iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 16 – నోట్ల రద్దు ఆటలు

లాక్ డౌన్ రివ్యూ 16 – నోట్ల రద్దు ఆటలు

లాక్ డౌన్ వేళ హిందీలో డిజిటల్ రిలీజులు ఊపందుకుంటున్నాయి. కనీసం వారానికి ఒకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్. అందులో భాగంగా నిన్న ‘చోక్డ్ – పైసా బోల్తా హై’ నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. అనురాగ్ కశ్యప్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందులోనూ గతంలో విడుదలైన ట్రైలర్ ఆసక్తి రేపెలా ఉండటంతో దీని కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు చాలానే ఉన్నారు. మరి ఈ చొక్ద్ అనుకున్న స్థాయిలో ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

సరితా పిళ్ళై(సయామీ ఖేర్)ఓ బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తుంటుంది. భర్త సుశాంత్ పిళ్ళై(రోషన్ మ్యాతివ్)ఉద్యోగం లేక ఇంటిపట్టునే ఖాళీగా ఉంటాడు. గిటారిస్ట్ కావడంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతనికి 15 వేలు అప్పు ఇచ్చిన రెడ్డి దాని కోసం సరితాకు ఫోన్ చేసి వేధిస్తుంటాడు. ఓ రోజు రాత్రి 3 గంటలకు కిచెన్ బేసిన్ దగ్గర ఏదో చప్పుడు కావడంతో పైపు తీసి చూసిన సరితా అందులో నుంచి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన పెద్ద నోట్ల కట్టలు దొరుకుతాయి. రోజూ అలా కలెక్ట్ చేసి అవసరాలు తీర్చుకుంటుంది సరితా. ఓ రోజు రాత్రి హటాత్తుగా ప్రధాని నరేంద్ర మోడీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారు . అక్కడి నుంచి వీళ్ళ జీవితం కొత్త మలుపులు తీసుకుంటుంది. అది సినిమాలోనే చూడాలి

నటీనటులు

క్యాస్టింగ్ ఎందరున్నా రెండు గంటల నిడివిలో మనకు ఎక్కువగా కనిపించేది సయామీ, రోషన్ లే. డబ్బు కష్టాలతో ఇబ్బందులు పడుతున్న సగటు మధ్య తరగతి జీవుల్లా ఇద్దరూ చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా సయామీ ఖేర్ విమెన్ అఫ్ ది షోగా చెప్పొచ్చు. మేకప్ లేకుండా భర్త చేతగానితనాన్ని భరిస్తూ నలిగిపోయే సరితగా జీవించేసింది. తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చింది. రోషన్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సయామీ ముందు కొంత తేలిపోయినట్టు అనిపించినప్పటికీ పాత్ర పరిధే అలాంటిది కాబట్టి ఫిర్యాదు చేయడానికి లేదు. పక్కింటి ఆవిడగా నటించిన అమృతా సుభాష్ స్వతహాగా మంచి నటే అయినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. ఇతర పాత్రల్లో రాజశ్రీ, తుషార్, ఉపేంద్రలు అలా చేసుకుంటూ పోయారు. కథ ప్రకారం ఎక్కువ స్కోప్ లేకపోవడంతో సింపుల్ గా పనికానిచ్చేశారు

డైరెక్టర్ అండ్ టీం

చొక్ద్ చూసేందుకు అందరికీ ఉన్న ప్రధాన కారణం దర్శకుడు అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ సినిమా మేకింగ్ ని కొత్త లెవెల్ కు తీసుకెళ్ళిన దర్శకుడిగా ఇతనికి చాలా ఫాలోయింగ్ ఉంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రియలిస్టిక్ టేకింగ్ కి ప్రాధాన్యం ఇచ్చే అనురాగ్ కశ్యప్ ఇందులో కూడా నోట్ల రద్దు అనే చక్కని కాన్సెప్ట్ తీసుకున్నాడు కాని దాన్ని వాహ్ అనిపించేలా మలచలేకపోయాడు. టేకాఫ్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ అసలు కథలోకి ప్రవేశించదానికి చాలా సమయం తీసుకున్నారు అనురాగ్. పాత్రల తీరు, వీటి మధ్య సంఘర్షణకు అంత నిడివి అవసరం లేకపోయినా ఎమోషన్ ని రిజిస్టర్ చేయాలన్న ఉద్దేశంతో అలా చేశారు కాని అదే కొంత వరకు మైనస్ అయ్యింది.

నోట్ల రద్దు ప్రకటన వచ్చాకైనా కథనం పరుగులు పెడుతుందని ఆశిస్తే అలా జరగదు. అందులోనూ కీలకం అనిపించే మలుపులు ఏవీ లేకపోవడంతో చొక్ద్ ఆశించిన సర్ప్రైజ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. అలా అని అసలు చూడలేనిదని కాదు. అనురాగ్ కశ్యప్ మీద ఏవేవో అంచనాలు ఆశలు పెట్టేసుకుంటే మాత్రం ఆ స్థాయిలో చొక్ద్ అనిపించదు. ఓ రెండు గంటలు అలా టైం పాస్ కావాలంటే లుక్ వేయొచ్చు కాని హింది వెండితెరపై అనురాగ్ కశ్యప్ చేసిన సంతకం మాత్రం ఇందులో సగమే కనిపిస్తుంది

కర్ష్ కాలే సంగీతం పర్వాలేదు. అవసరం లేని రెండు పాటలు కూడా అడ్డంకిగానే తోస్తాయి. నేపధ్య సంగీతం సోసోనే. కొన్ని సన్నివేశాల్లో సింక్ అవ్వని స్కోర్ ఇచ్చాడు. సిల్వెస్టర్ ఫోన్సెకా ఛాయాగ్రహణం బాగుంది. ఇరుకైన ముంబై జీవనాన్ని చాలా న్యాచురల్ గా చూపించాడు. లొకేషన్స్ కూడా ప్లస్ కావడంతో అక్కడే వీధుల్లో తిరుగుతూ వాళ్ళ మధ్య కథను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సబ్జెక్టు పరంగా డిమాండ్ చేసేది కాదు కాబట్టి బడ్జెట్ పరిమితుల్లోనే మంచి క్వాలిటీ చూపించారు నిర్మాతలు. బ్యాంకు సెటప్, పాత నోట్ల కట్టలు ఇలాంటివాటిలో సహజత్వం కనిపిస్తుంది

చివరి మాట

పాంచ్, బ్లాక్ ఫ్రైడే, దేవ్ డి, గులాల్, రమణ్ రాఘవ్ లాంటి ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు అందించిన అనురాగ్ కశ్యప్ నోట్ల రద్దు వల్ల సగటు జీవులు ఎన్నో కష్టాలు అనుభవించారో ఒక చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి చెప్పే ప్రయత్నమే ఈ చొక్డ్. అప్పటి గందరగోళాన్ని కళ్ళకు కట్టినట్టు చూపడంలో డ్రామాను పండించడంతో కొంత మేర సఫలీకృతమైనప్పటికి ఇది అనురాగ్ మార్క్ మూవీ కాదనే అసంతృప్తి మాత్రం చివరిగా మిగులుతుంది. అలా కాకుండా ఓ సగటు ఎంటర్ టైనర్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే జస్ట్ పర్వాలేదు అనిపించుకుంటుందే తప్ప ఇంకోసారి చూడాలనే ఆలోచన మాత్రం రప్పించదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి