iDreamPost

ఏలూరులో ఏం జరుగుతోంది..? అస్వస్థత వెనుక కారణాలేంటీ..?

ఏలూరులో ఏం జరుగుతోంది..? అస్వస్థత వెనుక కారణాలేంటీ..?

ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారో తెలీదు. ఇంకెంత మందికి అనారోగ్యం ఉందో అర్దం కాదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తోంది. ఏలూరులో గత రెండు రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న ‘అస్వస్థత’ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును పలువురు మెచ్చుకుంటున్నారు.

వరుసగా అస్వస్థతకు గురవుతున్న విషయం తెలిసిన వెంటనే మంత్రి ఆళ్ళ నాని స్వయంగా అక్కడికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు నేరుగా ఆయనే సంఘటనా ప్రదేశంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే సీయం వైఎస్‌ జగన్‌ సైతం సంఘటన గురించి ఎప్పటికప్పుడు నేరుగా మంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకునే స్వేచ్ఛను కల్పించారు. మరో మంత్రి పేర్ని నాని కూడా ఏలూరులో బాధితులకు అందుతున్న సేవలను గురించి అధికారులను ఆరా తీస్తున్నారు. తద్వారా బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందాలన్న లక్ష్యంతో సేవలందిస్తున్నారు.

మరోవైపు అసలు అస్వస్థత ఎందుకు కలుగుతుందన్నదానిని వెలికితీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే బాధితులను గుర్తించేందుకు యంత్రాంగం ఇంటింటా సర్వే మొదలు పెట్టింది. బాధితుల రక్తం నమూనాలతో పాటు, ఆయా ప్రాంతాల్లో నీటి శాంపిల్స్‌ను కూడా సేకరించి పరీక్షలు చేస్తున్నారు. 260 మందికిపైగా ఆసుపత్రులకు రాగా వారిలో 80 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. అయిదుగురిని మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేసారు.

హఠాత్తుగా స్పృహతప్పడం, ఊపిరి ఆడకపోవడం, ఫిట్స్‌ లక్షణాలతోనే బాధితులు ఆసుపత్రులకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. అన్ని కోణాల్లోనూ వైద్య బృందాలు తమ శోధనను చేపడుతున్నారు. బాధితులకు కోవిడ్‌పరీక్షలను కూడా చేయిస్తున్నారు. బాధితుల సంఖ్యను అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏలూరు, విజయవాడల్లో ఆసుపత్రుల్లో బెడ్‌లను సిద్ధం చేసి ఉంచారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యాచరణను సిద్ధం చేసారు.

కాగా ఇప్పటి వరకు జరిపిన పరీక్షలో వైరస్, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు ఇందుకు కారణం కాదని తేలిందని వైద్య ఆరోగ్య కమిషనర్‌ భాస్కర్‌ ఇప్పటికే ప్రకటించారు. మరిన్ని టెస్టు రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి