iDreamPost

ఆ సినిమా చుట్టూ జాతీయ రాజకీయం

ఆ సినిమా చుట్టూ జాతీయ రాజకీయం

ప్రజలను ప్రభావితం చేసే అంశాలలో రాజకీయం, సినిమా ముందు వరుసలో ఉంటాయి. సినిమా ప్రజలనే కాదు రాజకీయాలను ప్రభావితం చేయగలదని తాజాగా విడుదలైన ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమా చుట్టూనే ప్రస్తుతం జాతీయ రాజకీయం నడుస్తోంది. కశ్మీర్‌ నుంచి పండిట్‌లు వెళ్లిపోవడానికి గల కారణాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిందని, ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననేలా బీజేపీ పార్టీ చెబుతోంది. కశ్మీర్‌ నుంచి పండిట్‌లు వెళ్లిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే కారణమనే భావన నెలకొనేలా బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టింది.

దక్షిణ భారతదేశంలోనూ ఈ సినిమాపై బీజేపీ నేతలు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. కర్ణాటక శాసనసభలో ది కాశ్మీరి ఫైల్స్‌ సినిమాను ప్రదర్శించాలనే చర్చ జరిగింది. దీనికి కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇష్టమైన వారే చూస్తారంటూ బీజేపీ నేతలు తమ డిమాండ్‌ను సమర్థించుకున్నారు. తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఈ సినిమా ప్రస్తావనను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెచ్చారు. కరుడుగట్టిన హిందూవాది అయిన రాజాసింగ్‌.. ది కాశ్మీరి ఫైల్స్‌ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. ఫలితంగా ఈ చిత్రం గురించి ప్రజలు చర్చించుకునేలా చేశారు.

ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై బీజేపీ ఇలా వ్యవహరిస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ సినిమాపై, బీజేపీ విమర్శలపై ఎక్కడా స్పందించడం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై ఆ పార్టీ సమాలోచనలు జరుపుకుంటోంది. అంతర్గత సమస్యలపైనే దృష్టిపెట్టింది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌ మౌనంగా ఉంటే నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుందని, బీజేపీపై పోరాటం చేయాలంటూ శివసేన పార్టీ హితబోద చేస్తోంది. శివసేన పత్రిక ‘సామ్నా’ కాంగ్రెస్‌ పార్టీకి పలు సూచనలు కూడా చేసింది. ది కశ్మీర్‌ ఫైల్స్, హిజాబ్‌ వివాదం ద్వారా బీజేపీ సృష్టించిన భావాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని తెలిపింది. బీజేపీని ఎదుర్కొవాలంటే కుహనా లౌకిక వాదాన్ని వదిలిపెట్టాలని ఉద్బోధించింది. బీజేపీ మద్దతు గల వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలోనే కశ్మీర్‌ నుంచి పండిట్లు వెళ్లిపోయారని కాంగ్రెస్‌ చెప్పాలని సూచించింది. ఆ సమయంలో బీజేపీకి సన్నిహితుడైన జగ్మోహన్‌ దాల్మియానే కశ్మీర్‌ గవర్నర్‌గా ఉండేవారని చెప్పాలంటూ సలహా ఇచ్చింది. అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై పోరాటం ఎప్పటి నుంచి మొదలు పెడుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి