iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 46 – కరోనా థ్రిల్లర్

లాక్ డౌన్ రివ్యూ 46 – కరోనా థ్రిల్లర్

థియేటర్లు లేక ప్రేక్షకులు ఎలాగైతే ఇళ్లకే పరిమితమయ్యారో అదే తరహాలో ఇప్పుడు ఫిలిం మేకర్స్ కూడా కాలు బయట పెట్టకుండానే సినిమాలు ఎలా తీయాలన్న ఆలోచనను గట్టిగానే చేస్తున్నారు. చేతిలో ఐఫోన్ ఉంటే చాలు క్రియేటివిటీని చూపించవచ్చనే తరహాలో ఇప్పటికే పలు భాషల్లో ప్రయోగాలు ఊపందుకున్నాయి. దానికి తగ్గట్టే ఫలితాలు కూడా చక్కగా వస్తున్నాయి. టెక్నికల్ గా ఇవి అత్యున్నత స్థాయిలో ఉన్నాయా అని ప్రశ్నించుకోవడం సబబు కాదు కానీ ఉన్న పరిమితుల్లో అవకాశాన్ని సృష్టించుకోవడం మాత్రం ఖచ్చితంగా మెచ్చదగిన విషయమే. ఈ క్రమంలో వచ్చిన సిరీస్ ది గాన్ గేమ్. తక్కువ ఎపిసోడ్లతో టైంని డిమాండ్ చేయని నిడివితో రూపొందిన ఈ కరోనా థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ గుజ్రాల్(సంజయ్ కపూర్) కొడుకు సాహిల్(అర్జున్ మాథుర్) సుహాని(శ్రియ పిల్గొంకర్)ని పెళ్లి చేసుకున్నాక తో వేరు కాపురం ఉంటాడు. కరోనా వల్ల లాక్ డౌన్ రావడంతో వీళ్ళు ఎక్కడిక్కడ చిక్కుబడిపోతారు. కానీ రోజు వీడియో కాల్స్ ద్వారా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. రాజీవ్ కూతురు అమరా({శ్వేతా త్రిపాఠి)డాక్టర్. ఓసారి సాహిల్ కు తీవ్ర జ్వరం కలగడంతో ప్రతీక్(ఇంద్రనీల్) సహాయంతో ఆసుపత్రిలో చేరతాడు. కానీ మరుసటి రోజే తను చనిపోయినట్టు, అంత్యక్రియలు కూడా హాస్పిటల్ వాళ్ళే చేసినట్టు సుహానికి కబురు వస్తుంది. దీంతో కర్మ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. కానీ కొద్దీ రోజుల తర్వాత సాహిల్ మరణానికి సంబంధించి కొత్త అనుమానాలు తలెత్తుతాయి. అసలు తను బ్రతికే ఉన్నాడని అమరా కనుగొంటుంది. అసలు ఈ మిస్టరీకి కారణం ఎవరు, సాహిల్ కు నిజంగా ఏమైంయ్యిందో తెలియాలంటే సిరీస్ చూడాలి

నటీనటులు

మాములుగా మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించడం అలవాటు అయినవాళ్లకు ఫోన్ కెమెరాతో అందానికి మెరుగులు లేకుండా ఒంటరిగా ఇంట్లో నుంచే అభినయించడం చాలా కష్టం. ఎక్స్ ప్రెషన్స్ ,లైవ్ గా అనిపించవు. లేనిది ఊహించుకోవడం చాలా కష్టం. కానీ ఇందులో క్యాస్టింగ్ మొత్తం ఆ లోటు రాకుండా అద్భుతంగా నటించారు. అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ వెండితెరమీద గొప్పగా సక్సెస్ కాకపోయినా స్కోప్ దొరికినప్పుడు ఇలాంటి వాటిద్వారా తనలో యాక్టర్ ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఇందులో కూడా అదే చేశారు. రాజీవ్ గా పెర్ఫెక్ట్గ్ ఛాయస్ అనిపించారు. కథలో మెయిన్ పాయింట్ గా నిలిచిన క్యారెక్టర్ లో శ్రియ పిల్గొంకర్ జీవించేసింది. నేనేం తక్కువ తిన్నానా అంటూ శ్వేతా త్రిపాఠి కూడా ఒదిగిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఉన్న తక్కువ లెన్త్ లో చాలా న్యాచులర్ గా చేసి కాన్సెప్ట్ పరంగా ఉన్న లిమిటేషన్స్ ని చాలా సులభంగా దాటేశారు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు నిఖిల్ భట్ తీసుకున్న కథలో నవ్యత ఉంది. బయట లొకేషన్స్ తో అవసరం లేకుండా కేవలం ఇన్ డోర్ లో నడిచేలా స్టోరీ ఉంటే ఎలా అనే ఆలోచనకు నిఖిల్-అయేషా-మౌతిక్ ల సంయుక్త రచన ఇచ్చిన రూపం చాలా బాగుంది. ఇందులో స్క్రీన్ రైటర్ రాధికా ఆనంద్ కృషి కూడా ఉంది. ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా మహమ్మారినే సబ్జెక్టుగా తీసుకున్న వీళ్ళ క్రియేటివిటీని నిజంగా హాట్స్ ఆఫ్. అలా అని ఏదో ఎమోషనల్ డ్రామానో లేక సెంటిమెంటల్ ప్లాటో తీసుకోకుండా ఒక క్రైమ్ థ్రిల్లర్ అనిపించే కాన్సెప్ట్ ని తీసుకోవడం బాగుంది. మనిషిలో ఉన్న భయం లక్షలాది కుటుంబాలను ఎలాంటి భయాందోళనలకు గురి చేస్తుందో ఇందులో డిటైల్డ్ గా చూపించారు.

కరోనా సోకి రోగి చనిపోతే కనీసం శరీరం కూడా ఫ్యామిలీకి అప్పగించలేని దీన స్థితినే దర్శకుడు ఇందులో మెయిన్ పాయింట్ గా తీసుకున్నాడు. అక్కడే అతని తెలివితేటలు బయటపడ్డాయి. నిజానికది ఊహకందనిది. రియల్ లైఫ్ లోనూ ఇలాంటి సంఘటనలు పేపర్లో చూస్తూనే ఉన్నాం. నిఖిల్ భట్ మొత్తం రెండు గంటలలోపే నడిచే సిరీస్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని డీసెంట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోదగ్గ ప్రోడక్ట్ ఇచ్చాడు. కథ పూర్తిగా చెప్పలేదు కాబట్టి మిగిలిన ఎపిసోడ్స్ కోసం ఎదురు చూసేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఇది అసంపూర్ణంగా మిగిలిపోయింది.

నయన్ తారా భత్కల్ సంగీతం మూడ్ కి తగట్టు సాగింది. పదే పదే రిపీట్ అనిపించే ఫ్రేమ్స్ నుంచి దర్శకుడు కోరుకున్న టెంపోని తన సౌండ్ ద్వారా ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. బీజీఎమ్ స్కోర్ చాలా డిఫరెంట్ గా సాగడం హెల్ప్ అయ్యింది. పియూష్ పుటి ఛాయాగ్రహణం గురించి గొప్పగా చెప్పుకోవడానికి లేకపోయిన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మట్ కి భిన్నంగా అన్ని పాత్రలను కెమెరా కన్ను ద్వారా చూపించే ప్రయత్నాన్ని బాగా ఆవిష్కరించాడు. మనీష్ మిస్త్రీ ఎడిటింగ్ క్రిస్పీగానే ఉంది. నిర్మాణం గురించి చెప్పడానికి ఏమి లేదు. లక్షల్లో సినిమాలు సిరీస్ లు ఎలా తీయొచ్చో చెప్పడానికి దీన్నో ఉదాహరణగా మలిచారు

కంక్లూజన్

లాక్ డౌన్ లో ఏర్పడిన పరిణామాలను తెరపై చూపించే ఉద్దేశంతో ఓ కుటుంబంలోని క్రైమ్ ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ది గాన్ గేమ్’ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ఇందులో ఎంటర్ టైనింగ్ అంశాలు ఉండవు. ఆధ్యంతం సీరియస్ గా సాగుతుంది. చాలా పరిమితుల మధ్య షూటింగ్ చేశారన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకుని చూడగలిగితే టీమ్ ఆలోచనా విధానం మనల్ని మెప్పిస్తుంది. అలా కాకుండా సినిమా తరహా అనుభూతిని ఆశిస్తే మాత్రం ది గాన్ గేమ్ స్కిప్ చేయక తప్పదు. ఇది ఓ విభిన్న ప్రయత్నం. వైరస్ మిగిల్చిన విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై సినిమా మేకింగ్ లో రాబోయే మార్పులను దృష్టిలో పెట్టుకుని చేసిన సిరీస్. ఆ కోణంలో చూస్తే నిరాశపరచదు కానీ అంచనాలు పెట్టేసుకుంటే మాత్రం ఇంతేనా గేమ్ అనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి