iDreamPost

బ్లాక్ బస్టర్ కాంబో మొదటి అడుగు – Nostalgia

బ్లాక్ బస్టర్ కాంబో మొదటి అడుగు – Nostalgia

ఇప్పుడంటే లారీలు కేవలం రవాణాకే పరిమితమయ్యాయి కానీ ఒకప్పుడు వీటిలో జనం కూడా ప్రయాణించేవారు. సుదూర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లకు పల్లెటూరి జనం వీటిలోనే గమ్యస్థానాలకు చేరుకునేవారు. లారీ నడిపే డ్రైవర్లకు చాలా డిమాండ్ ఉండేది. చదువు ఉన్నా లేకపోయినా ఈ విద్య తెలిస్తే చాలు జీవనోపాధికి లోటు లేదన్న రీతిలో సాగేది. అందుకే మాస్ ను టార్గెట్ చేస్తూ హీరోలను చోదకులుగా చూపించే ట్రెండ్ మొదలయ్యింది. ఎవరు మొదలుపెట్టారో చెప్పలేం కానీ దానికో కమర్షియల్ ఫ్లేవర్ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తెచ్చుకునేలా చేసింది మాత్రం 1979లో వచ్చిన ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు. రాఘవేంద్రరావు సృష్టించిన మాస్ మేజిక్ ఇది.

తర్వాత కృష్ణ, కృష్ణంరాజు లాంటి స్టార్లు కూడా చేశారు కానీ ఆ స్థాయి ప్రభావం చూపించలేకపోయారు. తిరిగి 1990లో బాలకృష్ణతో ఇదే తరహా సబ్జెక్టుతో రచయిత ఆంజనేయ పుష్పానంద్ ఓ కథను తయారు చేశారు. నటుడు రావుగోపాల్ రావు నిర్మాతగా అప్పటికే బాలయ్యతో 1987లో భార్గవరాముడుతో మంచి విజయం అందుకున్నారు. దానికి మించి మరొక హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో దర్శకుడు బి గోపాల్ తో ప్రాజెక్టుని సెట్ చేసుకున్నారు. నాగార్జున కలెక్టర్ గారి అబ్బాయి, వెంకటేష్ రక్తతిలకం, చిరంజీవి స్టేట్ రౌడీలతో ఆయన మంచి ఫామ్ లో ఉన్న సమయముది. పరుచూరి బ్రదర్స్ సంభాషణలతో స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్నారు.

అందరికి తల్లో నాలుకగా ఉండే ఓ లారీ డ్రైవర్ కు, నిజాయితీ ప్రాణంగా భావించే ఓ కలెక్టర్ కుటుంబానికి మధ్య ముడిపెట్టి నడిపించిన డ్రామా బాగా పడింది. చక్రవర్తిని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పుడు సందేహపడిన వారే అందులో గూస్ బంప్స్ ఇచ్చే పాటలు విన్నాక మారుమాట్లాడలేదు. విజయశాంతి, శారద, విజయ్ కుమార్, రావుగోపాల్ రావు, వినోద్, తమిళ విలన్ రాజకృష్ణమూర్తి లాంటి మంచి క్యాస్టింగ్ పడటంతో సినిమా కాస్తా విందు భోజనంగా మారిపోయింది. 1990 డిసెంబర్ 21న విడుదలైన లారీ డ్రైవర్ బ్రహ్మాండమైన విజయం దక్కించుకుంది. బి గోపాల్ తో హిస్టారికల్ కాంబోకి తొలి పునాది వేసింది

Also Read : ఐపిఎస్ డ్రెస్సులో రివెంజ్ డ్రామా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి