iDreamPost

రాజకీయాలోద్దు.. సలహాలు ఇవ్వండి

రాజకీయాలోద్దు.. సలహాలు ఇవ్వండి

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో రాజకీయాలు చేయొద్దని, సలహాలు, సూచనలు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కోడాలి నాని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా చోడవరంలో ఓ వృద్ధురాలు మృతి చెందితే రేషన్‌దుకాణం వద్ద చనిపోయింది, దాని కారణం కొడాలి నాని, సీఎం వైఎస్‌ జగన్‌.. అంటూ చంద్రబాబు బ్యాచ్‌ రాజకీయాలు చేస్తోందని మంత్రి నాని ఫైర్‌ అయ్యారు. రేషన్‌ పంపిణీపై ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు.

ప్రతి కుటుంబానికి రేషన్‌ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి చెప్పారు. వాలంటీర్లు ఏమయ్యారని దేమినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు మాట్లాడడంపై మంత్రి మండిపడ్డారు. వాలంటీర్లు ఖాళీగా కూర్చోలేదని, కరోన నియంత్రణపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. నిన్న మొన్నటి వరకు వాలంటీర్లు వైసీపీ వాళ్లు, రౌడీలు, గుండాలు అంటూ హేళన చేసిన టీడీపీ నేతలు.. నేడు వారి సేవలను గుర్తించినందుకు అభినందనలు తెలుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

70 ఏళ్ల వయస్సు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయం చేయకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి నాని హితవు పలికారు. కరోనా వైరస్‌కి భయపడి హైదరాబాద్‌ పారిపోయిన చంద్రబాబు అద్దాల మేడల్లో దాక్కున్నాడని విమర్శించారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్‌ కనుక్కోలేదని, కానీ చంద్రబాబు అనే యోల్లో వైరస్‌కు జగన్‌ రూపంలో వ్యాక్సిన్‌ ఉందన్నారు. యోల్లో వైరస్‌కు కోరలు పీకి దాని ప్రభావం లేకుండా సమాధి చేసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.

మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా.. కరోనా కట్టడిలో లోపాలేమైనా ఉంటే ఎత్తి చూపాలని మంత్రి కొడాలి సూచించారు. వృద్ధురాలి మృతిపై అసత్య వార్తలు ప్రసారం చేసిన మీడియాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించానని చెప్పారు. రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయని, అందరూ ఒకే సారి వెళ్లకుండా సమాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. ఏప్రిల్‌ 4వ తేదీన రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు అందిస్తామన్నారు. ఎవరైనా అందుబాటులో లేకపోతే ఆ తర్వాతైనా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి