iDreamPost

Love Hostel Report : లవ్ హాస్టల్ రిపోర్ట్

Love Hostel Report : లవ్ హాస్టల్ రిపోర్ట్

ఒకప్పుడు ప్రేమకథలతో బాలీవుడ్ లో మంచి సక్సెస్ ఎంజాయ్ చేసిన ధర్మేంద్ర వారసుడు బాబీ డియోల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నప్పటికీ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక ఆర్టిస్ట్ గా బాగా బిజీ అయ్యారు. హీరో విలన్ అనే తేడా లేకుండా పాత్ర నచ్చితే చాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ క్రమంలో వచ్చిందే లవ్ హాస్టల్. జీ5లో ఇటీవలే ప్రీమియర్ జరుపుకున్న ఈ మూవీ మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ట్రైలర్ ని కట్ చేసిన తీరు ఆ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంది. శంకర్ రామన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ హాస్టల్ టైటిల్ అయితే వెరైటీగా ఉంది. సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

దాగర్(బాబీ డియోల్)తన కులం అమ్మాయిలను తక్కువ స్థాయి అబ్బాయిలు ఎవరైనా ప్రేమించి తీసుకెళ్ళిపోతే వాళ్ళను వెంటాడి మరీ ఇద్దరినీ చంపేసే దారుణమైన కాంట్రాక్ట్ కిల్లర్. మధ్యలో ఎవరొచ్చినా వాళ్లకు చావే గతి. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనవరాలైన జ్యోతి దిలావర్ (సాన్యా మల్హోత్రా) మటన్ కొట్టు పేరుతో ఆయుధాల వ్యాపారం చేసే అహమద్(విక్రాంత్ మాసే)తో ప్రేమలో పడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కోర్టు ఆదేశాలతో సేఫ్ హోమ్ లో చేరుతుంది. వీళ్ళను హతమార్చే పని దాగర్ కు వస్తుంది. మరి ఇతను ఆ జంటను ఏం చేశాడు, అసలు ఇతనికి ప్రేమంటే ఎందుకంత కక్ష ద్వేషం అనేది తెలియాలంటే లవ్ హాస్టల్ మీద లుక్ వేయాలి.

దర్శకుడు శంకర్ రామన్ ఇంటెన్సిటీతో డ్రామాను నడిపారు. కానీ పాయింట్ బాగున్నప్పటికీ విపరీతమైన రక్తపాతం, అడ్డదిడ్డంగా లాజిక్స్ లేకుండా దాగర్ చేసే మర్డర్లు మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నాయి. మధ్యలో ఒక అరగంట థ్రిల్ ని మైంటైన్ చేసినప్పటికీ ఆ తర్వాత గ్రిప్ కోల్పోయారు. క్లైమాక్స్ లో దాగర్ పాత్రను ముగించిన తీరు అసంతృప్తిని కలిగిస్తుంది. ఆధిపత్యం పేరుతో అగ్రకులాలు చేసే దారుణాలు కళ్ళకు కట్టే ప్రయత్నం చేసినప్పటికీ అందులో కొంత మేర మాత్రమే సక్సెస్ అయ్యారు. క్యాస్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరింది. అప్ అండ్ డౌన్స్ ఉన్నా పర్లేదు ఓ మోస్తరు టైం పాస్ థ్రిల్లర్ చాలు అనుకుంటే లవ్ హాస్టల్ ని ట్రై చేయొచ్చు.

Also Read : Pawan Kalyan :ఈ రీమేకుల పరంపరకు బ్రేక్ ఉండదా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి