iDreamPost

Laal Singh Chaddha లాల్ సింగ్ మెడకు పాత వివాదాలు

Laal Singh Chaddha లాల్ సింగ్ మెడకు పాత వివాదాలు

సరిగ్గా ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న లాల్ సింగ్ చడ్డాను కోరుకోని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం అమీర్ ఖాన్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇండియా అంత సురక్షితంగా కనిపించడం లేదని తను అప్పట్లో చేసిన కామెంట్స్ ని ఇప్పుడు బయటికి తీసి ఈ సినిమాను బ్యాన్ చేయాలనే నినాదాలు ఊపందుకున్నాయి. అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా వీటిని ఖండిస్తూ మద్దతివ్వమని అడుగుతున్నాడు కానీ ఫేస్ బుక్. ట్విట్టర్ వగైరాలు గమనిస్తే ఇదో పెద్ద తలనెప్పి అయ్యేలా ఉంది. కరీనా కపూర్ సైతం తన కొడుక్కి తైమూర్ అని పేరు పెట్టిన సందర్భంలో కొంత కాంట్రావర్సీ రేగిన విషయం గుర్తే.

ఇప్పుడీ పాత పంచాయితీలన్నీ లాల్ సింగ్ ను కమ్మేస్తున్నాయి. ట్రెండింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇది కొంత వరకు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే ఇబ్బంది లేదు. లేదూ ఏదో పర్లేదు అన్నా చాలు ఆడేసుకుంటారు. అప్పట్లో ఈ వివాదం టైంలో అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న స్నాప్ డీల్ యాప్ ని కొన్ని లక్షల మంది డిలీట్ చేసుకోవడం సంచలనం రేపింది.. దెబ్బకు సదరు సంస్థకు తీవ్ర నష్టాలు తప్పలేదు. యాంటీ ఇండియన్ అంటూ అమీర్ ఖాన్ మీద విరుచుకుపడ్డారు నెటిజెన్లు. సరే అందరూ మర్చిపోయి ఉంటారనుకుంటే మళ్ళీ తిరగతోడటం విశేషం.

అసలే బాలీవుడ్ బాక్సాఫీస్ కు భూల్ భూలయ్యా 2 తర్వాత ఆశించిన జోష్ లేదు. సామ్రాట్ పృథ్విరాజ్, షంషేరాలు దారుణంగా దెబ్బ తినడం ట్రేడ్ ని విపరీత నష్టాలకు గురి చేసింది. నార్త్ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించేశారు. ది కాశ్మీరీ ఫైల్స్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత ఆ స్థాయిలో జనాన్ని ఎవరు హాలుకు రప్పించలేకపోయారు. ఉన్నంతలో సౌత్ ప్రేక్షకులు చాలా నయం. ఇలాంటి పరిస్థితిలో లాల్ సింగ్ చడ్డా మెడకు ఈ పాత వివాదాల గోల చుట్టుకోవడం అంత మంచిది కాదు. అందులోనూ ఇది హాలీవుడ్ మూవీ రీమేక్. ది ఫారెస్ట్ గంప్ ని ఇక్కడి అభిరుచులకు అనుగుణంగా మార్చి తీశారు. మరి అమీర్ ఈ గండాన్ని ఎలా దాటుకుంటాడో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి