iDreamPost

Maaran Report : మారన్ రిపోర్ట్

Maaran Report : మారన్ రిపోర్ట్

ఈ మధ్య తెలుగు ఆడియన్స్ అంటే తమిళ నిర్మాతలకు మరీ చులకనగా ఉంది. కనీసం టైటిల్ ని మన భాషలో పెట్టాలన్న సొయ లేకుండా ఒరిజినల్ పేర్లను అలాగే పెట్టేసి డబ్బింగ్ సినిమాలు మనమీదకు రుద్దుతున్నారు. తలైవి, మహాన్, వలిమై తర్వాత ఇప్పుడు మారన్ అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ జరుపుకున్న ఈ చిత్రం మీద చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రజినీకాంత్ కూతురితో విడాకుల వ్యవహారం అయ్యాక వచ్చిన మూవీ ఇదే. జగమే తంతిరం తర్వాత డైరెక్టర్ ఓటిటి రిలీజ్ అందుకోవడం ధనుష్ కు ఇది రెండో సారి. మరి ఇందులో మ్యాటర్ ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

మారన్(ధనుష్)ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సమాజంలోని పలుకుబడి ఉన్న పెద్దల వల్ల తన తండ్రిని చిన్నప్పుడే కోల్పోతాడు. ఓ ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి కూడా చనిపోతుంది. అక్కడి నుంచి అంతా తానై పాపను పెంచి పెద్ద చేస్తాడు. ఈవిఎం స్కామ్ కు సంబంధించి వాస్తవాలను వెలికి తీసే క్రమంలో మారన్ కు ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. దీంతో తనతో పాటు చెల్లెలు కూడా చిక్కుల్లో పడుతుంది. అసలు ఇంతకీ ఈ ముప్పు ఏంటి, దానికి విలన్(సముతిరఖని)కు ఉన్న సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. ఈ విష వలయాన్ని మారన్ ఎలా ఛేదించాడు అనేదే మిగిలిన స్టోరీ.

ధనుష్ తనవైపు వేలెత్తి చూపించకుండా బాగానే చేశాడు. హీరోయిన్ మాళవిక మోహనన్ ఉత్సవ విగ్రహమే అయ్యింది. మిగిలిన క్యాస్టింగ్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అభిరుచి కలిగిన దర్శకుడు కార్తీక్ నరేన్ ఎక్కడా తన ముద్ర వేయలేకపోయారు. తాతల కాలంనాటి ఫార్ములాతో ఇంతటి పేలవమైన స్క్రిప్ట్ ఎలా రాసుకున్నారో అర్థం కాదు. ఇటీవలి కాలంలో అరవ దర్శకులకు సెంటిమెంట్ పైత్యం బాగా చుట్టుకుంది. మెయిన్ థీమ్ ని ఇబ్బంది పెట్టే ఎపిసోడ్స్ ని బలవంతంగా ఇరికిస్తున్నారు. రెండు గంటల పది నిమిషాలే ఉన్నప్పటికీ చివరిదాకా ఓపిగ్గా కూర్చుని చూడటం కష్టమనే ఈ మారన్ ఫలితం చూశాకైనా ధనుష్ మారితే మంచిది

Also Read : Salman Khan : గాడ్ ఫాదర్ కోసం కండల వీరుడు రెడీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి