iDreamPost

ఇసుక విధానంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పలు మార్పులకు నేడే శ్రీకారం

ఇసుక విధానంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పలు మార్పులకు నేడే శ్రీకారం

ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రారంభం నుంచి పట్టుదలతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఇసుక దందాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో సాగుతున్నారు. అందుకు అనుగుణంగా తొలుత ఆన్ లైన్ విధానం ప్రవేశ పెట్టి పూర్తి పారదర్శకంగా విధానం రూపకల్పన చేశారు. అయితే ఆన్ లైన్ పట్ల అవగాహన లేని కొందరు సామాన్యులు పడుతున్న ఇక్కట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దాంతోపాటుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లో సాగుతున్న అవకతవకలపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ హ్యాక్ చేస్తున్న కొందరిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అరెస్ట్ కూడా చేసింది.

ఈనేపథ్యంలో తాజాగా ఇసుక పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయం కూడా సేకరించింది. గత నెల 28 వరకూ దానికి గడువు పెట్టింది. పలువురు తమ సూచనలు ప్రభుత్వానికి తెలియజేశారు. వాటన్నింటినీ క్రోఢీకరించి కొత్త విధానం రూపకల్పన చేయబోతున్నట్టు ప్రకటించారు. దానికి తగ్గట్టుగా విధాన మార్పులకు క్యాబినెట్ లో తుదిరూపం ఇవ్వబోతున్నారు. అనేక వాగులు, కాలువల్లో ఇసుక తవ్వకాలకు ఉచితంగా అందిస్తున్నారు. దాంతో పాటుగా నేరుగా ర్యాంపుల వద్ద రిజిస్టేషన్ తో పని లేకుండా వినియోగదారులు ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇక ప్రభుత్వం నిర్ణయించిన వాహనంలోనే రవాణా చేయాలనే షరతుని తొలగిస్తున్నారు. ర్యాంపుల నుంచే ఇసుక తీసుకెళ్ళే వీలు కల్పించడంతో కావాల్సిన నాణ్యతలో ఇసుక ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా దక్కుతుంది. దాంతో ఇసుక సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

గతంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిన తరుణంలో ప్రస్తుతం వాటికి చెక్ పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. సుదీర్ఘకాలంగా ఇసుక మాఫియాలో మునిగిన బ్యాచ్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ సీఎం చిత్తశుద్ధితో తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే ఇసుక ఆదాయం అక్రమార్కుల చేతుల్లోంచి ప్రభుత్వ ఖజానాకి చేరే ప్రక్రియ మొదలయ్యింది. ఇసుక విధానంలో తాజా మార్పులతో ప్రజలకు కూడా ఉన్న అపోహలు, సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపడంతో ఇసుక విధానం మరింత మెరుగైన ఫలితాలనిచ్చే దిశలో ఉంటుందని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి