iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 54 – మిర్జాపుర్ 2

లాక్ డౌన్ రివ్యూ 54 – మిర్జాపుర్ 2

ఈ మధ్యకాలంలో విడుదలకు ముందు ఒక ఇండియన్ వెబ్ సిరీస్ కు విపరీతమైన హైప్ రావడం మిర్జాపుర్ విషయంలోనే జరిగింది. 2018లో వచ్చిన మొదటి సీజన్ కు బోలెడు విమర్శలు వచ్చినప్పటికీ సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. దానికి తోడు అమెజాన్ ప్రైమ్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రమోట్ చేయడంతో సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందులో నటించిన ఆర్టిస్టులకు అమాంతం డిమాండ్ పెరిగి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయంటే దీని రేంజ్ ఏంటో చెప్పొచ్చు. మరి ఇంతగా హైప్ తెచ్చుకున్న మిర్జాపుర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

ఫస్ట్ సిరీస్ చూసి ఉంటేనే సీజన్ రెండు స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే అయోమయం తప్పదు. తమ్ముడిని చంపి తనను అవిటివాడిని చేసిన పగతో ఎలాగైనా మున్నా(దివ్యెందు శర్మ), అతను తండ్రి అఖండానంద్ అలియాస్ కలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి)ని చంపాలని అజ్ఞాతంలో వేచి చూస్తుంటాడు గుడ్డు పండిట్(అలీ ఫజల్). అయితే మిర్జాపుర్ మీద తన పట్టు తగ్గిపోతోందని గుర్తించిన కలీన్ రాజకీయంగా ఎదగాలని గుర్తించి ఏకంగా సిఎం సూర్య ప్రతాప్(పారితోష్ సంద్)తో పరిచయం పెంచుకుంటాడు. అందులో భాగంగానే అతని విధవ కూతురు మాధురి యాదవ్(ఇషా తల్వార్)తో మున్నా పెళ్లి జరిపిస్తాడు.

మరోవైపు గుడ్డు లక్నో నుంచి దందా మొదలుపెట్టి కలీన్ కు సవాల్ విసరడం మొదలుపెడతాడు. అధికారం కోసం తమ్ముడు చేసిన కుట్రలో ముఖ్యమంత్రి చనిపోతాడు. అయితే అనూహ్యంగా ఇతను లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడంతో పదవి కాస్తా కలీన్ కోడలు మాధురిని వరిస్తుంది. మరోవైపు ఇంట్లో తనను చెరిచిన మామ సత్యానంద్ త్రిపాఠి(కులభూషణ్ ఖర్బందా)మీద ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న కలీన్ భార్య బీనా (రసిక దుగ్గల్) తెరవెనుక గుడ్డుతో కుమ్మక్కై తన కుటుంబ పతనాన్ని మొదలుపెడుతుంది. గుడ్డుకు అండగా గోలు(శ్వేతా త్రిపాఠి)ఆయుధాల వ్యాపారంలో దిగుతుంది. ఆ తర్వాత ఈ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగి కలీన్ ప్రాణాల మీదకు తెస్తుంది. అదేంటి అనేది తెలియాలంటే సిరీస్ మొత్తం చూడాల్సిందే

నటీనటులు

పంకజ్ త్రిపాఠి మొదటి భాగంలాగే ఇందులో కూడా చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. ఎక్కడా అరవకుండా కేవలం ముఖకవళికలతోనే భయపెట్టే ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ కూల్ విలనీని పండించారు. నిజానికి ఛాలెంజింగ్ అనిపించే సీన్లు ఈయనకు పడకపోయినా తన బాడీ లాంగ్వేజ్ తో గుర్తుండిపోయేలా చేయడం పంకజ్ ప్రత్యేకత. తర్వాత మున్నా,గుడ్డులుగా గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేసిన దివ్యెందు శర్మ, అలీ ఫజల్ లు పోటీపడి మరీ జీవించేశారు. ఈ ఇద్దరి పాత్రల వల్లే మిర్జాపుర్ ఇంత వయొలెంట్ డ్రామాగా మెప్పించగలిగింది. ఇందులో హీరోయిన్లు లేకపోయినా శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్ లు అందంతో అభినయం కూడా చక్కగా ఒలకబోశారు.

సీనియర్ నటులు కులభూషణ్ ఖర్బందా చక్రాల కుర్చీలో నుంచే ఈ వయసులోనూ అంత ఇంటెన్సిటీని చూపడం అనుభవాన్ని చాటుతుంది. లేడీ విలన్ గా రసిక దుగ్గల్ ఆశ్చర్యపరుస్తుంది. కలీన్ అనుంగు అనుచరుడిగా షాజీ చౌదరి, గుడ్డు తండ్రిగా రాజేష్ తాయ్ లాంగ్, గుడ్డు చెల్లెగా హర్షితా గౌర్, సిఎం తమ్ముడిగా ప్రమోద్ పాఠక్, లాలాగా అనిల్ జార్జ్, దద్దాగా లిల్లీపుట్, కవల విలన్లుగా చేరిన విజయ్ వర్మ, అలక్ అమీన్, నేహా సర్గం, సంతోష్ భొకరే, మను రిషి, ప్రసన్న శర్మ, ప్రియాంశు పైంయులి తదితరులు తమకిచ్చిన క్యారెక్టర్లకు అనుగుణంగా సహజంగా జీవించేశారు. ఫలానా పాత్ర వేరొకరు చేసి ఉంటే బాగుండేదన్న తలంపు రాకుండా క్యాస్టింగ్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్స్ శ్రద్ధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

డైరెక్టర్ అండ్ టెక్నికల్ టీమ్

గుర్మీత్ సింగ్-కరణ్ అంశుమాన్ ల సంయుక్త దర్శకత్వంలో పునీత్ కృష్ణతో జత కూడి సృష్టించిన మిర్జాపుర్ సీజన్ 2 మొత్తం 10 ఎపిసోడ్లతో 9 గంటల నిడివి ఉంది. ఈసారి లెన్త్ బాగా పెంచేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సామాజిక రౌడీయిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఈ టీమ్ చేసిన కృషి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అయితే కథను పచ్చిగా చెప్పాలన్న ఉద్దేశంతో మితిమీరిన హింస, జుగుప్సాకర సన్నివేశాలను ఇందులో కూడా కొనసాగించారు. కాకపోతే ఫస్ట్ సిరీస్ కన్నా కొంచెం డోస్ తగ్గించడం ఒక్కటే కాస్త ఊరట కలిగించే విషయం. చాలా దారుణంగా పాత్రలు ప్రవర్తించే తీరు చూస్తుంటే నిజంగా ఆ రాష్ట్రంలో ఇంత విచ్చలవిడి పరిస్థితులు ఉన్నాయా అని అనుమానం వచ్చేలా ఉన్నాయి.

క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఇందులో కొన్నిసార్లు లాజిక్ కి మరీ దూరంగా వెళ్లిపోయారు. కలీన్ అంత సులభంగా సిఎంని ఏదో స్థానిక ఎమ్మెల్యేని కలిసినంత తేలిగ్గా పదే పదే వెళ్లడం, ఇద్దరి మధ్యా వియ్యం కుదరడం ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంచెం డ్రమాటిక్ గా ఉన్నాయి. ఇలాంటి గూండాలను పెంచి పోషించేది రాజకీయ వ్యవస్థే అయినప్పటికీ ఇందులో కొంత అసహజత్వంగా చూపడంతో కలీన్ ఫ్యామిలీని ఒకదశలో హీరో లెవల్ లో ప్రొజెక్ట్ చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడా కథ చెప్పే విషయంలో లోతు తగ్గకుండా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే ని సాగించినందుకు గురుమీత్ టీమ్ ని మెచ్చుకోవాలి. పాత్రల మధ్య ఇంటర్ లింక్, కొత్త క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టిన తీరు మరీ ఎక్కువ బోర్ కొట్టించకుండా సాగింది. కాకపోతే సీజన్ వన్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఆశిస్తే మాత్రం కష్టమే. యాక్టర్స్ నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్న తీరు మాత్రం నూటికి నూరు మార్కులు వేసేలా చేస్తుంది

జాన్ స్టీవార్డ్ ఏడూరి సంగీతం థీమ్ కు తగ్గట్టు సాగింది. ప్రత్యేకంగా మెరుపులు లేవు కానీ మూడ్ ని డిస్టర్బ్ చేయకుండా ఒకే టోన్ లో సాగింది. సంజయ్ కపూర్ ఛాయాగ్రహణం సినిమా స్థాయికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది. మనన్ మెహతా-అన్షుల్ గుప్తా ఎడిటింగ్ కూడాచెప్పుకోదగ్గ స్థాయిలోనే సాగింది. ఇంత నిడివి ఉన్నా ఎక్కువ విసుగు రాకుండా గట్టి ప్రయత్నమే చేశారు. విలాస్ పంచల్ ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు యథావిధిగా రిచ్ గా ఉన్నాయి. రియల్ టైం లొకేషన్స్ ఎంచుకోవడంతో పాటు పబ్లిక్ ప్లేసెస్ లో షూటింగ్ చేయడం చాలా న్యాచులర్ లుక్ తీసుకొచ్చింది

కంక్లూజన్

వెబ్ సిరీస్ కు సెన్సార్ ఉండదు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుని హింస, శృంగారం, భీభత్సం, భయానకం ఇలా అన్ని రసాలను ఎలాంటి హద్దులు లేకుండా చూపిస్తున్న మిర్జాపుర్ లాంటి సిరీస్ లు టార్గెట్ ఆడియన్స్ ని నిరాశ పరిచే అవకాశాలు తక్కువ. అయితే గ్యాంగ్ స్టర్స్ జీవితంలోని పతనాన్ని క్లైమాక్స్ లో చూపించినా అప్పటిదాకా నడిచిన వయొలెంట్ డ్రామా నిజంగా అంతో ఇంతో యువతను ప్రేరేపించేలా ఉందనే విమర్శకుల మాటలో నిజముంది. దుర్మార్గాన్ని ఈ స్థాయిలో ఎక్స్ ప్లోర్ చేస్తే అంతే మరి. ఫస్ట్ సీజన్ ని తెలుగులో డబ్బింగ్ చేసినప్పుడు వినడానికే జుగుప్సాకరంగా అనిపించే బూతులను రెండో భాగంలో చూసేందుకు మన ప్రేక్షకులు ఎంతగా తహతహలాడిపోతున్నారో సోషల్ మీడియాలో ప్రైమ్ పోస్టుల కింద కామెంట్స్ చూస్తే చెప్పొచ్చు. హింసను విపరీతంగా ఎంజాయ్ చేసే ఆసక్తి ఉంటే మాత్రమే మిర్జాపుర్ ని ట్రై చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి