iDreamPost

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వైపు ఏపీ వ‌డివ‌డిగా అడుగులు

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వైపు ఏపీ వ‌డివ‌డిగా అడుగులు

ప్ర‌జ‌లు పెరుగుతారు కానీ.. భూమి పెర‌గ‌దు. ఉన్న భూమినే అంద‌రూ పంచుకునే క్ర‌మంలో ఎన్నో వివాదాలు, మ‌రెన్నో స‌మ‌స్య‌లు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప‌ట్ట‌ణం, ప‌ల్లె తేడా లేకుండా భూ వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టి వివాదాలు త‌లెత్త‌కుండా క‌చ్చిత‌మైన వివ‌రాల న‌మోదుకు భూ రీ స‌ర్వే చేప‌ట్టాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మూడు ద‌శ‌ల్లో పూర్తి చేయ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని తొలి ద‌శ ఈ నెల 21 న ప్రారంభం కానుంది. 2023 నాటికి మూడు దశల్లో స‌ర్వే పూర్త‌య్యేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. దీని కోసం మ‌14 వేల మంది సర్వేయర్లకి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. భూ యాజమానికి పూర్తి భద్రత కల్పించేందుకు ప్ర‌భుత్వ‌మే రీ స‌ర్వే కోసం 956 కోట్లను కేటాయించింది. ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియాతో ప్ర‌భుత్వం బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది.

అస‌లైన య‌జ‌మానికి పూర్తి హ‌క్కులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సుమారు వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగిన‌ట్లు తెలుస్తోంది. ఆ దిశ‌గా మ‌ళ్లీ ఏ ప్ర‌భుత్వ‌మూ దృష్టి సారించ‌లేదు. మళ్లీ ఇప్పుడు రీ స‌ర్వే జరుగుతోంది. భూమి విలువ పెరగడంతో భూసమస్యలు పెరిగాయి. రీసర్వే ద్వారా భూవివాదాలకి పరిష్కారం‌ లభిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే భూములకి రీసర్వే చేసి రాళ్లు కూడా వేయడం జరుగుతుంది. రీసర్వే ద్వారా అసలైన యాజమానికి‌ పూర్తి హక్కులు లభిస్తాయి. అదే విధంగా రీసర్వే తర్వాత సంబంధిత భూములపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ప్ర‌భుత్వం క‌ల్పించ‌నుంది. అటవీ భూములు మినహాయించి వ్యవసాయ భూములు, గ్రామనకంఠాలు, పట్టణాలలోని భూములన్నింటికీ రీసర్వే జరుగుతుంది. 17340 గ్రామాలలో మూడు ఫేజులలో రీసర్వే పూర్తి చేస్తాం. మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని, మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తెలిపారు.

సర్వే ఇలా..

గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర 17,460 గ్రామాల్లో సర్వే చేయ‌నున్నారు. మొదటి విడతలో 5 వేలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే. పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే జ‌ర‌గ‌నుంది. 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో, 2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూముల్లో రీ స‌ర్వే చేయ‌నున్నారు. సర్వే తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు, కార్డులో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ప్రాపర్టీ (భూమి) కొలతలు మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. క్యూ ఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. సర్వే పూర్తైనతర్వాత డిజిటైజ్డ్‌ కాడస్ట్రల్‌ మ్యాప్‌లు త‌యారు చేస్తారు. గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉంటాయి. భూ కొలతలు పూర్తైనతర్వాత సర్వే రాళ్లు పాతుతారు. గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్‌ రిజిస్టర్‌, వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్‌ చేయలేని రీతిలో భద్రపరిచేలా ఆధునిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం రూపొందించ‌నుంది. సెక్యూరిటీ ఫీచర్స్‌ పటిష్టంగా ఉండాలని, ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలి. భూ యజమానుల వద్ద హార్డ్‌ కాపీ ఉండేలా చూడాలని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి