iDreamPost

ICC ర్యాంకింగ్స్‌ విడుదల.. మళ్లీ అగ్రస్థానంలోకి సిరాజ్‌!

  • Published Sep 20, 2023 | 3:04 PMUpdated Sep 20, 2023 | 3:36 PM
  • Published Sep 20, 2023 | 3:04 PMUpdated Sep 20, 2023 | 3:36 PM
ICC ర్యాంకింగ్స్‌ విడుదల.. మళ్లీ అగ్రస్థానంలోకి సిరాజ్‌!

టీమిండియా యువ పేసర్‌, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్‌ సిరాజ్‌ మరోసారి ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌ కిరీటాన్ని ధరించాడు. తాజాగా సవరించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ వన్డే క్రికెట్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌ 2023 ఫైనల్‌లో సిరాజ్‌ ఎలాంటి అద్భుతమైన బౌలింగ్‌ వేశాడో మనందరికీ తెలిసిందే. శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సిరాజ్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. మరీ విశేషం ఏంటంటే.. ఒకే ఓవర్‌లోనే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇలా వన్డే క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్‌గా సిరాజ్‌ చరిత్ర సృష్టించాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ తేడాలు వచ్చేశాయి. ఆసియా కప్‌కు ముందు సిరాజ్‌ ఎక్కడో 9వ స్థానంలో ఉన్నాడు. కానీ, ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో.. 8 స్థానాలు మెరుగు పర్చుకుని ఏకంగా నంబర్‌ వన్‌ స్థానానికి వచ్చేశాడు. గతంలోని కొన్ని రోజులపాటు సిరాజ్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సిరాజ్‌ 694 రేటింగ్‌తో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. నిన్నటి వరకు నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్‌ జోస్‌ హెజల్‌వుడ్‌ 678 రేటింగ్‌తో రెండో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 677 రేటింగ్‌తో ఉన్నాడు.

సిరాజ్‌తో పాటు టీమిండియా నుంచి టాప్‌ 10లో కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కడే ఉన్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ నిన్నటి వరకు 6వ స్థానంలో కొనసాగగా.. ప్రస్తుతం 638 రేటింగ్‌తో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ 632 రేటింగ్‌తో 10వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటర్స్‌ విషయానికి వస్తే.. టాప్‌ 10లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉన్నారు. యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రపంచ నంబర్‌ 2 బ్యాటర్‌గా ఉన్నాడు. తొలి స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లీ 8వ స్థానంలో, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 10వ ప్లేస్‌లో ఉన్నారు. వీరితో పాటు టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌గా, టెస్టుల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా, రవీంద్ర జడేజా నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నారు. మరి సిరాజ్‌ వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శివుడి థీమ్‌తో కొత్త క్రికెట్‌ స్టేడియం! విశేషాలు ఇవే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి