iDreamPost

సీతారాముడితో ఆపద్బాంధవుడు – Nostalgia

సీతారాముడితో ఆపద్బాంధవుడు – Nostalgia

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వర్ రావు గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. 60 ఏళ్ళ వయసు వచ్చాక కూడా ప్రేమాభిషేఖం లాంటి లవ్ స్టోరీలో నటించి మెప్పించి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టడం ఆయనకే చెల్లింది. మన మధ్య లేకపోయినా నటించిన సినిమాల రూపంలో అక్కినేని జ్ఞాపకాలు నిత్యం సజీవంగానే ఉంటాయి. ఇక ఇప్పటి తరం కూడా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గురించి చిన్న మాటల్లో చెప్పే ప్రయత్నం చేయడం సాహసమే. అయితే వీళ్లిద్దరి వెండితెర కలయిక కేవలం ఒకేఒక్కసారి జరిగినప్పటికీ బయట వేడుకల్లో కలుసుకోవడం మాత్రమే ఎన్నోసార్లు చూసే భాగ్యం ప్రేక్షకులకు కలిగింది.

ఇక్కడ చూస్తున్న పిక్ అలాంటి అరుదైన సందర్భంలోనిది. 1990లో నాగేశ్వర్ రావు మొదటిసారి విగ్గు లేకుండా తాత పాత్రలో నటించిన చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. అద్భుతమైన సెంటిమెంట్ తో కళ్ళు చెమ్మగిల్లే ఎమోషన్స్ తో క్రాంతికుమార్ తీర్చిద్దిద్దిన తీరుకు ప్రేక్షకులు ప్రశంసలతో పాటు కనక వర్షము కురిపించారు. నిరాటంకంగా వంద రోజులు పూర్తి చేసుకుని కొన్ని చోట్ల సిల్వర్ జూబిలీ కూడా ఆడిందీ సినిమా. అందుకే దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఘనంగా వంద రోజుల సెలబ్రేషన్స్ చేశారు. దానికి ముఖ్య అతిధిగా చిరంజీవి వచ్చారు. ఆయనతో చిరుకు న్యాయం కావాలి, కిరాయి రౌడీలు లాంటి హిట్ సినిమాలు చేసిన బంధం ఉంది.

అదే సమయంలో చిరు గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఆపద్బాంధవుడు సైన్ చేశారు. అందుకే ఇలా ఏఎన్ఆర్, చిరులు అక్కడ కలుసుకున్నప్పుడు అభిమానులు ఆనందంతో మురిసిపోయారు. తర్వాతి కాలంలో చిరంజీవి నాగేశ్వర్ రావు గారితో మెకానిక్ అల్లుడులో కలిసి నటించగా క్రాంతి కుమార్ నిర్మాణంలో రిక్షావోడు చేశారు. రెండూ దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. సినిమా విచిత్రాలు అంటే అలా ఉంటాయి మరి. తర్వాత ఈ కాంబోని రిపీట్ చేయడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నించారు కాని సరైన కథ దొరక్క అది సాధ్యపడలేదు. అందుకే చిరంజీవికి ఎన్టిఆర్ తో ఒక సినిమా ఎఎన్ఆర్ తో ఒక సినిమా అలా జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి