్దుల కృష్ణయ్య 3 కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడీ బాలయ్య స్టామినా ఎందులో ఉందొ చూపించింది. అదే సంవత్సరం సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు హిట్లతో అగ్ర స్థానం వైపు పరుగులు పెట్టాడు. 1987లో సైతం మువ్వ గోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, రాము, భానుమతి గారి మొగుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ హిట్లతో బులెట్ ట్రైన్ లా దూసుకుపోయాడు. 1988 లో కొన్ని బ్రేకులు పడ్డాయి.

దొంగ రాముడు, రాముడు భీముడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, భారతంలో బాలచంద్రుడు అనుకున్న స్థాయి ఫలితాలు ఇవ్వలేక పోవటం నందమూరి అభిమానుల ను తీవ్ర నిరాశకు గురి చేసాయి. భలేదొంగ, రక్తాభిషేకం పర్వాలేదు అనిపించుకున్నాయి. 1989లో ముద్దుల మావయ్య పేరుతో కోడి మళ్ళీ బాలయ్య బాక్స్ఆఫీస్ పవర్ ఏంటో రుచి చూపించాడు.చెల్లెలి సెంటిమెంట్ తో ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలయ్య ను చూసి నోరెళ్ళ బెట్టడం మిగతా హీరోల వంతయ్యింది. విడుదలైన ప్రతి సెంటర్ లోను రికార్డు కలెక్షన్ లతో వసూళ్ల సునామి సృష్టించింది.హీరోయిన్ విజయశాంతి కంటే చెల్లెలి పాత్ర వేసిన సీతనే ప్రేక్షకులకు గుర్తుందంటే సెంటిమెంట్ ఎంత అద్భుతంగా పండించారో చెప్పొచ్చు.

ఆ ప్రభావం ఎంతలా ఉందంటే ఆ చిత్రం తర్వాత విడుదలైన అశోక చక్రవర్తి సినిమాలో మాఫియా డాన్ గా బాలయ్యను చూడడానికి మనసొప్పలేదు. అందుకేనేమో తర్వాత తన ట్రాక్ లో వచ్చి చేసిన బాల గోపాలుడు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక 90వ దశకం బాలకృష్ణ లొనే కొత్త కమర్షియల్ కోణాన్ని ఆవిష్కరించింది. దానికి ఆద్యుడు బి.గోపాల్. లారీ డ్రైవర్ చిత్రం తో రెగ్యులర్ మాస్ హీరో దమ్ముని బాలయ్య ద్వారా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ స్థాయి విజయం మళ్ళీ బి.గోపాల్ 1992 లో రౌడీ ఇన్స్పెక్టర్ ద్వారా కనీ వినీ ఎరుగని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాధించి పెట్టారు.

దాని కంటే ముందు ఆదిత్య 369 ద్వార ఒక కలను వెండి తెరపై చూపటం లో బాలయ్య ధైర్యాన్ని చూపుతుంది. ఇప్పుడైతే సూర్య 24 లాంటివాటిని  ఆహా ఓహో అంటున్నాం కాని పాతికేళ్ళ కిందటే అంతకు మించిన బలమైన కథ, అచ్చెరువొందే కథనం, శ్రావ్యమైన సంగీతం తో సింగీతం చేసిన మాయ ఇప్పటికీ ఒక అద్భుత ఘట్టం. 1993లో ఒకే రోజు సెప్టెంబర్ 3న బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ సినిమాలు విడుదల చేసి ఏ హీరోకి సాధ్యం కాని ఫీట్ సాధించారు. 1994 లో చేసిన జానపద దృశ్యకావ్యం భైరవ ద్వీపం ఒక మేలి మలుపు. ఇప్పుడు కూడా ఆయన గర్వంగా చెప్పుకునే చిత్రాలలో దీనిది ప్రత్యేకమైన స్థానం.

తర్వాత 1994లో బొబ్బిలి సింహం లాంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య పయనం కొన్ని ఒడిదుడుకులకు గురైంది. 1997 లో పెద్దన్నయ్య గా సంక్రాంతి పండగను హిట్లర్ తో పంచుకున్నాక హ్యాట్రిక్ ప్లాపులు పలకరించాయ్.1999 బాలయ్య అభిమానులు ఎప్పటికి మర్చిపోలేని సువర్ణ సంవత్సరం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో బి.గోపాల్ తీసిన సమరసింహారెడ్డి తెలుగు పరిశ్రమలో అప్పటి దాకా ఉన్న రికార్డుల్ని దూది పింజెలా ఊది పారేయడం మిగితా హీరోలకి కునుకు లేకుండా చేసింది. ఈ సినిమా ప్రదర్శించిన హాళ్ళ యజమానులు కలెక్షన్ల వల్ల కోటీశ్వరులు అయ్యారంటే అతిశయోక్తి కాదు.

 ఆ చిత్రం తర్వాత మళ్ళీ బి.గోపాల్ నరసింహ నాయుడు హిట్ ఇచ్చేదాక వరసగా 4 ప్లాప్ లు ఎదురుకున్నాడు బాలయ్య. 2002లో వచ్చిన చెన్నకేశవరెడ్డి 2004లో వచ్చిన లక్ష్మి నరసింహ తప్ప మిగతా చిత్రాలు ఫలితాన్ని ఇవ్వలేదు. 2001 నుంచి 2010 మధ్యలో సూపర్ డూపర్ హిట్స్ అనిపించుకున్నవి 3 సినిమాలే. ఆ మధ్యలో వచ్చిన వచ్చిన భలేవాడివి బాసు, సీమ సింహం, పలనాటి బ్రహ్మనాయుడు, విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారదీ, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు అన్నీ వేటికవే ఒకటి మించి ఒకటి చేసిన పొరపాట్లు. ఈ కాలమే బాలయ్య కెరీర్లో సక్సెస్ శాతం తక్కువ ఉన్న సమయం అని ఘంటపధంగా చెప్పొచ్చు.

2010లో సింహా ద్వార మరో సారి తన స్టామినా ఋజువు చేసాడు బాలయ్య. 92 కేంద్రాలలో 100 రోజులు ఆడిన చివరి తెలుగు సినిమా ఇదే. బి.గోపాల్ తరహాలోనే బోయపాటి శీను ఒక్కడే బాలయ్యను ఎలా చూపించాలో తెలిసిన వాడిలా మళ్ళీ 2014లో లెజెండ్ వచ్చేదాకా హిట్ రాకపోవడం గమనార్హం. లెజెండ్ సృష్టించిన చరిత్ర అందరికి తెలిసిందే. ప్రొద్దుటూరులో వెయ్యి రోజులు ప్రదర్శించటం ఒక్క బాలయ్య కె సాధ్యం. ఏమైనా కొన్ని మాస్ సూత్రాలకు అనుగుణంగా బాలయ్య కథలను ఎంచుకోవడం 90ల దాకా ఫలితాన్ని ఇచ్చినా 20వ దశకం వచ్చేటప్పటికి అదే సూత్రాన్ని నమ్ముకోవడం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.

గౌతమిపుత్ర శాతకర్ణితో తన స్థాయికి తగ్గ కథతో అలరించిన బాలయ్యకు జైసింహ రూపంలో మరో కమర్షియల్ సక్సెస్ దక్కింది. తనతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ తీవ్రంగా నిరాశపరచడం ఎవరూ ఊహించనిది. రూలర్ మరోసారి హెచ్చరికగా నిలిచింది. కాని సరైన కథతో సరిగ్గా చూపిస్తే బాలయ్య జూలు విదిల్చిన సింహం అవుతాడని అప్పట్లో కోదండరామిరెడ్డి,గోపాల్ ఇప్పుడు బోయపాటి లాంటి దర్శకులు రుజువు చేసారు చేస్తూనే ఉన్నారు. అందుకే అఖండ మీద చాలా అంచనాలు ఆశలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి