iDreamPost

వారికి, వీరికి వ్యత్యాసం ఉండాలి కేసీఆర్‌ గారు..!

వారికి, వీరికి వ్యత్యాసం ఉండాలి కేసీఆర్‌ గారు..!

కరోనా వైరస్‌ విజృంభణ, ఆర్థిక వ్యవస్థ కుదేలు, రూపాయి రాని ఆదాయం, ప్రజలకు ఉద్దీపన చర్యలు, ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని కేసీఆర్‌ తీసుకున్నారు. ప్రజలే ముందు.. ఆ తర్వాతే ప్రభుత్వమైనా, ప్రజా ప్రతినిధులైనా అనే సందేశం ఇచ్చారు. ఉద్యోగి స్థాయి, అతనికి వచ్చే జీతాన్ని బట్టీ 75 శాతం నుంచి 10 శాతం వరకూ కోత విధించి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూశారు.

కేసీఆర్‌ నిర్ణయం ఉద్యోగుల్లో ఒక వర్గానికి అసంతృప్తిని కలిగిస్తోంది. వారే వైద్యులు, వైద్య సిబ్బంది. ప్రస్తుత విపత్కర కాలంలో వైద్యశాఖ, పోలీసుశాఖ, పారిశుధ్య సిబ్బంది మాత్రమే విశిష్టసేవలందిస్తున్నారు. మిగతా శాఖల్లో మెజారిటీ శాతం ఉద్యోగులకు సెలవులు ఇచ్చారు. సెలవుల్లో ఉన్నాం కాబట్టి వేతనంలో కోత పెట్టారని ఆయా శాఖల ఉద్యోగులు కేసీఆర్‌ నిర్ణయంపై సైలెంట్‌గా ఉన్నారు. కానీ వైద్య శాఖ ఉద్యోగులు అహర్నిశలు పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనాపై పోరాటం చేస్తున్నారు. వారికి ప్రొత్సాహాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి కానీ జీతంలో కోత విధించడం సరికాదనేది అత్యధికుల అభిప్రాయం.

ఒరిసా ప్రభుత్వం వైద్యశాఖ ఉద్యోగులకు నాలుగు నెలల జీతం ముందుగానే ఇచ్చి వారు మరింత ఉత్సాహంగా పని చేసేలా చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వం ఒరిసా దారిలో నడిచింది. వైద్య శాఖ ఉద్యోగులకు ఒక నెల జీతం ముందుగా ఇచ్చింది. పని చేయని వారికి కోత విధించినా ఫర్వాలేదు కానీ సాధారణ రోజులు కన్నా ప్రస్తుతం ఎక్కువ సమయం వి«ధులు నిర్వర్తిస్తున్న వైద్యశాఖ సిబ్బందికి మాత్రం పూర్తి వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిలో అసంతృప్తి పనిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రజలకు మంచి చేసే విషయంలో బిడియాలు, ఇగోలు పట్టించుకోని కేసీఆర్‌ తాను పట్టువిడుపుల మనిషిని అని ఎన్నో సందర్భాల్లో రుజువు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ఉత్సాహాన్ని ఇచ్చే నిర్ణయం ఎంత వేగంగా తీసుకుంటే అంత మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి