iDreamPost

థియేటరా ఓటిటినా ? – సందిగ్ధంలో సినిమా

థియేటరా ఓటిటినా ? – సందిగ్ధంలో సినిమా

దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితం చెందుతున్నాయి. పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో సాక్ష్యాత్తు ప్రధానే చెప్పలేని దురవస్థ నెలకొంది. సినిమా పరిశ్రమ దీనికి మినహాయింపుగా నిలవలేదు. మొత్తం అన్ని బాషలు కలిపి సుమారు రెండు వేల కోట్ల రూపాయల లావాదేవీలు స్థంబించిపోయినట్టు విశ్లేషకుల అంచనా. దీని వల్ల కలుగుతున్న నష్టం భయపెట్టేలా ఉందంటున్నారు.

షూటింగులు జరగడం లేదు. రిలీజులు ఆగిపోయాయి. ధియేటర్లు మూతబడి నెల రోజులు అవుతోంది. ఎక్కడికక్కడ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. దర్శకనిర్మాతలు, నటీనటులు సిసిసి పేరుతో ఇచ్చిన విరాళాల వల్ల రోజువారి సినీ వేతన జీవులకు ఊరట కలుగుతోంది కాని ఇది ఎప్పటిదాకా అనేది అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు చిన్న మరియు మీడియం సినిమాల నిర్మాతలు రిలీజుల గురించి తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.

ఇప్పుడున్న సిచువేషన్ సద్దుమణిగి జనం థియేటర్లకు రావడానికి ఎంత లేదన్నా జూలై పడుతుంది. అప్పటికీ సీటు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా సీటింగ్ ప్లాన్ చేస్తున్నారని మల్టీ ప్లెక్సుల గురించి టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో సగం కలెక్షన్లతో స్టార్ హీరోల సినిమాలు రిలీజయ్యే సాహసం చేయలేవు.

అందులోనూ ఓవర్ సీస్ లోనూ మార్కెట్ అసలు బాలేదు. కాబట్టి రాబోయే రోజుల గురించి ఊహించడం కూడా కష్టమే. ఇదిలా ఉండగా కొందరు నిర్మాతలు మంచి డీల్ వస్తే నేరుగా ఓటిటి ద్వారా రిలీజ్ చేసే ఆలోచన సీరియస్ గా చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి వాటికి థియేట్రికల్ రిలీజ్ అంత సులభంగా కనిపించడం లేదు. అందులోనూ ప్రేక్షకులు అందరూ ఇళ్ళల్లో ఉండి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. బడ్జెట్ పైన కొద్దిగా లాభం వచ్చేలా సంస్థలు ఆఫర్ ఇచ్చినా చాలు అమ్మేసుకోవచ్చు. కాకపోతే అంత సాహసం మన నిర్మాతలు చేయగలరా అనేదే అసలు ప్రశ్న. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి