iDreamPost

గెలిచే పార్టీకి 80 సీట్లు ఇచ్చి.. కాంగ్రెస్‌కు పాతిక సీట్లు ఇవ్వాలని కోరుతున్న రేవంత్‌ రెడ్డి..

గెలిచే పార్టీకి 80 సీట్లు ఇచ్చి.. కాంగ్రెస్‌కు పాతిక సీట్లు ఇవ్వాలని కోరుతున్న రేవంత్‌ రెడ్డి..

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆ ప్రకటనలనే బలంగా వినిపిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోనూ మేయర్‌ సీటు కోసం టీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. గ్రేటర్‌ను తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తూ రాజధానిలో ఎన్నికల వేడిని రాజేస్తున్నారు.

టీఆర్‌ఎస్, బీజేపీల తీరు ఇలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మేయర్‌ గెలుపు ఊసే ఎత్తడం లేదు. చివరికి ఆ పార్టీ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు సమర్థించేలా మాట్లాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డితో మీడియా ప్రతినిధులు మీట్‌ ద ప్రెస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాయి.

టీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు చేసిన రేవంత్‌ రెడ్డి.. జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వచ్చే పార్టీకి 80 సీట్లు ఇచ్చి.. మిగతా 70 సీట్లు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలని ప్రజలను వేడుకున్నారు. ఎన్‌టీఆర్‌– చెన్నారెడ్డి, చంద్రబాబు – వైఎస్సార్‌ల మాదిరిగా ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి 25 కార్పొరేటర్ల ఇవ్వాలని కోరారు. 25 – 30 సీట్లు ఇస్తే గ్రేటర్‌లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. మేయర్‌ స్థానం కోసం తాము పోటీ పడడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలంటూ మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. ప్రశ్నించే గొంతుకలకు ఊపిరిపోయండంటూ విజ్ఞప్తి చేసి టీఆర్‌ఎస్‌కు తాము ప్రత్యామ్నాయం కాదని ఒప్పుకున్నారు.

Read Also : నాణ్యతే పరమావధి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి