iDreamPost

అజిత్ డెబ్యూకి మెగాస్టార్ క్లాప్ – Nostalgia

అజిత్ డెబ్యూకి మెగాస్టార్ క్లాప్ – Nostalgia

తలాగా అభిమానులతో పిలిపించుకుంటూ తమిళనాడులో అశేష అభిమానులను సంపాదించుకున్న అజిత్ కు ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ స్థాయిలో తెలుగు మార్కెట్ లేదు కానీ ఇక్కడ కూడా ఇతన్ని ప్రత్యేకించి అభిమానించే వాళ్ళు చాలానే ఉన్నారు. అయితే అజిత్ ముందు తెలుగులోనే గట్టి ప్రయత్నం చేశాడన్న సంగతి కొద్దిమందికే తెలుసు. అజిత్ మొదటి సినిమా తమిళ్ లో వచ్చిన అమరావతి. ఇది 1993లో విడుదలైంది. అదే సంవత్సరం తెలుగులో ప్రేమ పుస్తకం అనే స్ట్రెయిట్ మూవీ చేశాడు.

దానికి ఓపెనింగ్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరై ఆశీర్వదించారు. ఆ ఫోటోనే తర్వాత రోజుల్లో ప్రకటనలుగా వేసుకున్నారు. ప్రేమ పుస్తకం దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్. ఇతను సుప్రసిద్ధ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి. ప్రేమ పుస్తకం షూటింగ్ మధ్యలో ఉండగానే ఓ ప్రమాదం వల్ల శ్రీనివాస్ అర్ధాంతరంగా కన్ను మూశారు. దాంతో మిగిలిన భాగాన్ని గొల్లపూడి గారు పూర్తి చేసి టైటిల్స్ లో మాత్రం అబ్బాయి పేరుని అలాగే ఉంచేశారు. అయితే ప్రేమ పుస్తకం ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు.

దేవేంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ఒక లవ్ స్టోరీ. దీనికి గాను గొల్లపూడి గారికి స్క్రీన్ ప్లేకు గాను నంది అవార్డు వరించింది. అయితే తెలుగు ప్రేక్షకులు కోరుకున్న వేగం సినిమాలో లేకపోవడంతో పాటు ప్రొడక్షన్ లో జరిగిన జాప్యం ప్రేమ పుస్తకం ఫైనల్ అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపించింది. దీని షూటింగ్ లో వైజాగ్ లో జరుగుతున్న సమయంలోనే శ్రీనివాస్ గారు ప్రమాదానికి గురై చనిపోయింది. ఆయన పేరు మీదే గొల్లపూడి అవార్డు స్థాపించి ఇండస్ట్రీలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. చిరంజీవి క్లాప్ లో కొట్టిన సందర్భంలో అజిత్ భవిష్యత్తులో ఇంత పెద్ద స్టార్ అవుతాడని ఊహించాడో లేదో కానీ అంతకన్నా ఎక్కువే అన్నట్టు అజిత్ తిరుగు లేని ఫాలోయింగ్ తో వందల కోట్ల మార్కెట్ ని సృష్టించుకోగలిగారు. కాని ప్రేమపుస్తకం తర్వాత తెలుగులో మరో స్ట్రెయిట్ మూవీ చేయలేకపోయారు అజిత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి