iDreamPost

మంత్రి వర్సెస్ ఎంపి: నువ్వెంత.. నీ లెక్కెంత? : తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వాగ్వాదం

మంత్రి వర్సెస్ ఎంపి: నువ్వెంత.. నీ లెక్కెంత? : తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వాగ్వాదం

తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అటు అధికార టిఆర్ఎస్ లోనూ..ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ నాయకుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పబోయేది స్వపక్షంలో విపక్షం గురించి కాదు..అధికార పార్టీ మంత్రికి, ప్రతిపక్ష పార్టీ ఎంపికి జరిగిన బహిరంగ యుద్ధం గురించి. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ప్రజల ముంగుటే ఆడుకున్న వాగ్వాదం గురించి…

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నియంత్రిత పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై జరిగిన సదస్సు రాజకీయ విమర్శలకు వేదికైంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు, నల్గొండ ఎంపి ఉత్తమ కుమార్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదించుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే…నల్గొండ జిల్లా కలక్టరేట్ లో నియంత్రిత పంటల సాగు కార్యాచరణ ప్రణాళిక పై ప్రభుత్వం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు అధికార పార్టీ తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి (అదే జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే) జి.జగదీశ్ రెడ్డి, ప్రతిపక్షం పార్టీ కాంగ్రెస్ తరపున అదే జిల్లాకు చెందిన టిపిసిసి అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్లతో పాటు మరికొంత మంది స్థానిక నేతలు హాజరయ్యారు.

సదస్సు ప్రారంభం అయిన తరువాత మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేశామని అనగానే…ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొని “అబద్ధం చెబుతున్నారు. నిజాలు మాట్లాడండి” అని అన్నారు. దీంతో వెంటనే మంత్రి “వేదిక మీద అడ్డుతగలడం మంచి పద్ధతి కాదు. సీనియర్‌ నాయకుడిగా మీ గౌరవాన్ని నిలుపుకోండి. మీడియా కోసం గిమ్మిక్కులు చేయొద్దు” అంటూ హితవు పలికారు.

దీనిపై ఎంపి‌ ఉత్తమ్ “నువ్వు మీడియా కోసమే మాట్లాడుతున్నావు. అబద్ధం చెబుతున్నావ్‌. ఏది చెప్పినా వినాలా?” అంటూ ప్రశ్నించారు. వెంటనే మంత్రి “అవును, నేను మంత్రిని. నాకు మాట్లాడే హక్కు ఉంది. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే బయట చెప్పుకో. నువ్వెంత… నీ లెక్కేంది?” ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ఎంపి ఉత్తమ్ మరి నీ లెక్కేంది? అని నిలదీశారు.

మంత్రి జగదీశ్  “వాస్తవ లెక్కలతో అసెంబ్లీలో మాట్లాడడానికి రమ్మంటే పారిపోయింది మీరు. మమ్మల్నా విమర్శించేది?” అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఎంపి ఉత్తమ్ “మేం పారిపోయామా.. మర్యాద కొనసాగించూ” అన్నారు. వెంటనే మంత్రి “మర్యాద తప్పింది మీరు. నేను కాదు. ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినా మీకు సభా మర్యాదలు తెలియవు. ఆ ప్రజల దురదృష్టం” అని పేర్కొన్నారు.

దీంతో అప్పటి వరకు విధానాలపై జరిగిన వాగ్వాదం మంత్రి జగదీశ్ రెడ్డి మాటలతో వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. మంత్రి వ్యాఖ్యలపై దీనిపై ఎంపి చిర్రున లేస్తూ”మంత్రిగా నువ్వు ఉండడం ఈ ప్రజల దురదృష్టం” అంటూ ఆగ్రహం వ్యక్తం‌ చేశారు.

మంత్రి  “నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉండడం మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు” అని అన్నారు.

ఇలా సాగిన వాగ్వివాదం కొద్దిసేపటి తర్వాత సద్దుమణిగింది. అంతకు ముందే ఉత్తమ్‌ ప్రసంగిస్తూ స్థానిక ఎంపిగా ఉన్న తనకు రాత్రి 9 గంటలకు సమాచారం ఇచ్చారని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి