iDreamPost

రేపు మోదీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ఏం చెప్పబోతున్నారు..?

రేపు మోదీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ఏం చెప్పబోతున్నారు..?

ప్రధాని నరేంద్రమోదీ రేపు మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన మాట్లాడతారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కరోనా వైరస్ నియంత్రణకు గత నెల 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లో ఉన్న లాక్ డౌన్ రేపటితో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మరోసారి మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ పై ప్రధాని మోదీ కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.

లాక్ డౌన్ కొనసాగుతుందా..? కొనసాగితే ఎలా కొనసాగుతుంది..? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితినే కొనసాగిస్తారా..? లేదా మరింత కఠినంగా అమలు చేస్తారా..? కొంత సడలింపు ఇస్తారా..? అన్నదానిపై గత మూడు రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కరోనా ప్రభావాన్ని బట్టి దేశాన్ని మూడు జోన్లుగా విభజిస్తారు అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న విషయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కేసుల సంఖ్య 100 200 మధ్య ఉన్న సమయంలోనే లాక్ డౌన్ విధించారు. గత మూడు వారాల్లో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 9,500 దాటింది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

ఇటీవల జరిగిన అన్ని పార్టీల పార్లమెంట్ నాయకుల సమావేశంలోనూ ఆ తర్వాత జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం లోనూ ఈనెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. మెజార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఈనెల 30వ తేదీ వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో సంబంధం లేకుండా ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఈనెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. పంజాబ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రకటన చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు భౌతిక దూరం పాటించడమే మన ముందు ఉన్న ఏకైక మార్గమని అందరూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య పది వేల లోపు ఉన్నదంటే దానికి లాక్ డౌన్ విధించడమే ప్రధాన కారణం. వైరస్ వ్యాప్తి ప్రారంభంలోనే లాక్ డౌన్ ను సరైన సమయంలో విధించడంతో దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందలేదు. లేదంటే భారతదేశంలో కూడా అమెరికా యూరప్ దేశాల పరిస్థితి ఉండేది. దాదాపు 1.40 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ విధించడమే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ అనుమానితుల కు పరీక్షలు చేసేందుకు గాని, వైద్యం అందించేందుకు గాని భారతదేశంలో ఉన్న సౌకర్యాలు అంతంత మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికీ దేశంలో కేవలం రెండు లక్షల లోపు మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించారంటే.. దేశంలో ప్రభుత్వ వైద్య రంగ స్థాయి ఏంటో అర్థమవుతుంది. ప్రజల ప్రాణాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా, వెసులుబాటు కల్పించినా.. అమెరికా, యూరప్ దేశాల మాదిరిగా భారతదేశంలో పరిస్థితి తయారవుతుందన్న ఆందోళన దేశ వ్యాప్తంగా అందరిలోనూ వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి