iDreamPost

వాడిన వంట నూనే మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

వాడిన వంట నూనే మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

వేపుళ్ళు, డీప్ ఫ్రై చేయగా మిగిలిపోయిన నూనెను మీరైతే చేస్తారు? నిల్వ చేసి చివరి చుక్క దాకా మళ్ళీ మళ్ళీ వాడతారు. అంతే కదా! మీరే కాదు మన దేశంలో చాలా మంది ఇలానే పొదుపు చేస్తారు. ఎంతగా అంటే  మిగిలిపోయిన నూనెలో సగానికి పైగా మళ్ళీ మళ్ళీ వంటకు వాడేంతగా! దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముందని ఒక స్టడీ చెబుతోంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మరికొన్ని సంస్థలతో కలిసి నిర్వహించిన ఈ తరహా సర్వే దేశంలోనే మొట్టమొదటిది. ఈ స్టడీలో భాగంగా నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నైల్లోని 5 వందలకు పైగా చిన్న, పెద్ద ఆహార సంబంధిత వ్యాపారాలను పరిశీలించారు. మిగతా నగరాలతో పోలిస్తే చెన్నైలో ఆహార భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు కొంత మెరుగ్గా ఉన్నాయని తేల్చారు.

వంట నూనె వాడకంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.  ఏటా ఒక్కో మనిషీ 20 లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరు శనగ నూనె, సోయా ఆయిల్, కొబ్బరి నూనె, ఆవ నూనె ఇలా చాలా రకాల నూనెలు మనం వాడుతుంటాం. కానీ మనం వంట నూనెను వాడే పద్ధతి మాత్రం దారుణం. వ్యాపారస్తులు కావచ్చు, ఇంట్లో వంట చేసేవాళ్ళు కావచ్చు ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. ఇలా వాడిన నూనెలో 60 శాతం మళ్ళీ వంటలోకే వెళ్ళిపోతుందని తాజా సర్వే చెబుతోంది.

మార్కెట్లో నూనె వాడకంపై నియంత్రణ అత్యవసరమన్న విషయాన్ని ఈ స్టడీ తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వాలు, పౌర సమాజాలు, డాక్టర్లు కలిసికట్టుగా పని చేసి ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చట్టాల్లో మార్పులు వచ్చేలా చూడాలని ఇది సూచిస్తోంది. అలాగే వాడిన నూనే మళ్ళీ మళ్ళీ వాడ్డం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయన్నదానిపై ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని సర్వే చెబుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి