iDreamPost

పాత సినిమాలతో కొత్త పండగ

పాత సినిమాలతో కొత్త పండగ

నిన్న రాజమండ్రిలో వేసిన ఒక్కడు స్పెషల్ షోకు ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హౌస్ ఫుల్ అయ్యాక చాలా మంది టికెట్లు దొరక్క వెనక్కు వెళ్లారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, అభిమానుల సందడి మాములుగా లేదు. థియేటర్ లోపల చేసిన రచ్చ తాలూకు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఉత్సాహాన్ని చూసిన ఇతర ప్రాంతాల అభిమానులు తామున్న చోట కూడా ఒక్కడు వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 20 ఏళ్ళ క్రితం వచ్చిన ఒక్కడు అప్పట్లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ గుర్తే. సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాస్ లో అశేషమైన గుర్తింపు ఫాలోయింగ్ తెచ్చిన క్లాసిక్ గా నిలిచిపోయింది.

మరోవైపు ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఫోర్ కె రెజోల్యూషన్ తో పోకిరిని తిరిగి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కాకినాడ లాంటి నగరాల్లో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లోనూ ప్రీమియర్ల కోసం రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. బహుశా పాత సినిమాలను ఈ స్థాయిలో రీ రిలీజ్ చేయడం ఇదే మొదటి సారి అనుకోవచ్చు. దెబ్బకు పవన్ అభిమానులు రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 2న తమ హీరో బర్త్ డే కాబట్టి జల్సాని ఇదే తరహాలో పునఃవిడుదల చేయాలని నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ని డిమాండ్ చేస్తున్నారు. అయితే థియేటర్ లో ప్రదర్శించేందుకు అవసరమైన డిపిఎక్స్ ఫైల్ మిస్ అవ్వడంతో ఇది వేయడం అనుమానమే.

,మొత్తానికి అప్పుడెప్పుడో సంవత్సరాల క్రితం జరిగిన రీ రిలీజుల సందడి మళ్ళీ మొదలైనట్టే కనిపిస్తోంది. యుట్యూబ్, ఓటిటిలు వచ్చాక జనం పాత క్లాసిక్స్ ని తిరిగి వెండితెర మీద చూసేందుకు ఇష్టపడతారానే దాని మీద బోలెడు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడీ స్పందన చూశాక ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఒక్కడు, పోకిరి, జల్సా లాంటివి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫ్రీగా చూసే సౌలభ్యం ఉన్నప్పుడు టికెట్లు కొనిమరీ వెళ్లడం అనూహ్యమే. మొన్న జూలై 31 ఇదే తరహాలో రాజమండ్రిలోనే మగధీర వేస్తే అదీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కొత్త రిలీజులకే జనం లేక లబోదిబోమంటున్న ట్రెండ్ లో ఇలా జరగడం విచిత్రం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి