iDreamPost

భావోద్వేగాల కలబోత ‘మురారి’ – Nostalgia

భావోద్వేగాల కలబోత  ‘మురారి’ – Nostalgia

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి అభిమానుల అండదండలతో నెట్టుకొస్తున్న మహేష్ బాబులోని అసలైన నటుడిని పరిచయం చేసిన సినిమా మురారి ఎప్పటికి గుర్తుండిపోతుంది. తనను ఎందుకు క్రియేటివ్ డైరెక్టర్ అంటారో కృష్ణవంశీ వెండితెర సాక్షిగా మూడు గంటల ఎమోషన్ ని కారణంగా చూపించిన చిత్రమది.

మురారి చాలా సంక్లిష్టమైన కథ. ఓ వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆ కుటుంబం శాపాన పడి తరానికో వారసుడిని దారుణమైన పరిస్థితుల్లో పోగొట్టుకుంటూ ఉంటుంది.

ఇప్పుడు మురారి వంతు వస్తుంది. బామ్మకు, గుడి పూజారికి ఈ విషయం ముందే తెలిసిపోతుంది. అప్పటికే మురారి తమ కుటుంబంతో మాటలు లేని ఫామిలీలోని అమ్మాయిని ప్రేమిస్తాడు. అదో గొడవ. భయపడినట్టే ఓ రోజు జరిగిన కొట్లాటలో మురారి ప్రాణం మీదకు వస్తుంది. మరి దేవుడి శాసనాన్ని మీరి ఓ యువకుడి సంకల్ప శుద్ధి అతనికి ఎలా ప్రాణాన్ని ఇచ్చిందన్నదే మురారి కథ.

నిజానికి ఈ సినిమా విడుదలైనప్పుడు లెన్త్ మీద చాలా కంప్లయింట్స్ వచ్చాయి. మూడు గంటల పాటు ఇంత సెంటిమెంట్ ని జనం భరించరని డిస్ట్రిబ్యూటర్లు కొన్నిచోట్ల స్వంత నిర్ణయాలు తీసుకుని కత్తెర వేయడం మొదలుపెట్టారు. కానీ కృష్ణవంశీ మాత్రం వినలేదు . ఆయన నమ్మకమే నిజమయ్యింది. మురారి జనం హృదయాల్లోకి మెల్లగా ప్రవేశించాడు. అంతే. ఇక బయటికి రానని మొండికేశాడు. అంతగా మురారిని అక్కున చేర్చుకున్నారు తెలుగు ప్రేక్షకులు.

కుటుంబ సభ్యుల మధ్య సున్నిత భావోద్వేగాలను మలిచిన తీరు, బావామరదళ్ల అల్లరి ప్రేమ, సంప్రదాయాలకు ఇవ్వాల్సిన విలువ ఇవే కాదు ఇంకెన్నో అంశాలు మురారిని మహేష్ వన్ అఫ్ ది కెరీర్ బెస్ట్ గా నిలిపాయి. తొలుత ఆడుతుందా లేదా అనే అనుమానాల నుంచి ఏకంగా సిల్వర్ జూబ్లీ దాకా పరుగులు పెట్టడం చిన్న విషయం కాదు. మణిశర్మ సంగీతం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఫిబ్రవరి 17, 2001లో విడుదలైన మురారి ఈ కారణాల వల్లే టైం లెస్ క్లాసిక్ గా నిలిచిపోయి టీవీలో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులను తన ముందు కట్టిపారేసుకుంటోంది. దర్శకుడు కృష్ణవంశీ దీనికి ముందు తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఇది మాత్రం చెక్కుచెదరలేని స్థానాన్ని సంపాదించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి