iDreamPost

సంగీతం – ఒక మంచి బిజినెస్

సంగీతం – ఒక మంచి బిజినెస్

ఇవాళ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తమ బ్యానర్ లోగో మీద మ్యూజిక్ కంపెనీని లాంచ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటిదాకా కేవలం సినిమా నిర్మాణాలకు మాత్రమే పరిమితమైన ఈయన ప్రత్యేకంగా ఇప్పుడు దీన్ని మొదలుపెట్టడం వెనుక మర్మం ఏమిటా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు లేకపోలేదు. దీని వెనుక పలు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆడియో కంపెనీ అంటే భారీ పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం. హక్కులు కొనడంతో మొదలుపెట్టి వాటిని క్యాసెట్లు, సిడిలు, రికార్డులుగా మార్చి మార్కెట్ లోకి పంపించి డీలర్ల ద్వారా అమ్మకాలు జరిపి ఎప్పటికప్పుడు లాభనష్టాలు చూసుకోవడం ఇదంతా పెద్ద తతంగం.

సుమారు 2010 దాకా ఈ వ్యవహారం గట్టిగానే నడిచింది. ఆదిత్య మ్యూజిక్, లహరి లాంటి సంస్థలు ఈ రంగంలో బలంగా పాతుకుపోయాయి. ఎప్పుడైతే ఆన్ లైన్ విప్లవం మొదలయ్యిందో అప్పటి నుంచి వీటికి మార్కెట్ తగ్గిపోయింది. జనాలు క్యాసెట్లు కొనడం మానేసి యుట్యూబ్ లోనో లేదా ఎంపి3 రూపంలో డౌన్ లోడ్ చేసుకుని ఫ్రీగా వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. దీంతో సదరు కంపెనీలకు ఆన్ లైన్ ఒక్కటే ఆదాయ వనరుగా మారిపోయింది. అయితే డిస్ట్రిబ్యూషన్ గోల లేకుండా అతి తక్కువ స్టాఫ్ తో ఛానల్ ను మైంటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో క్రమంగా లాభాలు రావడం మొదలయ్యింది.

ముఖ్యంగా క్యాసెట్లు తయారు చేసేందుకు కావాల్సిన మెషినరీ, వాటిని నడిపే మనుషులు, రవాణా తదితర ఖర్చులన్నీ మిగిలిపోయాయి. ఇప్పుడు యుట్యూబ్, ప్రైమ్ – గానా – జియో – సావన్ మ్యూజిక్ లాంటి రకరకాల యాప్ లలో రిస్క్ లేకుండా రిలీజ్ చేసుకుని వచ్చే వ్యూస్ ని బట్టి ఆదాయం పంచుకోవడం మొదలయ్యింది. ఇప్పుడు సురేష్ సంస్థ సైతం ఈ అవకాశాన్ని పసిగట్టే స్వంత లేబుల్ తో మార్కెట్ లోకి దిగింది. ఎలాగూ సినిమా పంపిణిలో ఉంది కాబట్టి హక్కులు కొనడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఇప్పటిదాకా ఉన్న పోటీని తట్టుకుని తమదైన మార్కును చూపించగలగాలి. వ్యాపారంలో తలపండిన సురేష్ బాబుకి అదేమీ కష్టమూ కాదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి