iDreamPost

ఆస్తుల అమ్మకం.. నాగార్జున సాగర్‌ను లీజుకిచ్చేస్తారా..?

ఆస్తుల అమ్మకం.. నాగార్జున సాగర్‌ను లీజుకిచ్చేస్తారా..?

ప్రజల నిరసనలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల ఆందోళనలను ఖాతరు చేయడం లేదు. ప్రతిపక్షాల విమర్శలను లక్ష్యపెట్టడం లేదు. ఎవరు ఏమనుకున్నా.. ఫర్వాలేదు.. తాము అనుకున్నదే చేయాలనే మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వ కంపెనీలు, వివిధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. ఆయా కంపెనీల లాభనష్టాలతో సంబంధంలేకుండా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తమ భూములు, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఉంది.

ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు నిత్యం ఎండగడుతూనే ఉన్నారు. ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆ పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేలు సహా పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనిని తూర్పారబడుతున్నారు. అయితే ఒక్కరోజు పర్యటన కోసం శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వం సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయిస్తున్న తీరును ఒకేఒక్క మాటతో ఎండగట్టారు. 75 ఏళ్లలో వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థల వల్ల జాతి సంపద పెరిగిందని, మోదీ ప్రభుత్వం పప్పుబెల్లాల మాదిరిగా ఆయా సంస్థలను తమ కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్టడుతోందని మండిపడిన ఖర్గే.. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్, నారాయణ్‌పూర్, ఆల్మట్టి ప్రాజెక్టులను లీజుకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.

సాగునీటి ప్రాజెక్టులను లీజుకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న ఖర్గే వ్యాఖ్యలు నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఖర్గే చేసిన వ్యాఖ్యలు సామాన్యులను సైతం ఆలోచింపజేస్తున్నాయి. ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సహా వివిధ ప్రభుత్వ సంస్థలతోపాటు రోడ్డు, విమానాశ్రయాలు, రైళ్లను కూడా ప్రైవేటు కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం అమ్ముతోంది. కంపెనీలతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను కూడా ప్రైవేటుపరం చేయడం వల్ల రాబోయే రోజుల్లో తమకు కష్టాలు తప్పవన్న ఆందోళనలో దేశ ప్రజలున్నారు. ప్రైవేటు కంపెనీలు లాభాలే లక్ష్యంగా వ్యాపారాలు చేస్తాయి. ఇలాంటి కంపెనీలకు జాతీయ రహదారులు, రైళ్లు అమ్మేస్తే.. ఆయా రహదారులపై వాహనాలు నడపాలన్నా.. రైళ్లలో ప్రయాణించాలన్నా ప్రజలు తమ జేబులను గుళ్ల చేసుకునే పరిస్థితి తలెత్తుతుంది.

Also Read : అమ్మకాల్లో ఆరితేరారు .. అందుకే వైజాగ్ స్టీలు సిఎండి అయ్యాడు !