iDreamPost

ఏడేళ్ళకు కిడ్నాప్, పదహారేళ్ళకు ఏస్కేప్: ముంబయి మిస్సింగ్ గర్ల్ కథ సుఖాంతం

ఏడేళ్ళకు కిడ్నాప్, పదహారేళ్ళకు ఏస్కేప్: ముంబయి మిస్సింగ్ గర్ల్ కథ సుఖాంతం

ఓ పాప ఏడేళ్ళ వయసులో కిడ్నాపైంది. తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ తన కుటుంబాన్ని కలుసుకుంది. కూతురి మీద ఆశలొదిలేసుకున్న ఆమె తల్లి బిడ్డను చూసి ఆనందం పట్టలేకపోయింది. అయితే ఆమె కంటే ఎక్కువగా సంతోషపడిన వ్యక్తి ఇంకొకరున్నారు. ఆయనే అసిస్టెంట్ సబ్-ఇన్స్ పెక్టర్ రాజేంద్ర భోస్లే. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పూజ కోస వెతికింది ఆయనే కదా మరి! థ్రిల్లర్ సినిమాని తలపించే ఈ మిరకిల్ స్టోరీ ఏంటో చూద్దాం!

అలా మొదలైంది!

ముంబయిలోని జుహు గల్లీలో 2013 జనవరి 22న మొదలైందీ కథ. ఏడేళ్ళ పూజా గౌడ్ పాకెట్ మనీ విషయంలో అన్నయ్యతో గొడవ పడింది. ఇద్దరూ స్కూలుకు బయల్దేరారు కానీ గొడవ వల్ల అన్నయ్య ముందే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకే ఒంటరిగా వస్తున్న పూజ  స్కూలు గేటు చేరేలోపే కిడ్నాపైంది. ఆ చెర నుంచి తప్పించుకుని మళ్ళీ ఇంటికి రావడానికి తనకి తొమ్మిదేళ్ళ ఏడు నెలలు పట్టింది.

 

మిస్సింగ్ గర్ల్ నంబర్ 166:

పూజ స్కూలుకు రాలేదని లేటుగా తెలుసుకున్న ఆమె అన్నయ్య అమ్మానాన్నకు విషయం చెప్పాడు. వాళ్ళు వెంటనే డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చారు. అదిగో అక్కడే పూజ మిస్సింగ్ గర్ల్ నంబర్ 166గా రికార్డుల్లో నమోదైంది. ఆ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్-ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న రాజేంద్ర భోస్లే మిస్సింగ్ బ్యూరో ఇన్ ఛార్జ్ కూడా. 2015 మే నాటికి ఆయన మిగిలిన 165 మంది అమ్మాయిలనూ కనిపెట్టాడు. కానీ పూజ ఆచూకీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. పోస్టర్లు వేసినా, మీడియాలో ప్రకటనలు ఇప్పించినా తను దొరకలేదు. మే తర్వాత రాజేంద్ర రిటైరై వాళ్ళ ఊరెళ్ళిపోయాడు. అయినా ముంబయి వచ్చినప్పుడల్లా పూజ కోసం వెతుకుండేవాడు. ఆయన పర్సులో ఎప్పుడూ పూజ ఫొటో ఉండేది. పూజ అమ్మానాన్న ఆశ వదిలేసుకున్నా ఆయన మాత్రం పాప ఎక్కడో ఓ  చోట ఉండే ఉంటుందని గట్టిగా నమ్మేవాడు.

ఇంతకీ పూజ ఏమైంది?

ఆరోజు అన్నయ్య వెనకే నడుస్తూ వెళ్తున్న ఏడేళ్ళ పూజను హ్యారీ డిసౌజా అనే అతను చూశాడు. ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఎందుకనుకున్నారు? పెంచుకోవడానికి! ఎలక్ట్రీషియన్ గా పని చేసే డిసౌజాకి చాలా కాలంగా పిల్లల్లేరు. అందుకే రోడ్డుపై ఒంటరిగా కనపడ్డ పూజను ఎత్తుకొచ్చేసి భార్య సోనీకి అప్పగించాడు. దంపతులిద్దరూ పూజకు “ఆనీ” అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా కాకపోయినా ప్రేమగానే   పెంచుకున్నారు. కానీ పూజ మిస్సింగ్ పై మీడియాలో హడావుడి చూసి డిసౌజా భయపడ్డాడు. పాపను కర్ణాటకలోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించాడు.

పాప పుట్టాక డిసౌజా దంపతులు మారిపోయారు! 

2016 వరకు అంతా బానే నడిచింది. ఆ సంవత్సరంలోనే డిసౌజా దంపతులకు పాప పుట్టింది. దీంతో వాళ్ళకు పూజ భారంగా కనిపించింది. హాస్టల్ ఫీజులు కట్టలేమంటూ పూజను స్కూల్ మాన్పించి ముంబయి తీసుకొచ్చేశారు. పసిపాపను చూసుకునే పని అప్పగించారు. దాదాపు ప్రతి రోజూ కొట్టేవారు. చుట్టుపక్కల ఎవరితోనూ మాట్లాడనిచ్చేవారు కాదు. ఎందుకైనా మంచిదని డిసౌజా దంపతులు జుహు గల్లీకి మకాం మార్చారు. విచిత్రమేమంటే ఆ ఇల్లు ఒకప్పుడు పూజ ఉన్న ఇంటికి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది. అంటే పూజ కొన్నేళ్ళపాటు తన సొంతింటికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉందన్నమాట!

విషయం బయటికి పొక్కిందిలా!

డిసౌజా ఇంట్లో పని చేసే పనమ్మాయి పూజతో మాట్లాడ్డం మొదలుపెట్టింది. డిసౌజా, సోనీ పూజ అసలు తల్లిదండ్రులు కాదని తెలుసుకుంది. దీంతో మిస్సింగ్ కేసుల గురించి గూగుల్ సెర్చ్ చేసింది. చివరికి పూజ ఫొటో ఉన్న పోస్టర్ దొరికింది. అందులోని ఐదు నంబర్లకు ఫోన్ చేసింది. నాలుగు పని చేయలేదు. ఐదోది పూజ అసలు తల్లిదండ్రుల ఇంటి పక్కనే ఉండే రఫీక్ అనే వ్యక్తిది. వీడియో కాల్ ద్వారా ఆయన పూజను తల్లికి చూపించాడు. ఆమె కూతురిని గుర్తుపట్టింది. ఆ తర్వాత పూజ పోలీసుల సాయంతో గురువారం తన ఇంటికి చేరుకుంది. అన్నేళ్ళ తర్వాత బిడ్డను చూసుకుని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. ఒక్కటే విషాదమేంటంటే ఈ సంతోషాన్ని పంచుకోవడానికి పూజ తండ్రి బతికిలేడు.

డిసౌజా ఏమయ్యాడు?

పాపను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన డిసౌజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను చూసుకోవడానికి ఎవరూ లేరన్న కారణంతో సోనీని మాత్రం అరెస్ట్ చేయలేదు. సర్వీసులో ఉన్నప్పుడు, రిటైరయ్యాక కూడా పూజ కోసం వెతుకుతూనే ఉన్న రాజేంద్ర భోస్లే చివరికి తన నమ్మకమే గెలిచిందని సంబరపడిపోతున్నాడు. సర్వీస్ ముగిసినంత మాత్రాన మానవత్వం ముగిసిపోదనేది ఆయన మాట. నిజమే కదా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి