iDreamPost

మున్సిపల్‌ ఎన్నికలు : జోరుగా పోలింగ్‌.. మంత్రి ఓటు గల్లంతు

మున్సిపల్‌ ఎన్నికలు : జోరుగా పోలింగ్‌.. మంత్రి ఓటు గల్లంతు

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికల్లో పాల్గొనేందుకు పట్టణ ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 32.23 శాతం మేర పోలింగ్‌ నమోదవడం మున్సిపల్‌ ఎన్నికలపై పట్టణ ఓటర్లకు ఉన్న ఆసక్తిని తెలుపుతోంది. మొదటి నాలుగు గంటలలోనే 32.23 శాతం పోలింగ్‌ నమోదు కావడంతో.. పోలింగ్‌ పూర్తియ్యే సమయానికి పోలింగ్‌ శాతం 70–80 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య పోలింగ్‌ మందకొడిగా సాగే అవకాశం ఉంది. మళ్లీ సాయంత్రం పుంజుకుంటుంది. ఐదు గంటల వరకు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం లభిస్తుంది.

Also Read : మున్సిపల్‌ వార్‌.. తాడిపత్రిలో ఏం జరుగుతోంది…?

నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సరాసరి 80 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ మార్క్‌కు సమీపంలోనే పోలింగ్‌ నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవసరమైన చోట ఈ నెల 13వ తేదీన రీపోలింగ్‌ నిర్వహించి, 14వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులతో పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన వారు ఓటర్ల లిస్టులో తమ పేరు లేకపోవడంతో నిరాశగా ఎదురుతిరుగుతున్నారు. పలువురు పోలింగ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఓట్లు గల్లంతైన వారి జాబితాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన నాని.. ఓటర్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు. ఓటర్ల లిస్టులో తన పేరు గల్లంతవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎక్కడ పొరపాటు జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాబితాలో ఓటు లేకపోవడంతో ఓటు వేయకుండానే ఆయన తిరిగి వెళ్లిపోయారు.

Also Read : మున్సిపల్‌ పోలింగ్‌ నేడు.. అందరి దృష్టి ఆ నాలిగింటిపైనే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి