iDreamPost

శివుడి థీమ్‌తో కొత్త క్రికెట్‌ స్టేడియం! విశేషాలు ఇవే..

  • Published Sep 20, 2023 | 1:03 PMUpdated Sep 20, 2023 | 1:03 PM
  • Published Sep 20, 2023 | 1:03 PMUpdated Sep 20, 2023 | 1:03 PM
శివుడి థీమ్‌తో కొత్త క్రికెట్‌ స్టేడియం! విశేషాలు ఇవే..

ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారనే మాట ప్రచారంలో ఉంది. నిజానికి అందులో వాస్తవం కూడా ఉంది. ఇండియాలో సినిమాలకు, క్రికెట్‌కు ఉన్న ఫాలోయింగ్‌, ఆదరణ దేనికి ఉండదు. సినిమా నటులను, క్రికెటర్లను చాలా మంది డెమీ గాడ్స్‌లా భావిస్తుంటారు. క్రికెట్‌ను పిచ్చిగా ఇష్టపడే దేశాల్లో ఇండియానే ముందు ఉంటుంది. క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా.. చాలా మంది యువకులు కూడా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. అలాగే.. క్రికెట్‌ను చూసేవారి సంఖ్య సైతం నానాటికీ పెరిగిపోతుంది. ఫ్రాంచైజీ లీగులు వచ్చిన తర్వాత క్రికెట్‌ క్రేజ్‌ మరింత పెరిగిందనే చెప్పాలి. అయితే.. దేశంలో క్రికెట్‌కు ఉన్న డిమాండ్‌కు తగ్గట్లు.. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, హంగులతో కొత్త స్టేడియాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొత్త అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దేశంలో చాలానే అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఉన్నాయి. వాటికి భిన్నంగా అధునాతన సౌకర్యాలు, కొత్త కొత్త హంగులతో వారణాసి స్టేడియాన్ని నిర్మించనున్నారు. దేశంలో ప్రముఖ స్టేడియాలుగా ఉన్న ముంబైలోని వాంఖడే, కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌, ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ, మొహాలీ, చెన్నైలోని చెపాక్‌, బెంగుళూరులోని చిన్నస్వామి, మన హైదరాబాద్‌లోని ఉప్పల్‌, అహ్మాదాబాద్‌లోని మోదీ స్టేడియాలకు పూర్తి భిన్నగా వారణాసిలో క్రికెట్‌ స్టేడియం నిర్మించనున్నారు.

ఈ స్టేడియం నిర్మాణానికి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చాలా వినూత్నంగా ‘శివుడి’ థీమ్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. ఢమరుకం షేప్‌లో ఎంట్రన్స్‌, త్రిశూలం లాంటి ఫ్లడ్‌ లైట్లు పోల్స్‌ ఇలా.. ప్రతి విషయంలో శివతత్వం ఉట్టిపడేలా నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టేడియం నిర్మాణానికి ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో 33 వేల మంది కూర్చునే కెపాసిటీతో ఈ స్టేడియం నిర్మించనున్నారు. మరి శివుడి థీమ్‌తో క్రికెట్‌ స్టేడియం నిర్మాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌: ICC కీలక నిర్ణయం! బ్యాటర్లకు బ్యాడ్‌ న్యూస్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి